ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగగా పేరుపొందిన మేడారం జాతరకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. తాజాగా ఈ ఏడాది మేడారం జాతరకు వెళ్లే భక్తులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే జన్ సాధారణ్ పేరుతో రైళ్లు నడపనున్నట్లు ప్రకటించగా.. జాతర కోసం టీఎస్ ప్రభుత్వం 6 వేల బస్సులు కేటాయిస్తున్నట్లు తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా కొలుపుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఏడాది మేడారం జాతర నిర్వహణను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ మేడారం జాతర ఫిబ్రవరి 22న ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో జాతర కోసం ఇప్పటికే ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లను పూర్తిచేసింది. తాజాగా.. మేడారం జాతరకు వెళ్లే భక్తులకు తెలంగాణ సర్కారు ఓ శుభవార్తను తీసుకొచ్చింది. మేడారం జాతరకు వెళ్లే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే 30 జన్సాధారణ్ప్రత్యేక రైళ్లను ప్రయాణికుల కోసం అందుబాటులోకి తెస్తోంది.తాజాగా వీటితో పాటు 6 వేల బస్సులను మేడారానికి నడుపుతున్నట్లు తెలంగాణ సీఎస్ శాంతి కుమారి వెల్లడించారు.

4,800 సీసీ టీవీ కెమెరాలతో నిఘా
ఇప్పటికే మేడారం జాతర నిర్వహణ ఏర్పాట్లపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎస్ శాంతికుమారి సమీక్ష నిర్వహించారు. ఫిబ్రవరి 22న మేడారం జాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో అంతకంటే ముందే భక్తులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నట్లు వెల్లడించారు. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని జాతరకు హాజరయ్యే భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు.
ఇక, ఈ జాతరలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా 4,800 సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. పటిష్టమై నిఘాతోపాటు భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చూసుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వీటితో పాటు తెలంగాణ రాష్ర్టంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆరువేల బస్సులను మేడారం జాతర సమయంలో ఏర్పాటు చేయనున్నారు.

ఫిబ్రవరి 18 నుంచి 26 వరకు ప్రత్యేక బస్సులు
జాతరకు ఏర్పాటు చేసే ప్రత్యేక బస్సుల కోసం యాభైఐదు ఎకరాల విస్తీర్ణంలో తాత్కాలిక బస్టాండ్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఈ ప్రత్యేక బస్సులు ఫిబ్రవరి 18 నుంచి 26 వరకు అందుబాటులో ఉంటాయి. అలాగే, ఈ బస్సులు నడిపేందుకు తొమ్మిదివేల మంది బస్ డ్రైవర్లను ప్రభుత్వం నియమించింది. ఈ బస్సులతోపాటు దక్షిణ మధ్య రైల్వే 30 జన్‌సాధారణ్ ప్రత్యేక రైళ్లను ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు నడవనున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.
ఈ రైళ్లు సికింద్రాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, నిజామాబాద్, సిర్పూర్ కాగజ్ నగర్ మొదలైన ప్రాంతాల నుంచి నేరుగా వరంగల్ రైల్వేస్టేషన్ కు చేరుకుంటాయి. పారిశుధ్య నిర్వహణ కోసం పెద్ద ఎత్తున సిబ్బందిని నియమించారు. అలాగే, భక్తలకు అవసరమైన 5,600 మరుగుదొడ్లను ఏర్పాటు చేయడంతో పాటు వాటి నిర్వహణకు వెయ్యి మందిని నియమించారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం జాతరకు అవసరమైన ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టిసారించిన విషయం తెలిసిందే.



Click it and Unblock the Notifications












