ఉత్తరాంధ్ర రైల్వే ప్రయాణికులకు రైల్వే అధికారులకు శుభవార్తను అందించారు. విశాఖ-పలాస ప్యాసింజర్ ట్రైన్‌ను పొడిగించారు. విశాఖపట్నం నుంచి పలాస వరకు ప్యాసింజర్ ట్రైన్ నడిచేది. అయితే, ఈ ట్రైన్‌ను ప్రయాణికుల సౌకర్యార్థం బ్రహ్మపుర స్టేషన్ వరకు పొడిగించినట్లు అధికారులు తెలిపారు. విశాఖ-పలాస మధ్య నడుస్తున్న మెమూ రైలును ఇచ్ఛాపురం మీదుగా ఒడిశాలోని బరంపురం వరకు కొనసాగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ప్రకటనతో ఉత్తరాంధ్ర ప్రయాణికులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ప్రయాణికుల సౌకర్యార్థం
శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి పాసింజర్ ట్రైన్ సౌకర్యం అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యం విశాఖ నగరానికి ఈ ప్రాంతం నుంచి ప్రయాణాలు చేస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా పాసింజర్ సౌకర్యం లేకపోవడంతో వృద్ధులు, కిడ్ని సంబంధింత వ్యాధిగ్రస్తులు తెల్లవారుజామునే బస్సుల్లో ప్రయాణించేందుకు ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తోంది. దీంతో ప్రయాణికుల సౌకర్యార్థం మేరకు విశాఖ-పలాస ప్యాసింజర్ ట్రైన్ బ్రహ్మపుర స్టేషన్ వరకు పొడిగిస్తూ రైల్వే అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. రైల్వే అధికారులు తీసుకున్న ఈ నిర్ణయంపై శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు ఆనందం వ్యక్తంచేశారు.
మార్చి ఒకటి నుంచి ప్యాసింజర్ ట్రైన్ పొడిగింపు ప్రారంభం..
మార్చి ఒకటో తేదీ నుంచి విశాఖ- పలాస పాసింజర్ రైలు బ్రహ్మపుర స్టేషన్ వరకు నడుస్తోంది. ఈ ప్యాసింజర్ ట్రైన్ బ్రహ్మపురలో తెల్లవారుజామున 3.50 గంటలకు బయలుదేరుతుంది. ఇచ్ఛాపురం (4.09), సోంపేట (4.22), మందస (4.33) పలాస (5.00), విశాఖపట్నం (9.20) చేరుకుంటుంది. ఇదే ట్రైన్ తిరిగి విశాఖపట్నంలో సాయంత్రం 5.45కు బయలుదేరి రాత్రి 10.31 సమయానికి ఇచ్ఛాపురం చేరుకోగా, బ్రహ్మపురానికి రాత్రి 10.47కి చేరుకుంటుంది.

ఇదిలా ఉండగా, ఈ ట్రైన్‌ను బారువ ఆర్.ఎస్. (కొర్లాం) లో నిలిపేలా చర్యలు తీసుకోవాలని జాగృతి స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు రాంబుడ్డి గణపతి అధికారులను విన్నవించుకోవడం జరిగింది. రైల్వే అధికారులు ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలపడంతో జిల్లాకు చెందిన ఉద్యోగులకు, చిరువ్యాపారులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని ఆయన అన్నారు.
రైల్వే వ్యవస్థపై ఫోకస్ పెట్టారు..
ఇక, విశాఖ - పలాస ప్యాసింజర్ ట్రైన్ బ్రహ్మపుర వరకు పొడిగించేందుకు కృషిచేసిన రైల్వే ఉన్నతాధికారులకు పలువురు నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ బాధ్యతలు చేపట్టిన తర్వాత రైల్వేపై ఎక్కువగా దృష్టిసారించిన విషయం తెలిసిందే. తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణం చేసే వీలు రైలు వల్ల కలగడంతో ప్రజల ప్రయాణ సౌకర్యానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టం చేశారు.

అందుకు అనుగుణంగానే వందే భారత్ రైళ్లు, అమృత్ భారత్ రైళ్లతోపాటు దేశవ్యాప్తంగా అమృత్ భారత్ పేరుతో రైల్వేస్టేషన్లను అభివృద్ధి చేస్తూ వస్తున్నారు. దీంతోపాటు సిగ్నలింగ్ వ్యవస్థవల్ల ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు వాటిని ఆధునికీకరించే పనులు ఇప్పటికే శరవేగంగా జరుగుతున్నాయి. తాజా ప్రకటనతో కుటుంబసమేతంగా విశాఖ నగరానికి విహారానికి వెళ్లేవారి సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.



Click it and Unblock the Notifications












