వేసవి విహారానికి దేశంలోని తీరప్రాంతాలు పెట్టింది పేరునే చెప్పాలి. అయితే, గోవాలాంటి కొన్ని ఫేవరెట్ టూరిస్ట్ ప్రదేశాలకు కుటుంబసమేతంగా వెళ్లేందుకు వెనుకంజవేస్తుంటారు. అలాంటి వారి సమ్మర్ వెకేషన్‌కు కేరాఫ్ అడ్రస్ మౌసుని దీవి. మినీ గోవాగా పిలుచుకునే ప్రకృతిసిద్ధమైన ఈ ప్రదేశం వేసవి విహారానికి ఎంతో అనువుగా ఉంటుంది. మరెందుకు ఆలస్యం మౌసుని దీవి విశేషాలను చూద్దాం రండి!
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని అందమైన పర్యాటక ప్రదేశం మౌసుని. దీనిని మినీ గోవా అని కూడా అంటారు. సమ్మర్ వచ్చిందంటే చాలు, ప్రతి ఏటా దేశ విదేశాల అనేక మంది పర్యాటకులు కుటుంబసమేతంగా ఇక్కడ వాలిపోతుంటారు. మరీ ముఖ్యంగా ఈ ప్రాంతం బంగాళాఖాతానికి చేరువగా ఉండడంతో టూరిస్టుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు, పశ్చిమ బెంగాల్ అంటేనే అందమైన తీరప్రాంతాలకు కేరాఫ్ అడ్రస్ మరి. ఇక్కడి బీచ్‌లు అందంతోపాటు పర్యాటకులను ఆకర్షించేలా పరిశుభ్రంగా ఆహ్వానిస్తుంటాయి. వారాంతాల సమయంలో ఇక్కడికి వచ్చే సందర్శకులతో ఈ మినీ గోవా ఎంతో సందడిగా దర్శనమిస్తుంది.

ప్రశాంతమైన వాతావరణం
ఈ కారణాలతో పశ్చిమ బెంగాల్‌లోని మౌసుని దీవిని మినీ గోవాగా పిలుచుకుంటారు. బంగాళాఖాతం ఒడ్డున ఉన్న ఈ ద్వీపం సరిహద్దు ద్వీపాలలో ఒకటి. అలా మినీ గోవాగా ప్రసిద్ధి చెందిన ఈ ద్వీపంలో సేదదీరేందుకు టూరిస్టులు ఏడాది పొడవునా ఇక్కడికి వస్తూనే ఉంటారు. మౌసుని ద్వీపం ప్రత్యేకత గురించి ఇక్కడ చెప్పుకోవాలి. నిత్యం.. ఇక్కడి వాతావరణం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఈ కారణంగా పని ఒత్తిడితో సతమతమయ్యేవారు తీరప్రాంతంలో హాయిగా గడిపేందుకు ప్రాధాన్యత ఇస్తుంటారు.
ఇక్కడి తీరప్రాంతపు ఒడ్డున కూర్చొని ప్రశాంతమైన వాతావరణంలో అందమైన ప్రకృతిని ఆస్వాదిస్తుంటే వచ్చే అనుభూతిని మాటల్లో వర్ణించడం కష్టమే. ఈ మినీ గోవాను సందర్శించాలనుకునే పర్యాటకులు ఇక్కడి సాహస కార్యకలాపాలను ఎంజాయ్ చేయడం అస్సలు మిస్సవ్వొద్దు. వాటర్ స్కీయింగ్, జెట్ స్కీయింగ్‌తోపాటు మౌసుని ద్వీపంలో స్కూబా డైవింగ్ మిమ్మల్ని ఎంతో ఆశ్చర్యపరుస్తాయి. ఇది కోల్‌కతా నుండి కేవలం 120 కిలోమీటర్ల దూరంలో ఉంది.

మంత్రముగ్దులు అవ్వాల్సిందే
మౌసుని ద్వీప ప్రాంతంలో చెప్పుకోదగ్గ మరో విశేషం ఇక్కడి సూర్యోదయం, సూర్యాస్తమయం. ఈ సమయాలలో అక్కడి ప్రకృతి దృశ్యాన్ని చూసినవారెవ్వరైనా మంత్రముగ్దులు అవ్వాల్సిందే. అలాగే, మౌసుని ద్వీపం చుట్టూ ఇలాంటి ద్వీపాలు చాలా ఉన్నాయి. మౌసుని ద్వీపానికి దగ్గరలో ఉన్న జంబూ ద్వీపం కూడా పర్యాటకానికి మంచి ప్రసిద్ధి పొందింది. సాయంత్రపు సమయంలో సముద్రం ఒడ్డున అలరించే కెరటాల సవ్వడులు మనసుకు ఎంతో ఉపశమనాన్ని అందిస్తాయి. అయితే, ఈ ద్వీపంలోకి అడుగుపెట్టాలంటే మాత్రం ముందుగా ఇక్కడి అధికారుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది.
మౌసుని ద్వీపం సమీపంలో బక్కలి పేరుతో ప్రసిద్ధి చెందిన అందమైన ప్రదేశం ఉంది. ఈ ప్రాంతం ప్రకృతి ప్రేమికులకు స్వర్గంధామంగా పేరుపొందింది. అయితే, మౌసుని ద్వీపం నుండి బక్కలి చేరుకునేందుకు పడవ ప్రయాణం చేయాల్సి ఉంటుంది. మరెందుకు ఆలస్యం.. ఈ వేసవి సీజన్‌లో మిని గోవాలో పర్యటించి.. ప్రశాంతతను చేరువచేసుకునేందుకు ఇప్పుడే మీ ప్రయాణాన్ని మొదలుపెట్టండి.



Click it and Unblock the Notifications













