సంక్రాంతి పండుగను భారత దేశంలోని వివిధ ప్రాంతాలలో విభిన్న రీతులలో జరుపు కొంటారు. ప్రత్యేకించి, ఆంధ్ర ప్రదేశ్ లోని గ్రామీణ ప్రాంతాలలో ఈ సంక్రాంతి పండుగను ఎంతో వైభవంగాను, కోలాహలంగాను కుటుంబ సభ్యులందరూ ఒక్క చోట చేరి జరుపుకొని ఆనందిస్తారు. సంక్రాంతి పండుగ నాలుగు రోజుల పండుగగా చాలామంది చేస్తారు. మొదటి రోజు భోగి, రెండవ రోజు, సంక్రాంతి పండుగ అంటే ప్రధాన పండుగ గాను , మూడవ రోజున కనుమ పండుగ, నాలుగవ రోజు ముక్కనుమ పండుగ అంటారు.

మొదటి రోజు భోగి పండుగ. ఈ రోజున ప్రతి ఒక్కరూ ఉదయమే లేచి ఇంటిలోని పనికి రాని కొయ్య మొదలగు పాత వస్తువులను తగులబెట్టి, భోగి మంటలుగా వేస్తారు. నూతన వస్తువులకు స్వాగతం పలుకుతారు. పాత చెడు అలవాట్లను వదలి మంచి అలవాట్లకు మారాలని కూడా ఇది సూచిస్తుందని నమ్ముతారు.
గ్రామీణ ప్రాంతాలలో మూడు సంవత్సరాల వయసు లోపలి పిల్లలకు 'రేగి పండ్లు ' పూవుల తో, ఇతర చిల్లర నాణేములతో కలిపి తలపై పోస్తారు. ఈ చర్య తమ పిల్లలను చెడు దృష్టి నుండి కాపాడుతుందని నమ్ముతారు. స్వీట్లు పంచి పెడతారు. ఈ సమయంలో చుట్టుపక్కల కల అన్ని కుటుంబాల వారూ కలుస్తారు. ఈ పండుగ సమయంలో సోదరులు తమ వివాహిత సోదరీ మణులకు ప్రేమకు చిహ్నంగా బహుమతులనిస్తారు. యజమానులు తమ పనివారికి తగినంత ధాన్యం, దుస్తులు, సొమ్ము వంటి వాటిని కూడా పంపిణీ చేస్తారు.

సంక్రాంతి పండుగ మూడవ రోజున, అంటే కనుమ రోజున తమ పొలాలలో నిరంతరం శ్రమించే పశువులను కూడా అలంకరించి పూజలు చేస్తారు. ఈ రోజున ప్రయాణాలను మొదలు పెట్టటం ఆశుభంగా భావిస్తారు. మరణించిన తమ బంధు వర్గానికి మతపర క్రియలు ఆచరిస్తారు.
పండుగ నాల్గవ రోజైన ముక్కనుమ నాడు సాధారణంగా మాంసాహారులు తాము ఇష్టపడే వివిధ మాంసాహార వంటకాలు తిని ఆనందిస్తారు. పండుగ లోని మొదటి మూడు రోజులూ కోస్తా జిల్లాల ప్రజలు మాంసాహారం తినరు. మొదటి మూడు రోజుల్లోనూ పొంగలి తో పాటు, అరిసెలు, అప్పాలు, దప్పళం వంటి పిండివంటలు చేసి తిని ఆనందిస్తారు.

సంక్రాంతి పండుగ వస్తోందంటే చాలు, గ్రామీణ మరియు టవున్ ప్రాంతాలు కోడి పందేలు, ఎద్దు పోట్లాటలు వంటి ఆటలతో పూర్తిగా కోలాహలంగా వుంటాయి. ఈ పందేలలో చట్ట వ్యతిరేక పందేలు భారీగా కాస్తారు. కోట్లాది రూపాయలు గడిస్తారు.
ఈ పండుగ రోజులలో ప్రతి రొజూ వేకువ ఝామునే హరిదాస సంకీర్తనం చేస్తూ ప్రతి ఇంటికీ తిరిగి దానములు స్వీకరించే హరిదాసులు ఒక ప్రత్యేక ఆకర్షణ. గంగిరెద్దుల యజమానులు ఎద్దులకు ఆకర్షణీయ దుస్తులు, రంగులు వేసి వాటిని ఇంటి ముందుకు తెచ్చి పాటలు పాడి దానం స్వీకరిస్తారు. దీనిని గంగిరెద్దు మేళం అంటారు.
ఈ సంక్రాంతి పండుగ రోజులలో హైదరాబాద్ నగరంలో పిల్లలూ, పెద్దలూ అందరూ కలసి, తమ తమ ఇండ్లపైకి ఎక్కి గాలి పటాలను ఎగుర వేయటం, ఆనందించటం ఒక సాంప్రదాయంగా కూడా కలదు.



Click it and Unblock the Notifications











