ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనంతో పాటు హుస్సేన్‌సాగర్ పరిసర ప్రాంతాల్లో గణేష్ నవరాత్రుల రద్దీ భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 15 (ఈరోజు) ఉదయం 11 గంటల నుంచి అర్ధరాత్రి వరకు అవసరాన్ని బట్టి ట్రాఫిక్ మళ్లింపులు విధించనున్నారు. నెక్లెస్ రోటరీ, ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్ బండ్ సహా వాటి అనుసంధాన రహదారులపై ఈ ప్రభావం పడనుంది. సెక్రటేరియట్, మాసబ్ ట్యాంక్ పరిసరాల్లో ప్రయాణించే వారు తీవ్ర జామ్‌ను ఎదుర్కొనే అవకాశం ఉన్నందున, ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లేవారు లేదా ఇతర ముఖ్యమైన పనులున్నవారు కాస్త ముందే ప్లాన్ చేసుకోవడం మంచిది.
రద్దీ ఎక్కువగా ఉండే సమయంలో వాహనాలు నిలిచిపోకుండా ఉండేందుకు రాజీవ్ గాంధీ విగ్రహం, రాజ్‌దూత్ లైన్, మింట్ కాంపౌండ్, ఖైరతాబాద్ పోస్ట్ ఆఫీస్ వద్ద ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు విధించి, వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లో మళ్లిస్తున్నారు. భక్తులు తమ వాహనాలను రేస్ కోర్స్ రోడ్డు, ఎన్టీఆర్ ఘాట్, హెచ్‌ఎమ్‌డీఏ ఐమాక్స్ పార్కింగ్, ఐమాక్స్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలం, విశ్వేశ్వరయ్య భవన్‌లలో కేటాయించిన పార్కింగ్ ప్రదేశాల్లోనే నిలపాల్సి ఉంటుంది. అలాగే రోడ్లపై ట్రాఫిక్ బ్లాక్ కాకుండా ఉండేందుకు క్యాబ్‌లు, ఆటోలు ఖైరతాబాద్ ఎమ్ఎమ్‌టిఎస్ (MMTS) స్టేషన్ పక్కన ఉన్న స్థలంలోనే పికప్, డ్రాప్ పూర్తి చేయాలని పోలీసులు స్పష్టం చేశారు.

హైదరాబాద్ గణేష్ ఉత్సవాలు: ఖైరతాబాద్ దర్శనానికి, ప్రయాణాలకు బెస్ట్ టైమింగ్స్ ఇవే!
బడా గణేష్ దర్శనానికి వెళ్లేవారు ఉదయం 8:30 గంటల కంటే ముందే వెళ్లడం మంచిది. లేదా మధ్యాహ్నం 1:30 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య సమయాన్ని ఎంచుకుంటే ట్రాఫిక్ తిప్పలు తగ్గుతాయి. ఇక ఆ బాటలో వెళ్లే సాధారణ వాహనదారులు ఉదయం 10 గంటల లోపు లేదా రాత్రి 10:30 గంటల తర్వాత ఆ మార్గాన్ని దాటేలా ప్లాన్ చేసుకోవాలి. సాయంత్రం వేళ ట్రాఫిక్ జామ్‌ల నుంచి తప్పించుకోవడానికి ఉదయం 6 నుంచి రాత్రి 11 గంటల వరకు నడిచే హైదరాబాద్ మెట్రో రైలు సేవలను వినియోగించుకోవడం శ్రేయస్కరం.
ఖైరతాబాద్ ట్రాఫిక్ ఆంక్షలు: ప్రత్యేక ఆర్టీసీ బస్సులు, మెట్రో సేవలు, కాలినడక మార్గాలు
ఉత్సవాల సందర్భంగా సెప్టెంబర్ 14 నుంచి 24 వరకు TGSRTC ప్రత్యేక బస్సులను నడుపుతోంది. జేబీఎస్, ఎంజీబీఎస్ నుంచి బయలుదేరే ఈ బస్సులు ట్యాంక్ బండ్, ఐమాక్స్, ఖైరతాబాద్, లక్డీకాపూల్ మీదుగా బాలాపూర్ వరకు వెళ్తాయి. జేబీఎస్ నుంచి మొదటి బస్సు ఉదయం 6:00 గంటలకు, చివరి బస్సు రాత్రి 9:55 గంటలకు అందుబాటులో ఉంటుంది. ప్రతి 40 నుంచి 50 నిమిషాల వ్యవధిలో ఇవి నడుస్తాయి. తిరుగు ప్రయాణ బస్సులు ఉదయం 7:55 నుంచి రాత్రి 11:50 వరకు నడుస్తాయి. అలాగే నడిచి వచ్చే భక్తుల కోసం ప్రత్యేక ఎంట్రీ, ఎగ్జిట్ మార్గాలను కేటాయించారు. ఖైరతాబాద్ జంక్షన్, షాదాన్ యూ-టర్న్, నిరంకారి వద్ద మాత్రమే రోడ్డు దాటడానికి అనుమతి ఉంది.
లేక్‌సైడ్ రోడ్ల మూసివేత, క్యాబ్ జోన్లు, వర్షం వస్తే ప్రత్యామ్నాయాలు!
రద్దీ నియంత్రణలో భాగంగా ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్‌లలో రాత్రి వేళల్లో కొన్ని మార్గాలను తాత్కాలికంగా మూసివేసే అవకాశం ఉంది. జరిమానాలు, జాప్యం నుంచి తప్పించుకోవడానికి క్యాబ్‌లను MMTS వైపు కేటాయించిన జోన్లలోనే బుక్ చేసుకోవడం మంచిది. సహాయం కోసం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ హెల్ప్‌లైన్ నంబర్ 9010203626ను సంప్రదించవచ్చు. గణేష్ దర్శనం సెప్టెంబర్ 23 వరకు మాత్రమే కొనసాగుతుంది, సెప్టెంబర్ 24న దర్శనాలు ఉండవు. వర్ష సూచన ఉన్నందున గొడుగులు వెంట తెచ్చుకోవడం మంచిది. వర్షం కురిస్తే లేక్‌సైడ్ క్యూలైన్లలో ఇబ్బంది పడకుండా మెట్రో లేదా ప్రత్యేక బస్సుల్లో ప్రయాణించడం శ్రేయస్కరం.



Click it and Unblock the Notifications