Search
  • Follow NativePlanet
Share
» »ఈ వేస‌విలో ఓరుగ‌ల్లు అందాల‌ను చూసేద్దామా!

ఈ వేస‌విలో ఓరుగ‌ల్లు అందాల‌ను చూసేద్దామా!

ఈ వేస‌విలో ఓరుగ‌ల్లు అందాల‌ను చూసేద్దామా!

వేస‌వి సెల‌వులు వ‌చ్చేశాయి. ఇంట్లో పిల్ల‌ల అల్ల‌రి మాములుగా ఉండ‌దు. ఇలాంట‌ప్పుడు పిల్ల‌ల్నిఎక్క‌డికైనా పంప‌డ‌మో, ఎక్క‌డికైనా తీసుకెళ్ల‌డ‌మో చేస్తే బాగుంటుంద‌ని అంద‌రూ అనుకుంటుంటారు. చాలామంది పిల్ల‌ల్ని అమ్మ‌మ్మ‌లు, తాత‌య్య‌ల ఇళ్ల‌కు అలాగే బంధువుల ఇళ్ల‌కు సొంతూర్ల‌కు పంపుతుంటారు. మ‌రికొంద‌రేమో విహార‌యాత్ర‌ల‌కు తీసుకెళుతుంటారు. విహార‌యాత్ర‌ల‌యితే పిల్ల‌లు కొత్త ప్ర‌దేశాల‌ను చూసిన‌ట్టు ఉంటారు. అక్క‌డి అందాల‌ను, అక్క‌డి సంప్ర‌దాయాల‌ను తిల‌కిస్తారు. అందుకే మీ పిల్ల‌ల్ని కూడా మీ ద‌గ్గ‌ర‌లోని ప్రాంతాల‌కు విహారాయాత్ర‌ల‌కు తీసుకెళ్లండి. వాళ్ల ఆనందాన్ని మీరు ద‌గ్గ‌రుండి చూడండి. ఇంత‌కీ ఆ ప్ర‌దేశం ఏంటో తెలుసుకుందాం పదండి.

అందమైన సరస్సులు, ప్రాచీన కట్టడాలు, పురాతన ఆలయాలు, కోటలు, దుర్గాలు, అభయారణ్యాలు ఇలా ఒక‌టేంటి ఎన్నింటినో ఈ ప్రాంతంలో చూడొచ్చు. అది కూడా అతిత‌క్కువ ఖ‌ర్చుతో ఒకటి రెండుమూడు రోజుల్లో అన్నింటిని చుట్టేయొచ్చు. తెలంగాణ రాష్ట్రంలోని వరంగ‌ల్ జిల్లాల్లో ఇలాంటి ఎన్నో ప‌ర్యాట‌క ప్రాంతాలు మీకు స్వాగ‌తం పలుకుతున్నాయి. ఈ ప్ర‌దేశాలు కూడా వంద కిలోమీట‌ర్ల దూరంలో ఉండ‌డం కూడా ఒక విశేషం. మ‌రెందుకాల‌స్యం వ‌రంగ‌ల్ ప‌ర్యాట‌క ప్రాంతాల‌ను చూసేందుకు మీ పిల్ల‌ల్ని సిద్ధం చేయండి. అక్క‌డి పురాత‌న ఆల‌యాలు, క‌ట్ట‌డాలు, వాటి నిర్మాణాల గురించి మీ పిల్ల‌ల‌కు వివ‌రించండి.

ancientramappatemple

పురాత‌న‌ రామప్ప దేవాల‌యం..

సహజసిద్ధమైన ప్రకృతి సోయగాల మధ్య ప్రశాంతమైన వాతారణంలో నెలకొన్నఈ ఆల‌యం ఇక్క‌డికొచ్చే సంద‌ర్శ‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. ములుగు జిల్లాకి ప‌దిహేను కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న వెంక‌టాపురం మండ‌లం పాలంపేట గ్రామంలో పురాత‌న రామప్ప దేవాల‌యం ఎంత‌గానో ప్ర‌సిద్ధి చెందింది. ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించిన రామప్ప దేవాల‌యం ఇప్పుడు ప్రఖ్యాత పర్యాటక ప్రాంతంగా ఖ్యాతి చెందింది. కాకతీయు అపురూప శిల్పకళావైభవానికి ప్రతీక ఈ ఆల‌యం. ఈ దేవాల‌యం ఎదురుగా ఉన్న నంది జగత్ప్రసిద్ధమైంది. జీవం ఉట్టిపడేలా క‌నిపించే ఈ విగ్రహం ఇక్క‌డికొచ్చే ప‌ర్యాట‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. రామప్ప ఆలయాన్ని అనుకొని ఇక్క‌డ ఒక పెద్ద సరస్సు ఉంది.

thousandpillaredtemple1

వేయిస్తంభాల గుడి

క్రీశ. 1163లో కాకతీయ రాజు రుద్రమ దేవుడు ఈ వేయిస్థంభాల గుడిని నిర్మించారు. ఈ గుడి వ‌రంగ‌ల్ ప్రాంతంలోనే అత్యంత ప్ర‌సిద్ధిగాంచింది. అంతేకాకుండా, ఎంతో పురాత‌న‌మైన‌ది. హనుమకొండ పట్టణం నడిబొడ్డున ఉన్న శ్రీ రుద్రేశ్వర స్వామివారి వేయిస్తంభాల గుడి కాకతీయుల నాటి అద్భుత నిర్మాణం. వేయి స్తంభాలగుడి త్రికూటాలయం. ఇందులోని శివలింగం ఎతైన పానవట్టంపై ప్రతిష్టితమై ఇక్క‌డికి వ‌చ్చే ప‌ర్యాట‌కుల‌ను ఆక‌ట్టుకుంటున్నాయి. ఆలయం మధ్యలో రంగమండపం, దాని చుట్టూ ఆద్భుత శిల్పరీతులతో స్తంభాలు సంద‌ర్శ‌కుల‌ను ఎంతో కనువిందు చేస్తాయి. ఆలయానికి ముందున్న అతిపెద్ద నందీశ్వరుడి విగ్రహం ప‌ర్యాట‌కుల‌కు స్వాగ‌తం ప‌లుకుతున్న‌ట్లుగా మ‌న‌కు అనిపిస్తుంది. గోడలకు బదులు స్తంభాలతోనే నిర్మితమైనందువల్లనే ఈ ఆలయాన్ని వేయిస్తంభాలగుడిగా పిలుస్తున్నారు.

orugallufort1

ఓరుగల్లు కోట

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని మరో ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం ఓరుగల్లు కోట. 12,546 అడుగుల వైశాల్యంతో చుట్టూ ఎతైన ఏడు ప్రాకారాలతో 77 బురుజులతో కాకతీయ రాజు రుద్రేదేవుడి కాలంలో నిర్మితమైంది. 800 ఏళ్లు అవుతున్నా కోట ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది. ఈ కోటలోని నాలుగు కీర్తితోరణాలు కాకతీయరాజుల ప్రాభవానికి నిలువెత్తు ప్రతీకలుగా దర్శనమిస్తాయి. కోటలో అద్భుతమైన శిల్ప సంపద కనిపిస్తుంది. కోటలోని స్వయం భూ దేవాలయం కాకతీయుల కాలంలో నిర్మించిందే. పర్యాటకుల సందర్శనార్థం కోట మధ్యకాలంలో ప్రతీరోజు కాకతీయుల చరిత్రను తెలియచెప్పే సౌండ్‌ అండ్‌ లైట్‌ షోను ప్రదర్శిస్తున్నారు. కోటలోని గుండు చెరువులో బోటింగ్‌ సౌకర్యం ఉంది.

kaleshwaramproject1

కాళేశ్వరం ప్రాజెక్టు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వర ఎత్తిపోతల ప్రాజెక్టు కూడా ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో ఒకటిగా మారింది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌ పూర్‌ మండలంలోని కన్నెపల్లి గ్రామం వద్ద గోదావరి నిదిపై నిర్మించిన ఈ ప్రాజెక్టు అత్య ద్భుతమైన భారీ కట్టడంగా సందర్శకులను విశేషంగా ఆక‌ట్ట‌కుంటుంది. వేసవి సెలవుల్లో ద ర్శనీయ స్థలాల్లో ఒకటిగా దీనిని ఎంచుకోవచ్చు. ప్రాజెక్టుకు దగ్గరలోనే సుప్రసిద్ధ కాళేశ్వర ముక్తీశ్వర దేవాలయం కూడా ఉంది. ఇది కూడా ప్రముఖ దర్శనీయ క్షేత్రాల్లో ఒకటి.

lakelucknow1

లక్నవరం సరస్సు

ములుగు జిల్లాలోని గోవిందరావుపేట మండలంలోని చల్వాయికి సుమారు 7 కిలోమీట‌ర్ల (బుస్సాపూర్‌) దూరంలో మారుమూల అడవిలో ప్రకృతి అందాలకు నెలవుగా ఉన్న లక్నవరం సరస్సు ప‌ర్యాట‌క ప్రేమికుల‌ను ఎంత‌గానో ఆకట్టుకుంటుంది. దీనిపై అత్యంత సుందరంగా నిర్మించిన వ్రేలాడే వంతెన ఇక్క‌డికి వ‌చ్చే సంద‌ర్శ‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ర్షిస్తుంది. పర్యాటకుల కోసం సరస్సులో బోటింగ్‌ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. ఇక్కడ ఒక రోజు బస చేయడానికి వీలుగా హరిత హోటల్‌ కూడా ఉంది.

bogotafalls1

బొగత జలపాతం

ములుగు జిల్లా కేంద్రానికి సుమారు 65 కిలోమీట‌ర్ల‌ దూరంలో వాజేడు మండలంలో దట్టమైన అడవి మధ్యలో జాలువారే నీటితో బొగత జలపాతం ప‌ర్యాట‌కుల మైమ‌రింప‌జేస్తుంది. బొగత జలపాతం సహజ సిద్ధమైంది. జలపాతం సహజ అందాలను దృష్టిలో ఉంచుకొని ఈ ప్రాంతంలో అప్పుడప్పుడూ సినిమా షూటింగ్‌లు, షార్ట్‌ పిల్మ్‌ల చిత్రీకరణ నిర్వ‌హిస్తుంటారు.

padmakshitemple1

పద్మాక్షి దేవాలయం

హనుమకొండలోని మరో దర్శనీయ స్థలం పద్మాక్షి దేవాలయం. కాకతీయుల ఆరాధ్య దేవత పద్మాక్షి. చుట్టూ ఎతైన కొండలు, ప్రకృతి అందాలతో అలరారే పరిసరాల మధ్య నెలవైన ఈ గుడి దర్శనంతో మనసుకు ఎంతో ప్రశాంతత క‌లుగుతుంది. ఈ గుడికి సమీపంలోనే జైనతీర్థంకులు కొలువుదీరిన అగ్గలయ్య గుట్ట ఉంది. ఇటీవలే దీనిని పర్యాట‌క ప్రాంతంగా తీర్చిదిద్దారు.

మేడారం సమ్మక్క - సారలమ్మ

ఆసియాలో కెల్లా అతిపెద్ద గిరిజన జాతర జరిగే సమ్మక్క సారలమ్మలు కొలువుదీరిన మేడారం కూడా సెలవుల్లో దర్శించదగిన పుణ్యక్షేత్రం. ములుగు జిల్లా కేంద్రానికి 45కిలోమీట‌ర్ల‌ దూరంలో తాడ్వాయి కేంద్రానికి 16 కిలోమీట‌ర్ల‌ దూరంలోని అడ‌విలో సమ్మక్క, సారలమ్మ కొలువై ఉన్నారు. ఈ జాత‌ర రెండేళ్లకోసారి జరుగుతుంది. ప్ర‌తిఏటా ఇక్క‌డికి కోటి మందికిపైగా భక్తులు త‌ర‌లి వ‌స్తుంటారు.

ఇత‌ర ప్రాంతాలు..

పాలకుర్తిలోని శ్రీ లక్ష్మీనర్సింహస్వామి ఆలయం, జఫర్‌గడ్‌ ఖిలా, బచ్చన్నపేట మండలం కొడవటూరులోని సిద్దేశ్వరాలయంకు, నర్సింహులపేటలోని ఇంద్రకీలాద్రి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, జనగామ జిల్లాలోని చిలుపూరుగుట్ట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, ఖిలాషపూర్‌లోని సర్వాయి పాపన్న కోట, వంటి ప్ర‌సిద్ధ ఆల‌యాలు చాలానే ఉన్నాయి.

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+