పశ్చిమ బెంగాల్ దాని గొప్ప సంస్కృతి, ఆహారానికి ఎంతగానో ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంతానికి అనేక ఇతర ప్రత్యేకతలు కూడా లేకపోలేదు. ఇక్కడికి రావడం ద్వారా భారతదేశ గతచరిత్ర గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. పశ్చిమబెంగాల్‌లోని రవీంద్రనాథ్ ఠాగూర్ శాంతినికేతన్ ఉంది. రవీంద్రనాథ్ ఠాగూర్ 1901లో శాంతినికేతన్‌లో ఒక చిన్న పాఠశాలను స్థాపించారు. అది నేడు ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరుగాంచింది. రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రసిద్ధ కవి, రచయిత. శాంతినికేతన్‌లో ప్రతిచోటా రవీంద్రనాథ్ ఠాగూర్ అవశేషాలను చూడొచ్చు.
శాంతినికేతన్ యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో కూడా చేర్చబడింది. ఈ సమయంలో కొత్త ప్రదేశాలను అన్వేషించాలనుకునేవారు తప్పకుండా శాంతినికేతన్‌ను సందర్శించొచ్చు. ఎందుకంటే, ఇక్కడ అనేక విషయాల గురించి తెలుసుకోవచ్చు. ఇది ఎంతో అందమైన ప్రదేశం, సాహసంతో కూడిన ప్రదేశం కూడా. ప్రసిద్ధ రచయిత, కవి రవీంద్రనాథ్ ఠాగూర్ జీవితానికి సంబంధించిన ప్రదేశం. ఈ ప్రాంతం ఎంతో ప్రశాంతంగా, భిన్నమైన వాతావరణంలో ఉంటుంది. ఇక్కడ ప్రసిద్ధిచెందిన ప్రదేశాల గురించి ఓసారి చూద్దాం పదండి.
శాంతినికేతన్
కోల్‌కతా నుండి సుమారు 180 కిలోమీటర్ల దూరంలో బీర్భూమ్ జిల్లాలోని బోల్పూర్‌లో శాంతినికేతన్ ఉంది. శాంతినికేతన్‌ను రవీంద్రనాథ్ ఠాగూర్ తండ్రి దేవేంద్రనాథ్ ఠాగూర్ స్థాపించారు. అనంతరం ఈ ప్రదేశం రవీంద్రనాథ్ ఠాగూర్ కారణంగా ఎంతో పేరుగాంచింది. ఈ ప్రదేశంలో రవీంద్రనాథ్ ఠాగూర్ చదివేందుకు, రాయడానికి ఒక ప్రత్యేకమైన విధానాన్ని ప్రారంభించారు.

శాంతినికేతన్ లో చూడదగిన ప్రదేశాలు ఇవే..
ఠాగూర్ హౌస్
శాంతినికేతన్‌లో రవీంద్రనాథ్ ఠాగూర్ ఎక్కువ సమయం గడిపిన ప్రదేశం ఠాగూర్ హౌస్. రవీంద్రనాథ్ ఠాగూర్ తండ్రి దేవేంద్రనాథ్ ఈ భవనాన్ని నిర్మించారు. ఇది ఎంతో అద్భుతమైన ప్రదేశం. ఈ భవనం చాలా పెద్దది. ఇందులో చాలా గదులు ఉన్నాయి. రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నవారు ఖచ్చితంగా శాంతినికేతన్‌లోని ఠాగూర్ హౌస్‌ని సందర్శించాల్సిందే.
కళా భవన్
శాంతినికేతన్ మరో ప్రత్యేక ప్రదేశం కళా భవన్. ఈ ప్రాంతం పూర్తిగా కళ మరియు సంస్కృతితో ముడిపడి ఉంటుంది. ఇదే కళాభవన్‌లో రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించిన విశ్వభారతి విద్యాసంస్థ కూడా ఉంది. కళా భవన్ గోడలపై ఉన్న పెయింటింగ్స్ పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. భారతదేశం మాత్రమే కాదు, ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు ఈ విద్యాసంస్థలో చదువుకునేందుకు వస్తారు.
అమర్ కుటీర్
శాంతినికేతన్‌లోని మరో ప్రసిద్ధిచెందిన ప్రదేశం అమర్ కుటీర్. దీనిని ఎన్‌సైక్లోపీడియా ఆఫ్ శాంతినికేతన్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ సంప్రదాయ పద్ధతిలో తయారైన ఉత్పత్తులను విక్రయిస్తారు. ఈ ప్రాంతాన్ని సందర్శించడం ద్వారా చేనేత, హస్తకళలు, అనేక ఇతర పాత వస్తువులను చూడొచ్చు.
విశ్వభారతి విశ్వవిద్యాలయం
శాంతినికేతన్‌లోని మరో ప్రత్యేకమైన ఆకర్షణ విశ్వభారతి విశ్వవిద్యాలయం. ఇక్కడికి వచ్చి ఆశ్రమ వ్యవస్థను చూడొచ్చు. ఇక్కడ ప్రకృతితో ముడిపడిన విద్య ప్రాముఖ్యతను వివరిస్తారు.
ఎలా చేరుకోవాలి?
శాంతినికేతన్‌ను చేరుకునేందుకు అనేక మార్గాలు అందుబాటులో ఉన్నాయి. రైలు మార్గం ద్వారా చేరుకోవాలనుకునే వారికి సమీప రైల్వే స్టేషన్ బోల్పూర్. ఇక్కడ నుండి శాంతినికేతన్ 2 నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బోల్పూర్ జంక్షన్ కోల్‌కతాలోని హౌరా, సీల్దా రైల్వే స్టేషన్‌లకు అనుసంధానించబడి ఉంది. ఇక, విమాన మార్గంలో వెళ్లాలనుకునేవారికి సమీప విమానాశ్రయం కోల్‌కత్తాలోని దమ్ డమ్ విమానాశ్రయం. శాంతినికేతన్ ఇక్కడికి దాదాపు 200కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
రోడ్డు మార్గం ద్వారా శాంతినికేతన్ చేరుకోవాలనుకునేవారు. కోల్‌కతా మీదుగా సులభంగా చేరుకోవచ్చు. బస్సులో వెళుతున్నట్లయితే, కోల్‌కతా, దుర్గాపూర్, గౌహతి వంటి నగరాల నుండి శాంతి నికేతన్‌కు బస్సులు సులభంగా అందుబాటులో ఉంటాయి. మరెందుకాలస్యం ఇక మీ ప్రయాణాన్ని మొదలుపెట్టండి మరి..



Click it and Unblock the Notifications












