దసరా సెలవుల్లో కొంగల జలపాతాల అందాలను చూసొద్దామా..
ఇప్పడు దసరా సెలవులు నడుస్తున్నాయి. విద్యార్థులకు, ఉద్యోగస్థులకు సెలవులే సెలవులు. ఈ సెలవులో సరదాగా కుటుంబంతో గడపాలనుకుంటున్నారా, ఈ వీకెండ్ టూర్ బోర్ కొట్టకుండా ఉండేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారా? అయితే, కొత్త ప్రదేశాల కోసం వెతుకుతున్నారు. ఈ సీజన్‌లో ఎక్కువగా చుట్టూ పచ్చదనంతో నిండిన ప్రాంతాలు, ఎత్తయిన కొండలు, వాగులు, వంకలు వంటి ప్రదేశాలను చూసేందుకే ఎక్కువమంది మొగ్గుచూపుతారు. ఆ జాబితాలో మీరు ఒకరైతే తప్పకుండా ఈ ప్రాంతాన్ని సందర్శించండి. హైదరాబాద్‌కు అతిచేరువలో ఉన్న కొంగల జలపాతం. ఈ జలపాతపు నీళ్లు ధారలకాకుండా వర్షపు జల్లులా పడుతుంటాయి ఇదే ఇక్కడి ప్రత్యేకత. ఈ దృశ్యం ఇక్కడికి వచ్చే చూపరులను ఎంతగానో ఆకట్టకుంటుంది. మరెందుకాలస్యం ఈ దసరా సెలవుల్లో కొంగల జలపాతపు అందాలను ఒక్కసారి చూసేయండి..

పులిమడుగు అని కూడా పిలుస్తారు..
ఈ కొంగల జలపాతం ములుగు జిల్లా వాజేడు మండలంలోని కొంగల ఊళ్లో ఉంది. ఈ జలపాతం సమీపంలో ఒకప్పుడు పులులు నీళ్లు తాగేందుకు వచ్చేవని అధికారులు చెబుతున్నారు. అందుకే ఈ జలపాతాన్ని పులిమడుగు అని కూడా పిలుస్తారట. ఈ జలపాతం తెలంగాణ నయాగారాగా పేరొందిన బొగత జలపాతానికి సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది. కొంగల గ్రామం నుంచి ఈ జలపాతం సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ జలపాతాన్ని చేరుకోవాలంటే తప్పనిసరిగా ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. ట్రెక్కింగ్ ప్రియులకు ఈ ప్రాంతం ఎంతో అనువైనదనే చెప్పుకోవాలి. అడ్వంచర్స్ చేసేవారికి కూడా ఈ ప్రాంతం ఎంతో ఉత్తమం. సుమారు నలభై నిమిషాలు ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. కాలినడకన వెళ్లే ఈ ప్రయాణం పర్యాటకులకు ఎంతో మధురానుభూతిని కలిగిస్తుంది.

మార్గం మధ్యలో చుట్టూ ఉండే పచ్చని పొలాలు మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తాయి. ఇక్కడ దారిపోడవునా ఉండే సీతాకోక చిలుకలు పర్యాటకులకు సాదర ఆహ్వనం పలుకుతాయి. ఇక్కడ డైబ్బై అడుగుల ఎత్తు నుంచి నీళ్లు కిందకు పడతాయి. ఆ దృశ్యం చూడడానికి ఎంతో అందంగా, ఆహ్లాదకరంగా కూడా ఉంటుంది. ఈ జలపాతం నీళ్లు పడే ప్రాంతం ఓ స్విమ్మింగ్ ఫూల్‌లా ఉంటుంది. సెలవుల్లో కుటుంబంతో కలిసి సరాదాగా గడిపేందుకు, అలాగే స్నేహితులతో కలిసి సరాదాగా ఓ మూడు నాలుగు రోజులు గడిపేందుకు ఈ ప్రాంతం ఎంతో అనువైనది. ఈ ప్రాంతాన్ని సందర్శించాలంటే జులై నుంచి డిసెంబర్ మధ్య సరైన సమయం. కాబట్టి ఈ అక్టోబర్ మాసంలో కూడా ఈ ప్రాంతాన్నీ వీక్షించొచ్చు.
ఎలా వెళ్లాలి..
ఈ ప్రాంతాన్ని చేరుకోవాలంటే ముందుగా హైదరాబాద్ నగరాన్ని చేరుకోవాలి. విమానమార్గంలో చేరుకోవాలనుకునేవారు తప్పుకుండా హైదరాబాద్‌లోని విమానాశ్రయానికి చేరుకోవాలి. అక్కడినుంచి బస్సు మార్గం ద్వారా కానీ, టూవీలర్ కానీ, లేదంటే కారులో కానీ ఈ జలపాతాన్ని చేరుకోవచ్చు. హైదరాబాద్ నుంచి సుమారు 271 కిలోమీటర్ల దూరంలో ఈ జలపాతం ఉంటుంది. ఒకవేళ వరంగల్ నుంచి వెళ్లాలనుకుంటే మాత్రం సుమారు 129 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. కొంగల గ్రామం నుంచి మట్టిరోడ్డు మీదుగా కిలోమీటర్ వరకు మాత్రమే టూవీలర్ కానీ, కారులో కానీ వెళ్లడానికి వీలుగా ఉంటుంది. అక్కడినుంచి ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. అది కూడా గైడ్ సహాయం తీసుకోవాల్సి ఉంటుంది.



Click it and Unblock the Notifications













