పచ్చని ప్రకృతి నడుమ ట్రెక్కింగ్ చేద్దామా?
గోవా పేరు వినగానే మీకు ముందుగా గుర్తుకు వచ్చేది ఏంటని అడిగితే? సమాధానం బీచ్‌లు, అందమైన సూర్యాస్తమయాలు, సముద్రపు అలలు, అనేక ఆహ్లాదకరమైన, సాహసోపేతమైన నీటి కార్యకలాపాలు గుర్తుకు వస్తాయి. అయితే ఇప్పుడు అక్కడ కూడా ట్రెక్కింగ్‌ను ఆస్వాదించవచ్చనే కొత్త విషయాన్ని చెబుతున్నాము. గోవా టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (GTDC) దక్షిణ గోవాలోని తాంబాడి సుర్ల-మొల్లెం నుండి రాష్ట్రంలోని అంతర్భాగంలో పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి, ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించడానికి వర్షాకాల ట్రెక్కింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. రండి ఆ విశేషాలెంటో తెలుసుకుందాం.
గోవాలో ట్రెక్కింగ్ కోసం ఎక్కడికి వెళ్లాలి?
గోవా రాష్ట్ర ప్రభుత్వం లోతట్టు ప్రాంతాలలో పర్యాటకంపై దృష్టి సారించడంతో పాటు పర్యాటకులు సురక్షితంగా ట్రెక్కింగ్ కార్యకలాపాలకు వెళ్లాలని సూచించింది. గోవాలో వర్షాకాలంలో ట్రెక్కింగ్ కోసం ఇక్కడ కొన్ని ప్రదేశాలు ఉన్నాయి. రండి అవేంటో చూద్దాం.

సోన్సోగోర్ ట్రెక్
సోన్సోగోర్ రాష్ట్రంలోని మూడు ఎత్తైన శిఖరాలలో ఒకటి. అందుకే ఈ ప్రాంతం ట్రెక్కింగ్ ప్రియులకు స్వర్గధామమనే చెప్పాలి. ఇక్కడ ట్రెక్కింగ్ దాదాపు రెండుమూడు గంటల సమయం పడుతుంది. సముద్ర మట్టానికి 1,166 మీటర్ల (3,825 అడుగులు) ఎత్తులో ఉన్న సోన్సోగోర్ ట్రెక్ పశ్చిమ కనుమల పర్వత శ్రేణిలో ఒక భాగం. సోన్సోగోర్ ఉత్తర గోవాలోని ఉప జిల్లా అయిన సత్తారి తాలూకాలో ఉంది. ఈ ప్రాంతాన్ని చేరుకోవాలంటే స్థానిక రైల్వేస్టేషన్లు అందుబాటులో ఉన్నాయి. గోవాలోని సోన్సోగోర్ ట్రెక్కింగ్ పాయింట్‌కి వెళ్లేందుకు బస్సు లేదా టాక్సీని అద్దెకు తీసుకోవచ్చు. రైలు మార్గం ద్వారా అయితే గోవాలోని దబోలిమ్ విమానాశ్రయం సమీప విమానాశ్రయం.

దూద్‌సాగర్ ట్రెక్
ఇప్పటి వరకు చాలామంది దూద్‌సాగర్‌ని రీల్స్‌లో మాత్రమే చూసి ఉంటారు. ఇప్పుడు రియల్‌గా చూసే అవకాశం మీ చేతు్ల్లో ఉంది. గోవా సందర్శనకు వెళితే మాత్రం తప్పకుండా ఈ ప్రాంతాన్ని సందర్శించండి. ఇది భారతదేశంలోని 5వ ఎత్తైన జలపాతాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. దూద్‌సాగర్ గోవాలోని అత్యంత ప్రసిద్ధ జలపాతం. దాని అందాన్ని వర్ణించడానికి పదాలు సరిపోవు. ఇది పడమటి కనుమలలోని దట్టమైన అడవుల గుండా ప్రవహిస్తుంది. వర్షాకాలంలో ఈ ప్రదేశంలో ట్రెక్కింగ్ పర్యాటకులకు సరికొత్త అనుభూతినిస్తుంది.

పాలి జలపాతం ట్రెక్
గోవాలో ట్రెక్కింగ్ కోసం పాలి జలపాతం మరొక గొప్ప ఎంపిక. అయితే, వర్షాకాలంలో ఇక్కడి మార్గం కొంచెం జారుడుగా ఉంటుంది. కాబట్టి ట్రెక్కింగ్ షూలను ఎంపిక చేసుకునేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గోవాలోని దట్టమైన అడవులలో ఈ ప్రదేశం కూడా ఒకటి. ఈ ప్రాంతంలో బురదతో కూడిన జారే మార్గాలు, ఇరుకైన ప్రవాహాలు దాటడం, దట్టమైన అటవీ ప్రాంతాలు, ముళ్లదారులు పర్యాటకులకు తారసపడతాయి. ఈ మార్గం చాలా సవాలుతో కూడుకున్నదనే చెప్పాలి. ఇక్కడి ప్రకృతి దృశ్యాలు స్వర్గానే తలపించేలా ఉంటాయి.
హివేరం ట్రెక్
హివేరం జలపాతం గోవాలో అతి తక్కువగా అన్వేషించబడిన ప్రదేశాలలో ఒకటి. ఇక్కడ పర్యాటకులు ఏటవాలుల గుండా వెళ్ళవలసి ఉంటుంది. ఇక్కడ ఒకదానికొకటి పక్కన మూడు జలపాతాలు ఉన్నాయి. వీటిని అనుభవం, ఆసక్తి గల హైకర్లు కేవలం ఒక రోజులో కవర్ చేయవచ్చు.



Click it and Unblock the Notifications













