తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్న మల్లెల తీర్థం జలపాతపు ప్రదేశం చారిత్ర, ఆధ్యాత్మికతతో నిండిన పర్యాటక ప్రదేశంగా గుర్తింపు పొందింది. దట్టమైన అడవులతో నిండిన ఈ పవిత్ర జలపాతం ప్రకృతి ప్రేమికులతోపాటు భక్తులు తప్పక సందర్శించవలసిన ప్రదేశమనే చెప్పాలి. వర్షాకాలం వచ్చిందంటే చాలు.. మల్లెల తీర్థం జలపాతం 150 అడుగుల ఎత్తు నుండి కిందకు దూకుతూ ఎంతో ఆహ్లాదాన్ని అందిస్తుంది. అలా జాలువారే జలపాతపు నీటితో ఆ ప్రాంతమంతా మంచుపొరు చుట్టుముట్టినట్లు కనువిందు చేస్తుంది. చిన్న చిన్న పాయలు కలిసి జలపాతంగా మారిన ఇక్కడి నీటి ప్రవాహం చివరకు కృష్ణా నదిలో కలుస్తుంది. ఇది అడవి గుండా ప్రవహించే జల సవ్వడుల సుందరమైన ప్రకృతి దృశ్యాన్ని మాటల్లో వర్ణించడం కష్టమే.
ప్రకృతితో మమేకమై..
మల్లెల తీర్థం ఒక పవిత్ర ప్రదేశంగా కూడా పరిగణించబడుతోంది. ఇందుకు కారణం.. ఇది శివుడు లింగం రూపంలో కనిపించిన ప్రదేశంగా భక్తులు విశ్వసిస్తారు. అంతేకాదు, జలపాతం సమీపంలో శివునికి అంకితం చేయబడిన ఆలయం కూడా దర్శనమిస్తుంది. ఇక్కడ భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించడంతోపాటు ఈ పవిత్ర జలాల్లో స్నానాలు ఆచరించేందుకు తరలి వస్తుంటారు. మల్లెల తీర్థం జలపాతం చుట్టూ దట్టమైన అడవులు ఇక్కడి ప్రకృతి అందాలను రెట్టింపు చేస్తాయి. ఈ అటవీ ప్రాంతం వివిధ రకాల వృక్షజాలం మరియు జంతుజాలానికి నిలయంగా చెప్పబడుతోంది. ప్రకృతితో మమేకమై జీవించే అనేక తెగల వారు ఇక్కడ తారసపడతారు.

పచ్చదనాన్ని కప్పుకున్న అడవులు
వర్షాకాలం మల్లెల తీర్థం సందర్శించడానికి ఉత్తమ సమయంగా భావించవచ్చు. ఈ సీజన్‌లో జలపాతం పూర్తి ప్రవాహంలో ఆకట్టుకుంటుంది. అంతేకాదు, చుట్టుపక్కల అడవులు కూడా పచ్చదనాన్ని కప్పుకున్న ప్రకృతి అందాలు మనసుకు ప్రశాంతతను చేరువ చేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది ముమ్మాటికీ ప్రకృతి ప్రేమికులకు సరైన గమ్యస్థానంగా చెప్పొచ్చు. ఇక్కడికి వచ్చే సందర్శకులు ట్రెక్కింగ్, హైకింగ్‌తోపాటు అరుదైన పక్షులను చూడవచ్చు. అలాగే, ఫోటోగ్రఫీని ఇష్టపడేవారికి మల్లెల తీర్థం స్వర్గధామంగా చెప్పొచ్చు. అందుకే, ఈ జలపాతం మంచి పిక్నిక్ స్పాట్‌గానే కాకుండా విశ్రాంతి తీసుకునేందుకు అనువైన ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది.
ఇలా చేరుకోవచ్చు..
మల్లెల తీర్థం చేరుకునేందుకు రవాణా వ్యవస్థ కూడా అందుబాటులో ఉంది. హైదరాబాద్ నగరం నుండి 185 కిలోమీటర్ల దూరం అలాగే, మహబూబ్‌నగర్ నుండి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడికి సమీప విమానాశ్రయం హైదరాబాద్ విమానాశ్రయం కాగా, సమీప రైల్వే స్టేషన్ మహబూబ్‌నగర్ రైల్వే స్టేషన్. ఆర్‌టీసీ బస్సు సేవలు పరిమితంగా ఉంటాయి. అంతేకాదు, హైదరాబాద్ నుండి శ్రీశైలం వెళ్లే జాతీయ రహదారి మార్గంలో వచ్చే అమ్రాబాద్ మండలంలోని వట్వర్లపల్లి గ్రామం నుండి తొమ్మిది కిలోమీటర్లు అడవి మార్గంలో ప్రయాణిస్తే మల్లెలతీర్థం జలపాతానికి చేరుకోవచ్చు.
అలాగే, అచ్చంపేట నుండి ఇక్కడికి బస్సు సౌకర్యం ఉంది. అవకాశం ఉన్నంత వరకూ సొంత వాహనాల్లో ప్రయాణం చేయడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. ఇక్కడకు వెళ్లాలనుకునేవారు జర్నీని కూడా ఆస్వాదించేందుకు అదే సరైన ఎంపిక. మరెందుకు ఆలస్యం.. మీ జర్నీని మొదలుపెట్టండి!



Click it and Unblock the Notifications












