విశాఖలో పర్యాటకులను ఆకర్షిస్తోన్నమెరైన్ మ్యూజియం..
వైజాగ్ బీచ్‌లకే కాకుండా అందమైన ప్రదేశాలకు కూడా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ పర్యాటకులు సందర్శించేందుకు ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఆధ్యాత్మిక ప్రదేశాలకు కూడా కొదవేలేదు. చాలామంది పర్యాటకులు ఇక్కడికి అందమైన సాగర తీరపు ఒడిలో సేదతీరేందుకు వస్తుంటారు. చల్లని సాయంత్రం వేళ సముద్రపు తీరాన విహారించాలని ఎవరికి ఉండదు చెప్పండి. కేవలం సముద్రపు అందాలే కాకుండా, సముద్ర సంబంధిత విజ్ఞానానికి కూడా ఈ ప్రాంతం పేరుగాంచింది. తూర్పు తీరంలో అత్యంత కీలకమైన సిటీగా ఈ ప్రదేశానికి పేరుంది.
విశాఖపట్నం తూర్పు తీర నౌకాదళ ప్రధాన కేంద్రం కావడంతో సముద్ర విజ్ఞాన శాస్త్రం, సముద్రంలో లభించే మత్స్య శాస్త్ర పరిశోధనలు, నేవికి సంబందించిన అనేక ప్రయోగాలు, పరిశోధనలు ఇక్కడే జరుగుతూ ఉంటాయి. వాటికి అనుబంధంగానే ఇక్కడ మ్యూజియంలను కూడా ఏర్పాటు చేశారు. కేవలం వినోదం కోసం మాత్రమే కాకుండా, విజ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు, సముద్ర తీరంలో జరుగుతున్న అత్యద్భుత ఆవిష్కరణలు, అద్భుతాలను తెలుసుకునేందుకు కూడా ఈ ప్రదేశాన్ని సందర్శించొచ్చు. మరెందుకాలస్యం సముద్ర విజ్ఞాన శాస్ర్తాన్ని పెంచుకోవడానికి పిల్లలతో పాటు కలిసి వచ్చేయండి మరి..

అనేక మ్యూజియంలకు ప్రసిద్ధి..
ఇప్పటికే విశాఖలో విజ్ఞానాన్ని అందిస్తోన్న మ్యూజియంలు అనేకం ఉన్నాయి. అందులో సబ్ మెరైన్ మ్యూజియం, నేవల్ మ్యూజియం, సీ హరియర్ మ్యూజియం. వీటితో పాటు ఇంకా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనో గ్రఫి, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ నాటికల్ అండ్ ఇంజినీరింగ్, సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ అండ్ ట్రైనింగ్ లాంటి మరిన్ని సంస్థలు కూడా ఉన్నాయి. వీటి ద్వారా నిరంతరం ఇక్కడ పరిశోధన, అభివృద్ది జరుగుతూనే ఉంటుంది. తాజాగా నిర్మించిన మెరైన్ మ్యూజియం కూడా ఇక్కడికి వచ్చే పర్యాటకులను మరింతగా ఆకట్టుకుంటోంది.

సముద్రపు ఆవు చేప స్పెషల్ అట్రాక్షన్..
సోమవారం కేంద్రమంత్రి పురుషోత్తం రూపాల విశాఖ లోని ఫిషింగ్ హార్బర్ సమీపంలో ఉన్న ఇండియన్ ఫిషరీస్ రీసెర్చ్ సంస్థ లో అత్యాధునికంగా నిర్మించిన మెరైన మ్యూజియంను ప్రారంభించారు. సువిశాల బంగాళాఖాతంలో లభ్యమయ్యే పలు రకాల మత్స్య సంపదను ఈ మెరైన్ మ్యూజియంలో ప్రదర్శించారు. దీనిద్వారా సముద్రంలో లభ్యమయ్యే మత్య్స రాశుల గురించి తెలుసుకోవడమే కాకుండా జువాలజీ అభ్యసించే విద్యార్థులు, రీసెర్చ్ స్కాలర్స్ కు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది.
ఈ మొత్తం మ్యూజియంలో అరుదుగా లభ్యమయ్యే సముద్రపు ఆవు చేప స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తోంది. ఇంకా ఇక్కడ సముద్రపు పాము, మొసలి రకం సొరచేప, కలివిందలు సొరచేప, అండమాన్ నికోబార్ దీవుల్లో దొరికే గర్నాడ్స్, తిమింగలాలు ఆళ్ళ రొయ్యలు, గుర్రపు డెక్క పీతలు, అన్నింటికంటే మనం అత్యంత అరుదుగా చూసే సముద్రపు దోసకాయ, సముద్రపు లాంతరు, సీ అశ్వని చేపలు ఇక్కడ మనకు ప్రదర్శనలో కనిపిస్తాయి.

దశాబ్దాల క్రితం లభ్యమయిన చేపల నమూనాలు..
సాధారణంగా ప్రతి ఏటా నవంబరులో ఫిషింగ్ హార్బర్ జెట్టీల్లో నిలిచి ఉండే సర్వే నౌకల్లో ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఎగ్జిబిషన్‌లు నిర్వహించి ఈ తరహా చేపలను డిస్‌ప్లేలో ఉంచుతూ విద్యార్థులకు ఆయా వెరైటీ లపై అవగాహన కల్పించే ప్రక్రియ చేస్తూ ఉంటారు. కానీ, ఈ సారి ఏకంగా ఎగ్జిబిషన్ కాకుండా మ్యూజియాన్నే ఏర్పాటు చేసి విద్యార్థులకు మత్య్స సంపద గురించి అవగాహన కల్పించే విధంగా పెట్టారు.
ఈ మెరైన్ మ్యూజియంలో 250 నమూనాల చేపలను ప్రదర్శనగా ఉంచారు. మరోవైపు మత్స్య శాఖ ఈ మ్యూజియం నిర్వహణకు అత్యాధునిక పద్ధతులను అనుసరిస్తుంది. దశాబ్దాల క్రితం లభ్యమైన చేపల నమూనాలు డిస్టర్బ్ అవకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆయా రకాల చేపల్లో ఫార్మాలిన్ కలిపి భద్రపరుస్తున్నారు. అందుకోసం ప్రత్యేకంగా తయారుచేసిన గాజు జార్లను కూడా వినియోగిస్తున్నారు.



Click it and Unblock the Notifications












