వల్సాడ్ స్టేషన్ వద్ద వెస్టర్న్ రైల్వే చేపట్టిన నాన్-ఇంటర్లాకింగ్ పనుల కారణంగా ముంబై-గాంధీనగర్ మార్గంలో రైళ్ల రాకపోకలకు ఆటంకం కలుగుతోంది. ఆగస్టు 21న ఉదయం 10:00 గంటలకు ప్రారంభమైన ఈ ట్రాక్ బ్లాక్.. ఆగస్టు 23న మధ్యాహ్నం 15:30 గంటల వరకు కొనసాగనుంది. ఈ ప్రభావంతో నేడు (ఆగస్టు 22) వందే భారత్ రైళ్లు ఆలస్యంగా నడిచే అవకాశముంది. కాబట్టి ప్రయాణికులు ఇంటి నుంచి బయల్దేరేముందు లైవ్ ట్రైన్ స్టేటస్ సరిచూసుకోవడం మంచిది. రైల్వే అధికారుల సమాచారం ప్రకారం.. ఈ మార్గంలో కొన్ని రైళ్లను రీషెడ్యూల్ చేయడంతో పాటు కొద్ది దూరం మాత్రమే నడపడం (షార్ట్ టెర్మినేషన్), వేగాన్ని నియంత్రించడం వంటి చర్యలు తీసుకుంటున్నారు.
సాధారణంగా ముంబై సెంట్రల్ – గాంధీనగర్ క్యాపిటల్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (రైలు నంబర్ 20901) ఉదయం 06:00 గంటలకు బయల్దేరి మధ్యాహ్నం 12:30కి చేరుకుంటుంది. ఈ రైలు పనుల సమయానికంటే ముందే వల్సాడ్ దాటినప్పటికీ, బోరివలి - వాపి మధ్య స్వల్పంగా ఆలస్యమయ్యే అవకాశముంది. అందుకే ఉదయం 06:00–06:30 మధ్య బయల్దేరి, మధ్యాహ్నం 12:30–13:10 మధ్య గమ్యస్థానానికి చేరుకునేలా ప్లాన్ చేసుకోండి. తాజా బులిటిన్ ప్రకారం ఈ రైలు 35 నిమిషాలు ఆలస్యంగా నడుస్తోంది. ఇక తిరుగు ప్రయాణంలో గాంధీనగర్ నుంచి మధ్యాహ్నం 14:05కి బయల్దేరే రైలు నంబర్ 20902 వందే భారత్.. నవసారి - వల్సాడ్ మధ్య 30 నుంచి 60 నిమిషాలు లేటయ్యే ఛాన్స్ ఉంది. దీంతో ముంబై చేరుకోవడం రాత్రి 21:00 నుంచి 22:00 గంటల వరకు ఆలస్యం కావచ్చు.

వందే భారత్ సవరించిన వేళలు, లైవ్ స్టేటస్, రిఫండ్ వివరాలు
రైలు నంబర్లు 20901 లేదా 20902 ప్రస్తుత రన్నింగ్ స్టేటస్‌ను నేషనల్ ట్రైన్ ఎన్‌క్వైరీ సిస్టమ్ (NTES) పోర్టల్‌లో తెలుసుకోవచ్చు. ఇందుకోసం NTES వెబ్‌సైట్ ఓపెన్ చేసి, 'Spot Your Train' ఆప్షన్ ద్వారా 'Rescheduled' లేదా 'Diverted' ఫిల్టర్లను చెక్ చేయవచ్చు. లైవ్ అప్‌డేట్స్ కోసం అలర్ట్లను ఎనేబుల్ చేసుకోండి. ఒకవేళ మీ రైలు 3 గంటల కంటే ఎక్కువ ఆలస్యమై, మీరు ప్రయాణాన్ని విరమించుకుంటే.. IRCTC యాప్/వెబ్‌సైట్ ద్వారా టికెట్ క్యాన్సిల్ చేసుకోవచ్చు లేదా రైల్వే నిబంధనల ప్రకారం TDR (టికెట్ డిపాజిట్ రిసీప్ట్) ఫైల్ చేసి రిఫండ్ పొందవచ్చు.
ముంబై, అహ్మదాబాద్, గాంధీనగర్ స్టేషన్లలో ప్లాట్‌ఫారమ్‌లు, కనెక్టింగ్ టైమ్
సెక్యూరిటీ చెకింగ్, బోర్డింగ్ మరియు ఛార్ట్ తయారుచేశాక కోచ్ పొజిషన్లలో అయ్యే మార్పులను గమనించేందుకు ముంబై సెంట్రల్, అహ్మదాబాద్, గాంధీనగర్ స్టేషన్లకు 30 నుంచి 45 నిమిషాల ముందే చేరుకోవడం మంచిది. అలాగే ఈ మార్గంలో మరో రైలు మారాల్సి వస్తే (కనెక్టింగ్ ట్రైన్స్).. చేతిలో కనీసం 90 నుంచి 120 నిమిషాల వ్యవధి ఉంచుకోండి. ఎందుకంటే ట్రాక్ బ్లాక్ సమయంలో ప్లాట్‌ఫారమ్ మార్పులు జరిగే అవకాశముంది. చివరి నిమిషంలో హడావుడి పడకుండా ఉండేందుకు బయల్దేరే ముందు NTES యాప్‌ను చెక్ చేయడంతో పాటు స్టేషన్‌లోని డిస్‌ప్లే బోర్డుల్లో కోచ్, ప్లాట్‌ఫారమ్ వివరాలను మరోసారి సరిచూసుకోండి.
వందే భారత్ ఆలస్యం: ప్రత్యామ్నాయ రైళ్లు, దక్షణాది ప్రయాణికులకు సూచనలు
అత్యవసరంగా వెళ్లాల్సిన వారు ఇదే రూట్‌లో నడిచే తేజస్ ఎక్స్‌ప్రెస్ లేదా గుజరాత్ సూపర్‌ఫాస్ట్ రైళ్లను ప్రత్యామ్నాయంగా పరిశీలించవచ్చు. వీటిపైనా స్వల్ప ప్రభావం ఉన్నప్పటికీ ప్రయాణానికి వీలుంటుంది. ఇక అహ్మదాబాద్ లేదా ముంబై మీదుగా హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు వైపు వెళ్లేవారు కనెక్టింగ్ టైమ్‌ను పెంచుకోవడం శ్రేయస్కరం. సికింద్రాబాద్ - రాజ్‌కోట్ రైలు కూడా బులిటిన్‌లో 40 నిమిషాలు ఆలస్యంగా నడుస్తున్నట్లు పేర్కొన్నారు. కాబట్టి ప్రయాణికులు వీలైనంత త్వరగా అందుబాటులో ఉన్న రైళ్లను చూసుకుని, అవసరమైతే బ్యాకప్ టికెట్లను సిద్ధం చేసుకోవడం మంచిది.



Click it and Unblock the Notifications











