Search
  • Follow NativePlanet
Share
» »వ‌ర్షాకాలం వ‌చ్చేసింది.. రాయిక‌ల్ జ‌ల‌పాతంలో సంద‌డి చేద్దాం రండి!

వ‌ర్షాకాలం వ‌చ్చేసింది.. రాయిక‌ల్ జ‌ల‌పాతంలో సంద‌డి చేద్దాం రండి!

ఇటీవ‌ల కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు తెలంగాణ‌లోని రాయికల్ సమీపంలోని సహజసిద్ధమైన జలపాతం ప‌ర‌వ‌ళ్లుతొక్కుతోంది. చుట్టూ ప‌చ్చ‌ద‌నంతో నిండిన‌ అడవులు.. క‌నువిందు చేసే ఎత్త‌యిన గుట్ట‌లగుండా జాలువారే సహజసిద్ధ జలపాతాల స‌వ్వ‌డుల గురించి మాటల్లో చెప్ప‌డం క‌ష్ట‌మే. ఒత్తిడితో స‌త‌మ‌త‌మ‌య్యేవారు మాన‌సిక ఉల్లాసం పొందేందుకు ఈ జ‌ల‌పాతాలు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలుస్తాయి. మ‌రెందుకు ఆల‌స్యం ప‌ర‌వ‌ళ్లుతొక్కుతోన్న ఆ రాయిక‌ల్ జ‌ల‌పాత‌పు విశేషాల‌ను తెలుసుకుందాం రండి!

రాయికల్‌ జలపాతం వరంగల్‌ జిల్లా కేంద్రానికి 43 కిలోమీటర్ల దూరంలో.. వరంగల్‌ అర్బన్, కరీంనగర్‌ జిల్లాల సరిహద్దుల్లో క‌నువిందు చేస్తుంది. ఇది సైదాపురం అటవీ ప్రాంతంలో ఉంది. రాయికల్ గ్రామం నుండి జలపాతానికి మూడు కిలోమీటర్ల దూరం ఉంటుంది. అయితే, అక్క‌డ‌కు కనెక్టివిటీ తక్కువగా ఉన్నప్పటికీ పర్యాటకులు జలపాతాలను సందర్శించేందుకు ఈ సీజ‌న్‌లో క్యూ క‌డుతూ క‌నిపిస్తారు.

అక్క‌డి వాతావరణాన్ని ఆస్వాదించడానికి ఎంతో ఉత్సాహం చూపిస్తారు. దాదాపు 200 మీటర్ల ఎత్తులో ఉన్న జెండాగుట్ట గుట్టల నుంచి నీరు కిందికి పారుతుంది. జెండాగుట్ట పైన మరో మూడు చిన్న జలపాతాలున్నాయి. కోటగిరిగుట్టలు అని పిలువబడే దాదాపు 30 కొండల సమూహం జలపాతాలకు ప్రధాన నీటి వనరుగా నిలుస్తుంది. వర్షాకాలం ప్రారంభమైనప్పుడల్లా ఈ కొండల నుండి నీరు ప్రవహించడం ప్రారంభమవుతుంది.

raikalfalls1

పరవళ్లు తొక్కుతూ జలపాతం..

ఎక్కువ‌గా కరీంనగర్, హుజూరాబాద్, వరంగల్, సిద్దిపేట తదితర ప్రాంతాల నుంచి సందర్శకులు వస్తుంటారు. జ‌ల‌పాతాన్ని చేరుకునేందుకు కాలిన‌డ‌క‌న వెళ్లే మూడు కిలోమీటర్ల దూరం ట్రెక్కింగ్ అనుభూతిని అందిస్తుంది. 170 అడుగుల ఎత్తు నుంచి స్వచ్ఛమైన నీటి ప్రవాహంతో.. పరవళ్లు తొక్కుతూ జలపాతం కిందికి దూకుతూ క‌నువిందు చేస్తుంది. మొత్తం ఐదంచెల‌లో సహజ సిద్ధమైన జలపాతాలను కలిగిన ఈ అంద‌మైన‌ ప్రదేశం, పర్యాటకులతోపాటు ప్రకృతి ప్రేమికులకు మధురానుభూతిని పంచుతుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.

ఇక్క‌డ అడుగుపెట్టిన‌వారు ఎవ్వ‌రైనా మ‌రో ప్ర‌కృతి దిద్దిన ప్ర‌పంచంలోకి వ‌చ్చిన అనుభూతిని పొందుతారు. అయితే, కొండలపై భాగంలో ఎలుగుబంట్లు సంచ‌రిస్తాయ‌ని ప్ర‌చారం ఉంది. ఈ కార‌ణంగా ఈ ప్రాంతం ప‌ర్యాట‌కంగా అభివృద్ధి చెంద‌లేద‌ని స్థానికులు చెబుతున్నారు. అయితే, త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం వ‌ల్ల ఈ స‌మ‌స్య‌ను అధిగ‌మించ‌వ‌చ్చ‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఏది ఏమైనా.. న‌గ‌ర‌ కాలుష్యానికి దూరంగా ప్రశాంతమైన ప్రకృతి అందాల‌ను ఆస్వాదిస్తూ.. స‌మ‌యం గ‌డిపేందుకు ఈ రాయిక‌ల్ జ‌ల‌పాతం సరైన ఎంపిక అని మాత్రం చెప్పుకోవ‌చ్చు.

raikalfalls

ఎలా వెళ్లాలి?

కరీంనగర్, వరంగల్‌ నగరాలకు అతి సమీపంలో ఉండటంతో రాయిక‌ల్ జ‌ల‌పాతం వ‌ర్షాకాలం వ‌చ్చిందంటే సంద‌డిగా క‌నిపిస్తుంది. ఈ జ‌ల‌పాత‌పు స‌వ్వ‌డులు ఇక్క‌డ మూడు నెల‌లు మాత్ర‌మే ఉంటాయి. ఇక్క‌డికి చేరుకునేందుకు ముందుగా హుస్నాబాద్‌ సిద్దిపేట రోడ్డు గుండా ములుకనూరు వద్ద కుడి వైపున‌కు వెళ్లాలి.

మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు స్వగ్రామం అయిన వంగర మీదుగా రాయికల్‌ గ్రామానికి చేరుకోవాల్సి ఉంటుంది. అక్క‌డి నుంచి నుంచి దక్షిణ మార్గంలో మూడు కిలోమీటర్లు ముందుకు వెళితే గ్రామ చెరువు క‌నిపిస్తుంది. ఆ చెరువు వ‌ద్ద వాహనాలను పార్కింగ్ చేసి, కొంత దూరం కాలిన‌డ‌క‌న వెళితే జ‌ల‌పాతాల‌ను చేరుకోవ‌చ్చు. మ‌రెందుకు ఆల‌స్యం మీ ప్ర‌యాణాన్ని మొద‌లుపెట్టండి మ‌రి!

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+