పరవళ్లుతొక్కే గోదావరి నదీ ప్రవాహం సాక్షిగా పచ్చని కొండకోనలు. రాతిబండలపై నుంచి జాలువారే నీటీ సవ్వడులు.. అలాంటి ప్రకృతి మలచిన సుందర దృశ్యం రామునిగుండాల సొంతం. వర్షాకాలం వచ్చిందంటే చాలు ఈ ప్రాంతం ఓ ప్రసిద్ధ పర్యాటక ప్రదేశంగా అవతరిస్తుంది. వేల ఏళ్ల చరిత్రకు నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తుంది. కుటుంబసమేతంగా ఇక్కడికి వచ్చి, సందడి చేసే పర్యాటకుల కేరింతలు మనసును ఆహ్లాదపరుస్తాయి. ఆధ్యాత్మిక చింతనకు పర్యాటక శోభ జోడించిన రాముని గుండాల పర్యాటక విశేషాలను తెలుసుకుందాం పదండి!
తెలంగాణలోని ఉమ్మడి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న రామగుండం ప్రకృతి రమణీయతకు చిరునామాగా నిలుస్తోంది. ఇక్కడి రాముని గుండాల వద్ద జాలువారే జలపాతపు సవ్వడులు ప్రకృతి ప్రేమికులను ఇటువైపుగా అడుగులు వేసేలా చేస్తున్నాయి. రామగుండంలోని రాముని గుండాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. వర్షాకాలంలో ఇక్కడి ప్రకృతి అందాలు, పరవళ్లు తొక్కే జలపాతం చూపరులను మంత్రముగ్ధులను చేస్తోంది. ఎత్తయిన రాతి కొండపై నుండి పొంగిపొర్లే నీటి సవ్వడులు ఓవైపు, చుట్టూ పచ్చదనం నిండిన ప్రకృతి అందాలు మరోవైపు సంర్శకుల మనసును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

మొత్తం 108 వరకూ గుండాలు..
రాతి కొండపైనుంచి కిందకు జాలువారే నీటి ప్రవాహం అమాంతం కిందనున్న గుండాలలోకి చేరుతుంది. అలా కిందపడిన నీటితో ఒక గుండం నిండిన తర్వాత మరో గుండంలోకి ప్రవహిస్తుంది. వర్షాకాలంలో ఆ సుందర దృశ్యాన్ని చూస్తే.. పూల దండలో ఒక్కో పువ్వునూ గుచ్చినట్లు అందమైన ప్రకృతి దృశ్యం కనువిందు చేస్తుంది. ఇక్కడికి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇలాంటి గుండాలు 108 వరకూ ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. ఈ సీజన్‌లో రాముని గుండాల ప్రాంతం ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తుందని ప్రచారంలో ఉంది. ఆధ్యాత్మిక చింతన కలిగిన భక్తులు ఇక్కడికి వచ్చి, స్థానికంగా ఉన్న ఆలయాలను సందర్శించి వారి మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీగా వస్తోంది.

ఆథ్యాత్మిక చారిత్రక నేపథ్యం..
ఈ ప్రాంతానికి ఆథ్యాత్మిక నేపథ్యం కూడా ఉంది. పురాణాల ప్రకారం.. త్రేతాయుగంలో శ్రీరామడు వనవాసానికి ఇక్కడి గోదావరి నదీ తీరం వెంబడి ప్రయాణిస్తూ.. ఈ రామగుండానికి చేరుకున్నారట. ఆ సమయంలో మహర్షి విశ్వామిత్రుడు, మహా మునేశ్వరుడు, గౌతముడు, నారాయణుడు, విఘ్నేశ్వరుడు, ఋషులు, మునులు ఇక్కడ నివాసముండి తపస్సు చేసేవారట. ఆ ఋషులతో పాటు రాముడు కూడా ఇక్కడ స్వయంగా శివలింగ ప్రతిష్ఠాపన చేసి నందీశ్వరుడు, కాలభైరవుడు, నాగదేవతలను సప్త మాతృక్రుతులను పూజించినట్లు పురాణాల్లో ఉంది. ఈ జలధార నీటితో నిత్య పూజలు జరిపేవారట.
ఈ కారణంగానే ఈ ప్రాంతానికి రామగుండం అనే పేరు వాడుకలో వచ్చిందని ప్రచారంలో ఉంది. పూర్వం ఈ నీటి గుండాలు నిత్యం నీటితో నిండి ఉండేవని, కాని కాలక్రమేణ కొన్ని పూడుకుపోగా ప్రస్తుతం కొన్ని గుండాలు మాత్రమే మిగిలి ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. ఇంతటి చారిత్రక నేపథ్యం ఉన్న రాముని గుండాలు ప్రాంతం పర్యాటకంగా మాత్రం అభివృద్ధి చెందలేదనే చెప్పాలి. ఈ ప్రదేశంపై అధికారులు కాస్త శ్రద్ధ చూపిస్తే ప్రఖ్యాత పర్యాటక ప్రదేశంగా గుర్తింపు పొందుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.



Click it and Unblock the Notifications












