ఈ సెలవుల్లో చాలామంది చల్లని ప్రాంతాలకు వెళ్లాలని ప్రణాళికలు వేస్తుంటారు. మరికొందరేమో హిల్‌స్టేషన్‌లకు వెళ్లేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు. అయితే, చాలామంది సమీపంలోని ప్రాంతాలను విజిట్ చేస్తారు. అలాంటివారికోసం తెలంగాణలో ప్రసిద్ధిచెందిన ప్రదేశాలు చాలానే ఉన్నాయి. అయితే, ఈ రణగొణ ధ్వనుల మధ్య వెళ్లలేని వారు ప్రశాంతమైన ప్రదేశాలకు వెళ్లాలనుకునేవారు మాత్రం భాగ్యనగరానికి సమీపాన ఉన్న వైజాగ్ కాలనీకి వెళ్లాల్సిందే. రండి.. ఆ కాలనీ విశేషాలేంటో తెలుసుకుందాం.
హైదరాబాద్ నగరానికి సమీపంలో ఉంటుంది ఈ ఆహ్లాదకరమైన ప్రదేశం. ఈ ప్రాంతం ప్రశాంతతకు మారుపేరు అని చెప్పొచ్చు. చుట్టు కొండలు, కనుచూపుమేర కనిపించే పచ్చని ప్రకృతి అందాలు పర్యాటకులకు సాదర ఆహ్వానం పలుకుతుంటాయి. ఆపై ఇక్కడి సాగర్ అందాలను చూసేందుకు మనరెండు కళ్లు సరిపోవంటే నమ్మండి. అంతటి అద్భుతమైన దృశ్యాలను చూడాలని ఎవరికుండదు చెప్పండి. ఈ అందమైన ప్రదేశం హైదరాబాద్ నగరానికి అతి సమీపంలో ఉంటుంది. ఇది ఒక ఆహ్లదకరమైన, అద్భుతమైన టూరిస్ట్ ప్రాంతంగా ప్రసిద్ధిచెందింది. వైజాగ్ కాలనీ పెద్దగా రద్దీగా ఉండదు. ఎందుకంటే ఇది చాలా తక్కువమందికి తెలిసిన ప్రదేశం.

ఎక్కడ ఉంది..
వైజాగ్ కాలనీ ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని దేవరకొండకు సమీపంలో వెలసిన ఓ ప్రసిద్ధ టూరిజం స్పాట్ అని చెప్పుకోవాలి. ఇది జిల్లాలోని నేరేడిగొమ్ము మండలం ప్రాంతంలో ఉంటుంది. భాగ్యనగరం నుంచి నాగార్జున సాగర్ వెళ్లేటప్పుడు ఈ ప్రాంతం కుడి వైపున ఉంటుంది. ఈ ప్రాంతాన్ని చేరుకోవాలంటే గిరిజన తండాల మీదుగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఈ ప్రయాణం మీకు ఎన్నో మధురానుభూతులను మిగులుస్తుంది. ఎందుకంటే, ఇక్కడ నివసించే గిరిజనుల ఆచార వ్యవహారాలు, వారి అలవాట్లు, కట్టుబాట్లు, వారి జీవన పరిస్థితులను అన్నింటిని తెలుసుకోవచ్చు. వారితో కాసేపు ముచ్చటించొచ్చు కూడా.
ఓ మినీ ఐల్యాండ్..
ఇక్కడ నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ కూడా ఉంది. దీని చుట్టూ కొండలు.. కనుచూపుమేర సాగర్ వాటర్ పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఓ రకంగా ఇది మినీ ఐల్యాండ్ అని అనొచ్చు. ఈ ఐల్యాండ్‌ను చూసేందుకు ఇక్కడికి చాలామంది టూరిస్టులు వస్తుంటారు. వైజాగ్ కాలనీగా పిలవబడే ఈ ప్రదేశంలో పర్యాటకులు కనువిందే చేసే ప్రదేశాలు ఎన్నో దాగి ఉన్నాయి. ఇక్కడ టూరిస్ట్‌లకు బోటింగ్ సౌకర్యం కూడా ఉంది. ఇక్కడి రహదారులపై చేపలు కుప్పలు కుప్పలుగా ఆరబోసి ఉంటాయి.

పర్యాటకులు కావాలంటే వాటిని టేస్ట్ కూడా చేయొచ్చు. సాగర్ హైవేపై ఉండే మల్లేపల్లి నుంచి ఈ వైజాగ్ కాలనీ సుమారు 32 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇంకా ఇక్కడ పర్యాటకులు నైట్ క్యాంపులను కూడా ఏర్పాట్లు చేసుకోవచ్చు. ఇక్కడ ఎక్కువగా మత్య్సకారులు నివసిస్తూ ఉంటారు. వీరంతా ఏపీలోని విశాఖ జిల్లా నుంచి వచ్చినవారే. తమ వృత్తీరీత్యా ఇక్కడికి వచ్చి జీవనం సాగిస్తున్నారు.
వీరి జీవన విధానాన్ని కూడా టూరిస్ట్‌లు తెలుసుకోవచ్చు. వీరంతా ఇక్కడే చిన్న చిన్న గుడిసెలు వేసుకుని బతుకుతున్నారు. ఈ సెలవుల్లో ప్రశాంతమైన ప్రకృతి ఒడిలో గడిపాలనుకునేవారు తప్పకుండా నల్గొండలోని ఈ వైజాగ్ కాలనీను సందర్శించొచ్చు. మరెందుకాలస్యం మీ ప్రయాణాన్ని మొదలుపెట్టండి మరి..



Click it and Unblock the Notifications












