దట్టమైన పొగమంచు, అతి చల్లని గాలులు, వలస పూల అందాలతో ఈ ప్రదేశమంతా ప్రకృతి సోయగంతో నిండి ఉంటుంది. అలాంటి అందమైన ప్రాంతమే విశాఖలోని లంబసింగి. ఆంధ్రా కాశ్మీర్‌గా పేరుగాంచిన లంబసింగి కి పర్యాటకులు ఈ సీజన్‌లో ఎక్కువగా సందర్శిస్తుంటారు. కార్తీక మాసం సందర్భంగా ఈ ప్రాంతాన్ని చాలామంది వీక్షించేందుకు వచ్చేస్తున్నారు. కుటుంబసమేతంగా ఈ ప్రాంతాన్ని వీక్షించేందుకు ఈ సీజన్ ఉత్తమమైనది. లంబసింగి సందర్శనకు వెళ్లేవారికి ఏపీఎస్ఆర్‌టిసీ ఓ సరికొత్త సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది.

సున్నా డిగ్రీ ఉష్ణోగ్రత..
లంబసింగి, ఏపీలోని విశాఖ జిల్లా లో సముద్ర మట్టానికి సుమారు 3500 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇది చింతపల్లి వెళ్లే మార్గంలో నర్సీపట్నం తర్వాత 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నాలుగేళ్ల క్రితం ఒక్కసారిగా ఇక్కడి వాతావరణం సున్నా డిగ్రీల కు పడిపోవడంతో అప్పట్నుంచి ఈ ప్రాంతం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో ప్రకృతి ప్రేమికులు లంబసింగి పర్యటనకు ఈ సీజన్‌లో ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు.
సందర్శకుల తాకిడి..
ఇక, లంబసింగి వెళ్లే పర్యాటకులకు ఏపీఎస్ఆర్టీసీ ఓ శుభవార్తను చెప్పింది. విశాఖపట్నం నుంచి లంబసింగికి ప్రత్యేక సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. లంబసింగి మన్యంలో పచ్చని చెట్లు, పచ్చని వెదురు పొదలతో ప్రకృతి అందాలు విరజిల్లుతాయి. శీతాకాలం వచ్చిందంటే మన్యం ప్రాంతాన్ని సందర్శించేందుకు పర్యటకులు ఎక్కువగా ఆసక్తి చూపుతారు. సీజన్ ప్రారంభానికి ముందే ఈ ప్రాంతానికి పర్యాటకుల తాకిడి పెరిగింది. లంబసింగి ప్రకృతి అందాలను ప్రత్యక్షంగా వీక్షించేందుకు పర్యాటకులు తరలివస్తున్నారు. ఇక, వారాంతాల్లో ఇక్కడ కనిపించే సందడి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
వారంలో రెండు రోజులు..
కార్తీక మాసం సందర్భంగా పిక్నిక్‌లకు లంబసింగినకు ఏపీఎస్ఆర్‌టిసి ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ బస్సులు వారంలో రెండు రోజులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. శనివారం, ఆదివారాల్లో తెల్లవారుజామున మూడు గంటలకు వైజాగ్ ప్రధాన బస్‌స్టాండ్‌నుంచి బస్సులు బయలుదేరుతాయి. ఈ సర్వీసుల్లో భాగంగా లంబసింగి, తాజంగి డ్యామ్, కొత్తపల్లి వాటర్ ఫాల్స్, మోదమాంబ గుడి (పాడేరు), కాఫీ తోటలు వంటివాటిని ప్రత్యక్షంగా వీక్షించొచ్చు.
సర్వీసు ధరలు..
ఏపీఎస్ఆర్‌టిసి అందిస్తోన్న ఈ ప్రత్యేక సర్వీసుల్లో భాగంగా వాటి టిక్కెట్లు ధరలను కూడా ప్రకటించారు. ఈ స్పెషల్ సర్వీసుల్లో భాగంగా అల్ట్రా డీలక్స్, ఎక్స్‌ప్రెస్ బస్సులను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఇక, అల్ట్రా డీలెక్స్ లో ప్రయాణించాలనుకునే ఒక్కోక్కరికి టిక్కెట్టు ధర రూ.800 ఉంటుంది. అదే ఎక్స్‌ప్రెస్ అయితే మాత్రం రూ.650 చెల్లించాల్సి ఉంటుంది. టిక్కెట్ కావల్సిన వారు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే సదుపాయం ఉంది. నేరుగా బుక్ చేసుకోవాలనుకునేవారు ద్వారకా బస్సు స్టేషన్, విశాఖపట్నం రిజర్వేషన్ కౌంటర్ సంప్రదించొచ్చ. ఈ స్పెషల్ సర్వీసులతో పాటు కార్తీక మాసంలో విజ్ఞాన విహార యాత్రలకు బస్సులను రెంట్ ప్రాతిపదికన కూడా ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు.మరెందుకాలస్యం ఏపీఎస్ఆర్‌టిసి అందిస్తోన్న ఈ అవకాశాన్ని వినియోగించుకోని, లంబసింగి ప్రయాణానికి సిద్ధం కండి..



Click it and Unblock the Notifications











