వర్షాకాలం వచ్చిందంటే చాలు.. పచ్చదనంతో పరదా కట్టినట్లు కనిపించే అడవులు.. ప్రకృతి సౌందర్యానికి నిదర్శంగా తారసపడే ఎత్తయిన కొండలు.. ఆ ఎత్తయిన కొండలనుంచి జాలువారే జలపాతాల సవ్వడులు.. ఇలా ఉమ్మడి విజయనగరం జిల్లా సాలూరుతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడ చూసినా పర్యాటక అందాలకు కొదవేలేదు. అందుకే.. ఇక్కడి ప్రకృతి రమణీయతను మనసారా ఆస్వాదించేందుకు సుదూర ప్రాంతాల నుంచి పర్యాటకులు ఈ ప్రాంతంలో వాలిపోతుంటారు. మరెందుకు ఆలస్యం.. సాలూరు చుట్టుపక్కలి ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు మనమూ సిద్ధమవుదామా?!
ఉమ్మడి విజయనగరం జిల్లాలోని సాలూరు, పాచిపెంట, మెంటాడ మండలాల్లో వర్షాకాలం వచ్చిందంటే చాలు.. పర్యాటకుల సందడి మొదలవుతుంది. ఇక్కడి ప్రకృతి మళచిన సుందర దృశ్యాలను వీక్షించేందుకు ప్రతి సంవత్సరం ఈ సీజన్‌లో సందర్శకులు కుటుంబసమేతంగా వస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా బండ రాళ్ల మధ్య నుంచి జాలువారే ఇక్కడి జలపాతాల సవ్వడులు ఒత్తిడితో నిండిపోయిన మనసుకు ప్రశాంతతను చేరువ చేస్తాయి.
అయితే, ఇలా వరకూ ఇక్కడి జలపాతాలను చేరుకునేందుకు సాహసమే చేయాల్సి వస్తోందని పర్యాటకులు ఆవేదన చెందుతున్నారు. ఇంతటి ప్రకృతి రమణీయత ఉన్న ప్రాంతాలలో పర్యాటక అభివృద్ధి మాత్రం కనిపించడం లేదు. జలపాలాలను చేరుకునేందుకు సరైన రహదారులు లేకపోవడం కాస్త బాధను కలిగిస్తుంది. సందర్శకులకు అవసరమైన సౌకర్యాలను కల్పిస్తే మరింత పర్యాటకాభివృద్ధి చెందుతుందని ఇక్కడివారు వాపోతున్నారు.

అటవీ మార్గంలో ప్రయాణం..
ఇక సందర్శకులు ఆస్వాదించే ముఖ్యమైన ప్రాంతాల్లో సాలూరు మండలం ముందు వరుసలో ఉంటుంది. ఈ మండలంతోపాటు దీనిని ఆనుకుని ఉన్న నేరేళ్లవలస, దళాయివలస, శిఖపరువు, నీలంవలస, పాచిపెంట మండలం ఆలూరు, మెంటాడ మండలంలో నీలంవలసల్లో చిన్న చిన్న జలపాతాలు సందడి చేస్తున్నాయి. కొన్ని జలపాతాలు 40 అడుగుల ఎత్తు నుంచి కిందకు జాలువారుతున్నాయి. స్థాకిక జలపాతాలలో లొద్ద జలపాతం ఎత్తయినదిగా చెప్పుకోవచ్చు. ఇక్కడికి చేరుకునేందుకు అటవీ మార్గంలో ప్రయాణం చేయాల్సి ఉంటుంది.

నేరుగా జలపాతాల వద్దకు..
ఈ చుట్టుపక్కల గడిపే ప్రతి క్షణం ప్రకృతి అందాలతో ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. ఇక్కడి జలపాతాలను వీక్షించేందుకు రెండు కొండల మధ్య కాలినడకన వెళ్లాల్సి ఉంటుంది. ఆ సమయంలో మనం మరో ప్రపంచంలో ఉన్నామా? అన్న అనుభూతి కలుగుతుంది. ఎగువమెండంగి, దళాయివలస, శిఖపరువు జలపాతాలను చూసేందుకు సుదూర ప్రాంతాలనుంచి వందల సంఖ్యలో సందర్శకులు వస్తుంటారు. వీటితోపాటు అలూరు, నీలంవలస జలపాతాలకు మరో వెసులుబాటు ఉంది. ఇక్కడికి నేరుగా జలపాతాల వరకూ వాహనాల్లోనే చేరుకోవచ్చరు. ఈ కారణంగా వర్షాకాలంలో ఇక్కడి జలపాతాలు పర్యాటకుల కేరింతలతో సందడిగా కనిపిస్తుంటుంది. పర్యాటక అభివృద్ధికి ప్రతిపాదనలు
పర్యాటకభివృద్ధివైపు అడుగులు..
జిల్లాలో పర్యాటకులను ఆకట్టుకునే జలపాతాలను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు ఇప్పటికే పంపినట్లు గిరిజన శాఖ మంత్రి సంధ్యారాణి చెబుతున్నారు. త్వరలోనే నిధులు మంజూరవుతాయని స్పష్టం చేశారు. ఈ ప్రాంతంలో పర్యాకాభివృద్ధి జరిగితే ప్రభుత్వానికి ఆదాయంతోపాటు స్థానిక గిరిజనులకు ఉపాధి కూడా దొరుకుతుందని ప్రకృతి ప్రేమికులు అభిప్రాయపడుతున్నారు. మరెందుకు ఆలస్యం.. ఈ సీజన్‌లో జలపాతాల అందాలను అస్సలు మిస్సవ్వకూడదు అనుకుంటే... వెంటనే విజయనగరం బయలుదేరండి!



Click it and Unblock the Notifications












