దేశంలో ప్రసిద్ధిచెందిన పుణ్యక్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. ఇక, మహాశివున్ని ప్రత్యేకంగా ఆరాధించే ప్రత్యేక ప్రదేశాలకు ఇక్కడ కొదవే లేదు. అయితే, ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో వెలసిన ఓ ప్రముఖ శైవక్షేత్రం గురించి ఎప్పడైనా విన్నారా? రండి ప్రసిద్ధిచెందిన ఆ శైవక్షేత్రం విశేషాలేంటో తెలుసుకుందాం.
బోల్ భం యాత్ర..
ఒరిస్సాలోని కొరాపుట్ జిల్లా, జయపురం నగరానికి అరవై కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రదేశం రామగిరి కొండ సమీపంలో ఉంది. కొండమట్టం నుంచి శిఖరం వరకు మెట్లు, వాటికి ఇరువైపులా చంపకవృక్షాలు వాటిలో నీడలో వెళ్తే పది అడుగుల ఎత్తయిన పెద్ద గుహవద్దకు చేరుకోవచ్చు. పుణ్య శబరి నది ఒడ్డున కొండ శిఖరాన సీతారాములు నడయాడిన పుణ్యస్థలమది. కనుచూపుమేరంతా దట్టమైన అడవి... ప్రకృతి అందాల నడుమ.. పుణ్య శబరి నది ఒడ్డున... కొండ శిఖరాన... త్రేతాయుగంనాటి స్వయం భూలింగం గుప్తేశ్వరుని దర్శనం చేసుకున్నవారెవరైనా భక్తి పారవశ్యంలో మునిగి తేలక మానరు.
ప్రకృతి అందాలకు నెలవైన ఆ అరణ్యమార్గంలో రామగిరి నుండి పది మైళ్లు ప్రయాణిస్తే చాలు. ఒక ఎతై న సున్నపురాతి కొండ మనకు దర్శనమిస్తోంది. ఆ కొండ శిఖర గుహ ముందు భాగంలో ఆరడుగుల ఎత్తు, పదడుగుల వెడల్పుతో ఓ శివలింగం ఉంటుంది. అదే గుప్తేశ్వరుని విగ్రహాం. ఇక్కడి శైవశ్వరుని దర్శనం చేసుకుంటే సకల పాపాలతోపాటు, దీర్ఘకాలిక వ్యాధులు కూడా నయమవుతాయనే భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇక్కడ ప్రతి ఏటా ఈ సీజన్లో 'బోల్ భం' యాత్రను ప్రత్యేకంగా నిర్వహిస్తారు. ఈ యాత్రకు ఈ సారి భక్తులు భారీగా పొటేత్తారు. ఇక, ఇక్కడ ప్రతి ఏటా శ్రావణ మాసంలో భక్తులు మహాశివుని దర్శనం కోసం వస్తుంటారు. ఏపీ, ఒడిస్సా నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడికి వచ్చి శివరాధన చేస్తుంటారు. నిత్యం ఈ ప్రాంతం శివనామస్మరణతో మారుమోగిపోతుంటుంది.

కావడి యాత్ర...
ఆ సమయంలో ఇక్కడికి వచ్చిన భక్తులు కావడి యాత్ర చేస్తారు. కావడి యాత్ర చేసిన గంగా జలంతో గుప్తేశ్వరునికి అభిషేకం చేస్తారు. ఇక, కావడి యాత్ర చేసే యాత్రికులు సుమారు 35 కిలోమీటర్ల దూరం కాలినడకన మహా శివలింగాన్ని చేరుకుంటారు. ఇక, ఆ సమయంలో కాలినడకన గుప్తేశ్వరం చేరుకునే వారికి అయ్యప్ప సేవా పీఠం ఆధ్వర్యంలో అన్నదానం, పాలు, బిస్కెట్ల వంటివి పంపిణీ చేస్తారు. మరికొంతమంది దివ్యాంగ దీక్షధారులు సాష్టాంగ నమస్కారాలు చేస్తూ కావడి యాత్ర చేస్తుంటారు. ఈ ప్రాంతమంతా శివనామస్మరణతో మార్మోమోగుతుంది.
గుప్త కేదారి...
ఈ ప్రాంతమంతా దట్టమైన అడవితో కప్పి ఉండడం వల్ల ఇక్కడ క్రూరమృగాలు సంచరించేవి. దాంతో చాలా ఏళ్ల క్రితం వరకు ఇక్కడకు ఎవ్వరూ వచ్చేవారు కాదు. యాభై యేళ్ల క్రితం వరకూ ఇక్కడ ఒక్క శివరాత్రి పర్వదినాన మాత్రమే గుప్తేశ్వరుని దర్శనం చేసుకునేందుకు భక్తులు వచ్చేవారు. అలా రాను రానురాను రహదారి ఏర్పడడంతో క్రూరమృగాల సంచారం తగ్గుముఖం పట్టింది. అప్పట్నుంచీ ప్రతిఏటా కార్తీక మాసాల్లో మహా శివలింగం దర్శనం కోసం చాలామంది వచ్చేవారు.
ఆ తరువాత కొన్నాళ్లకు ప్రతి సోమవారం కొందరు భక్తులు దర్శించుకునేందుకు ఇక్కడికి రావడం మొదలుపెట్టారు. ప్రస్తుతం ఇక్కడ రాకపోకలకు వీలు కలుగడంతో భక్తులు స్వామి వారిని దర్శించుకునేందుకు నిత్యం వస్తున్నారు. ఇక, ఇప్పడు శ్రావణ మాసంలో కావడి యాత్ర చేసుకుంటూ మరీ భక్తులు పొటెత్తుతున్నారు. శివరాత్రి పర్వదినాన అయితే గుప్తేశ్వరుని దర్శించుకునేందుకు ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గడ్ రాష్ట్రాల నుంచి కూడా వేలాదిమంది భక్తులు వస్తుంటారు. చాలామంది ఈ ప్రాంతాన్ని గుప్త కేదారిగా పిలుస్తారు. మరెందుకాలస్యం మహాశివలింగ దర్శనానికి బయలుదేరండి మరి...



Click it and Unblock the Notifications













