ప్రకృతి ఒడిలో విహారానికి కేరళలోని ఈ పది ద్వీపాలు అనువైనవి
పచ్చదనానికి కేరాఫ్ అడ్రస్‌గా పేరుపొందింది కేరళ. ఈ నేల అద్భుతమైన ద్వీప సముదాయాల సమ్మేళనం. అందమైన హాలిడే డెస్టినేషన్‌కు కేరళలోని ఈ ద్వీపాలలో దాగివున్న పచ్చదనం, సహజ వృక్షసంపద సందర్శకులకు ఆహ్వానం పలుకుతాయి. కేరళలోని ఆకర్షణీయమైన పది ద్వీపాల విశేషాలను తెలుసుకుందాం.

మున్రో ద్వీపం
ఇది ఖచ్చితంగా కేరళలోని తప్పక సందర్శించవలసిన ద్వీపాలలో ఒకటి. మీ వెకేషన్‌ను మరింత ఆనందంగా గడిపేందుకు ఓనం పండుగ సందర్భంగా ఈ ప్రదేశాన్ని సందర్శించేలా ప్లాన్ చేయండి. ఈ సమయంలో అయితే ఇక్కడి ఆనందం రెట్టింపు అవుతుంది. కొల్లాం నుండి 27 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రదేశంలో కెనాల్ క్రూయిజ్, ఇరుకైన జలమార్గాలు, ప్రసిద్ధ కల్లాడ బోట్ రేస్ మరెన్నో ఆసక్తికరమైన అంశాలను అనుభవించవచ్చు. దీనిని ఆధునిక జీవితం నుంచి ఆటవిడుపునకు.. మానసిక ప్రశాంతతకు అనువైన ప్రదేశంగా చెప్పొచ్చు.

పూవార్ ద్వీపం
పూవార్ ద్వీపం ప్రకృతి ప్రేమికుల స్వర్గధామమనే చెప్పాలి. ఇది తిరువనంతపురం జిల్లాలో ఉంది. ఈ ద్వీపం ప్రధానంగా కొబ్బరి చెట్లతో గుబురుగా కప్పబడి ఉంటుంది. సీజన్‌తో సంబందం లేకుండా ఏడాదిలో ఎప్పుడైనా పూవార్ ద్వీపానికి టూర్ ప్లాన్ చేసుకోవచ్చు. నిర్మలమైన కేరళ బ్యాక్ వాటర్స్‌తో చుట్టుముట్టబడిన ఈ నేల ఉష్ణమండల స్వర్గంగా చెబుతారు. ప్రకృతితో కలిసి జీవించాలనుకునే వారికి పూవార్ ద్వీపం అనువైన ప్రదేశంగా పేరుగాంచింది.

వైపిన్ ద్వీపం
ఎర్నాకులం నగరానికి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న వైపిన్ ద్వీపం మీకు పోర్చుగీస్ సంస్కృతిని పరిచయం చేయడమే కాకుండా అక్కడి నిర్మాణాలు మిమ్మల్ని కనువిందు చేస్తాయి. అందుకే నిత్యం ఇది జనసాంద్రతతో ఉంటుంది. సందర్శకులు బస చేయడానికి ఒక అందమైన బంగ్లా ద్వీపంలో ఆహ్వానం పలుకుతుంది. ఇక్కడ ఉన్నప్పుడు ద్వీపంలోని అనేక చారిత్రక ప్రదేశాలను అన్వేషించేందుకు మంచి అవకాశం దొరుకుతుంది.

ధర్మడం ద్వీపం
ధర్మాడం బీచ్ ఒడ్డు నుండి 100 మీటర్ల దూరంలో ఉన్న ఈ ద్వీపాన్ని గ్రీన్ ఐలాండ్ అని కూడా పిలుస్తారు, ఎందుకంటే ఈ ప్రదేశం చుట్టూ పచ్చదనం పరచి ఉంటుంది. ప్రశాంతమైన విహారయాత్ర లేదా ఏకాంత పిక్నిక్ స్పాట్ కోసం కోరుకునే పర్యాటకులు, ధర్మాడం ద్వీపంలో అడుగుపెట్టవచ్చు. ఈ ప్రదేశానికి చేరుకోవడానికి, మీరు పడవ ప్రయాణం చేయవలసి ఉంటుంది. ఒడ్డున షికారు చేసే సమయంలో తలస్సేరి, అంజరకండి నదుల అద్భుత దృశ్యాలు మిమ్మల్ని కనువిందు చేస్తాయి.

బోల్గట్టి ద్వీపం
ఎర్నాకులం జిల్లాలోని ఫోర్ట్ కొచ్చి సమీపంలో ఉన్న బోల్గట్టి ద్వీపం కేరళలో సందర్శించడానికి అత్యంత సుందరమైన ప్రదేశాలలో ఒకటి. ఇక్కడి బోల్గట్టి ప్యాలెస్ ప్రసిద్ధ హెరిటేజ్ హోటల్ మరియు రిసార్ట్‌గా సందర్శకులను ఎంతగానో ఆకర్షిస్తుంది. మీరు ఈ ద్వీపంలో బస చేయడానికి కాటేజీలు కూడా అందుబాటు ఉన్నాయి. అలాగే, కొచ్చి ఇంటర్నేషనల్ మెరీనా ఇక్కడ ఉంది. ఇది దేశంలోనే ప్రసిద్ధిగాంచిన మెరీన్. అధునాతన విద్యుత్ సౌకర్యాలతో పాటు 34 పడవలకు ఆతిథ్యం ఇవ్వగల సామర్థ్యాన్ని కలిగి ఉంది.

పతిరమణల్ ద్వీపం
అలప్పుజా బ్యాక్ వాటర్స్‌లో ఉన్న చిన్న ద్వీపం పతిరమణల్. ఒత్తిడి నుంచి ఉపశమనం కోరుకుని, విశ్రాంతి తీసుకోవాలనుకునే పర్యాటకులు ఈ ద్వీపాన్ని ఇష్టపడతారు. ఇక్కడ చేయవలసిన వాటిలో ఒకటి పక్షులను చూడటం. మీరు లిటిల్ ఎగ్రెట్, కామన్ టీల్, నైట్ హెరాన్ మరియు స్టోర్క్-బిల్డ్ కింగ్‌ఫిషర్ వంటి అనేక రకాల పక్షులను ఇక్కడ చూడవచ్చు. ఈ పక్షులు సంవత్సరంలో ఒక నిర్దిష్ట సమయంలో ఇతర దేశాల నుండి వలస వస్తాయి. మీరు అలప్పుజాలో మీ వాహనాన్ని పార్క్ చేసి, పడవలో ఈ ద్వీపానికి చేరుకోవచ్చు.

విల్లింగ్డన్ ద్వీపం
కేరళలోని మానవ నిర్మిత ద్వీపాలలో ఇది ఒకటి. ఈ ద్వీపం గురించి ఇంకా చాలా మంది పర్యాటకులకు తెలియదు. ఇది రాష్ట్రంలోనే అతిపెద్ద ద్వీపం కూడా. ఈ ప్రదేశం యొక్క సహజ సౌందర్యం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. ఇక్కడి వాతావరణం కూడా అలాగే ఉంటుంది. ఈ ప్రదేశంలో జనసాంద్రత తక్కువగా ఉండటం వల్ల విశ్రాంతి తీసుకోవడానికి లేదా మీ కుటుంబంతో గడపడానికి గొప్ప ప్రదేశం.

కవ్వాయి ద్వీపం
ప్రజలు ఎక్కువగా ఈ ద్వీపాన్ని కవిల్ పట్నం అని పిలుస్తారు. మీరు కేరళ ద్వీపాలలో ఉన్న అడ్వెంచర్ అంశాలను ఎంజాయ్ చేయానుకుంటే కవ్వాయి ద్వీపంలో అడుగుపెట్టాల్సిందే. ఇక్కడ మీరు కొన్ని ఆసక్తికరమైన అడ్వెంచర్ కార్యకలాపాలలో పాల్గొనవచ్చు. అందులో ప్రధానమైనది వాటర్ జోర్బింగ్ మరియు బోటింగ్. అంతేకాదు, ఈ ద్వీపంలోని వ్యక్తులు చాలా స్నేహపూర్వకంగా ఉంటారు. వారి జీవనశైలి గురించి తెలుసుకోవడానికి మీరు వారితో మాట్లాడవచ్చు.

కురువద్వీప్ ద్వీపం
కురువద్వీప్ ద్వీపానికి విహారయాత్రను ప్లాన్ చేయడం అంటే ఓ సరికొత్త పర్యాటక ప్రపంచానికి ప్లాన్ చేసినట్లే. ఇక్కడ మీరు అనేక అంతరించిపోతున్న జాతుల ఆర్కిడ్లు మరియు పక్షులను ఆప్యాయంగా పలకరించవచ్చు. అంతేకాదు, ఈ ద్వీపంలో కేరళ పర్యాటక శాఖ నిర్వహించే తెప్పలు మరియు ఫైబర్ బోట్ సవారీలను కూడా ఆనందించవచ్చు. ప్రకృతితో కేరళవాసుల బంధాన్ని దగ్గరగా చూసేందుకు కురువద్వీప్ ద్వీపం సరైన ఎంపిక.

వినిస్ ఫార్మ్ ఐలాండ్
మీరు కేరళలోని ప్రైవేట్ దీవుల కోసం వెతుకుతున్నట్లయితే , వినీస్ ఫార్మ్ ఐలాండ్ వెళ్లవచ్చు. నగర జీవితంలోని సందడి నుండి దూరంగా ప్రకృతి ఒడిలో బస చేయడానికి ఇది సరైన ప్రదేశం. కొల్లాంలో ఉన్న ఈ ద్వీపం రెండు ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇది చెక్క నిర్మితమైన విల్లాలతో ఎంతో ఆకర్షణీయంగా అలంకరించబడి, పచ్చని ప్రకృతి దృశ్యాలతో చుట్టుముట్టబడి ఉంటుంది. ప్రకృతి ఒడిలో కలిసి హాయిగా గడపాలనుకునే జంటలకు ఇది చక్కటి ప్రదేశం.



Click it and Unblock the Notifications













