చలికాలంలో విహారయాత్ర...భోపాల్‌కు వెళ్లాల్సిందే..|
ఇక చలికాలం సీజన్ ప్రారంభం కానుంది. ఇలాంటి సమయంలో చాలామంది వెచ్చని ప్రాంతాలకు విహారయాత్రలు చేయాలని ప్లాన్ చేస్తుంటారు. అలాంటి వారికోసం మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి. ఇక్కడి పరిసరాలు చలికాలంలో మరింత అందంతో పర్యాటకులను ఆకర్షిస్తాయి. ప్రకృతి అందాలకు నెలవైన భోపాల్‌లో ఈ సీజన్‌లో సందర్శించేందుకు ఎన్నో ప్రాంతాలు ఉన్నాయి. ఇక్కడ ప్రశాంతమైన వాతవరణంతో పాటు పచ్చని చెట్లు, చెరువులు, పర్వతాలు ప్రకృతి ఒడిలో సేదతీరేందుకు అనువైన ప్రదేశాలు మరెన్నో.. ఈ చలికాలంలో కుటుంబ సభ్యులతో, స్నేహితులతో ఈ ప్రాంతంలో అద్భుతమైన సమయాన్ని గడిపేలా ప్రణాళికలు వేసుకోవచ్చు. భోపాల్‌లోని వన్‌వీహార్ చలికాలంలో పర్యటించేందుకు ఎంతో అనువైన ప్రదేశం. మరెందుకాలస్యం మీ ప్రయాణాన్ని మొదలుపెట్టండి మరి.

భోపాల్ లేక్ వ్యూ...
భోపాల్‌ని సరస్సు నగరంగా కూడా పిలుస్తారు. భోపాల్‌లోని ప్రసిద్ధ లేక్ వ్యూ పర్యాటకులు ఎంతగానో ఇష్టపడే ప్రదేశాలలో ఒకటి. లేక్ వ్యూను భోపాల్ గర్వంగా కూడా పిలుస్తుంటారు. ఈ సరస్సుల నగరానికి వచ్చినప్పుడు తప్పకుండా లేక్ వ్యూని మీ ప్రయాణ జాబితాలో చేర్చండి. చలికాలంలో ఇక్కడి సరస్సు దగ్గర కూర్చుని వేడి వేడి నీటిని ఆస్వాదిస్తూంటే ఆ అనుభూతి మాటల్లో వర్ణించడం కష్టతరమే.. ఈ సరస్సును సందర్శించడం ఒక విభిన్నమైన అనుభవమనే చెప్పకోవాలి.

తాజ్ ఉల్ మసీదు..
భోపాల్‌లోని ప్రసిద్ధ ప్రదేశాలలో తాజ్ ఉల్ మసీదు ఒకటి. ఇది కేవలం భోపాల్‌లోనే కాకుండా మొత్తం ఆసియాలోనే అతిపెద్ద మసీదుగా ప్రసిద్ధి చెందింది. ఇది భోపాల్ చరిత్రను పర్యాటకులకు పరిచయం చేస్తుంది. ఈ తాజ్ ఉల్ మసీదును మొఘల్ కాలంలో నిర్మించడం జరిగింది. భోపాల్ సందర్శించాలనుకునే వారు ఖచ్చితంగా ఈ మసీదు అందాలను తనివితీరా చూసి ఆనందించాల్సిందే..

ట్రైబల్ మ్యూజియం...
మధ్యప్రదేశ్ రాజధానిలో ఉన్న గిరిజన మ్యూజియం ఇక్కడికి వచ్చే పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. మధ్యప్రదేశ్‌లోని వివిధ తెగల గురించి ఈ మ్యూజియంలో తెలుసుకోవచ్చు. మధ్యప్రదేశ్‌లోని పాత సంస్కృతి, తెగల గురించి తెలుసుకోవాలంటే తప్పకుండా ఈ ట్రైబల్ మ్యూజియాన్ని సందర్శించాల్సిందే..
భీమ్ బెట్కా..
భోపాల్ నుంచి భీమ్ బెట్కాను చేరుకోవాలంటే సుమారు 45 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. పర్యాటకులు ఆటో లేదా బస్సులో ఈ ప్రాంతాన్ని చేరుకోవచ్చు. భీమ్ బట్కా అనేది పురాతన శిలాయుగం నివాస స్థలంగా చెప్పుకుంటారు. ఇందులో ఆదిమ మానవులు తయారు చేసిన రాక్ పెయింటింగ్‌లు, రాక్ షెల్టర్‌లు ఉన్నాయి. పర్యాటకుల సందర్శనార్థం వీటిని ఇక్కడ పొందుపరిచారు.
భారత్ భవన్...
భోపాల్‌లోని శ్యామలా కొండలపై ఉన్న భారత్ భవన్ ప్రత్యేకమైన జాతీయ సంస్థలలో ఒకటిగా ప్రసిద్ధి కెక్కింది. దీనిని 1982లో స్థాపించారు. ఈ భవన్‌ను ప్రముఖ ఆర్కిటెక్ట్ చార్లెస్ కొరియా రూపొందించినట్లు చరిత్ర చెబుతోంది. ఈ భవనంలో అనేక రకాల సృజనాత్మక కళలను పర్యాటకుల సందర్శనార్ధం ప్రదర్శించారు. అంతేకాకుండా ఇది భారతదేశంలోని వివిధ సాంప్రదాయ శాస్త్రీయ కళల సంరక్షణకు ప్రధాన కేంద్రంగా కూడా నిలుస్తుంది.
బిర్లా ఆలయం..
భోపాల్‌లోని లక్ష్మీ నారాయణ్ ఆలయం పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంది. దీనిని బిర్లా ఆలయం అని కూడా అంటారు. ఇది భోపాల్‌లోని ప్రసిద్ధ దేవాలయాలలో ఒకటిగా పేరుగాంచింది. ఇక్కడ లక్ష్మీ, నారాయణ విగ్రహాలు ఉన్నాయి. కొండపైన వెలసిన ఈ ఆలయం నుంచి ఇక్కడి సరస్సును అందాలను తిలకించవచ్చు. ఇక్కడకు సమీపంలోనే కాలిసోడ్ డ్యామ్ కూడా ఉంది. ఇది భోపాల్‌లోని పెద్ద, ప్రసిద్ధ డ్యామ్‌లలో ఒకటిగా నిలిచింది. కొండల మధ్య ఉన్న ఈ ఆనకట్ట విహారయాత్రకు ఎంతో ఉత్తమమైన ప్రదేశం..



Click it and Unblock the Notifications













