మన దేశంలో పర్యాటకం విషయానికి వస్తే, రైలు ప్రయాణం ఇందులో కీలకపాత్ర పోషిస్తుంది. గ్రామాలు, నగరాల మధ్య నుంచి సాగే ఈ జర్నీలో పచ్చని పంట పొలాలు, అధునాతన భవనాలు, సొరంగాలు, ఓవర్ బ్రిడ్జిలు రైలు ప్రయాణికులకు స్వాగతం పలుకుతున్న అనుభూతిని అందిస్తాయి. రైలు కిటికీ పక్కన కూర్చొని ఒక కప్పు టీ తాగుతూ ప్రకృతిలో భాగమయ్యే సతత హరిత అడవులు, పొగమంచుతో నిండిన మేఘాలు, అందమైన సరస్సులు ఇలా ఒక్కొక్కటిగా కనువిందు చేస్తాయి.
ప్రతి క్షణం మనల్ని విస్మయానికి గురిచేసే ఇలాంటి దృశ్యాలు చూపరులను మంత్రముగ్ధులను చేస్తాయి. రైలు ప్రయాణంలో మనం చేసే గమ్యం కంటే ఆ సమయంలో మనం ప్రయాణించే మార్గమే ముఖ్యమని అనిపించేలా కొన్ని రైలు మార్గాలు ఉంటాయి. పర్యాటక నగరం విశాఖపట్నం నుంచి సాగే రైలు ప్రయాణంలో అలాంటి అపురూప క్షణాలను చేరువచేసే మార్గాలను చూసొద్దాం రండి!
విశాఖపట్నం నుంచి అరకు
అందాల నగరం విశాఖపట్నం నుంచి అరకు వెళ్లే రైలు మార్గం జీవితంలో మర్చిపోలేని క్షణాలను అందిస్తుంది. ఈ రైలు మార్గం తూర్పు కనుమల గుండా ప్రయాణిస్తుంది. చుట్టూ పచ్చని కొండలు, మనోహరమైన గిరిజన గ్రామాలు, ఎగడిపడి దూకే అందమైన జలపాతాలు ఈ మార్గంలో తారసపడతాయి.

యాభైకి పైగా సొరంగాల గుండా సాగే అరకు రైలు ప్రయాణంలో ప్రతి మలుపూ ఎంతో ఉత్కంఠభరితమైన అనుభవాన్ని అందిస్తుంది. గిరిజన సంస్కృతిని దగ్గరగా చూసేందుకు ఈ ప్రయాణం ఎంతో సహాయపడుతుంది. కుటుంబసమేతంగా ఎంజాయ్ చేసేందుకు విశాఖపట్నం నుంచి అరకు రైలు ప్రయాణం ఎంతో అనువుగా ఉంటుంది.
విశాఖపట్నం నుండి రాయ్‌పూర్
విశాఖపట్నం నుండి రాయ్‌పూర్ రైలు ప్రయాణం భారతీయ రైల్వేలలోని కొన్ని అందమైన మార్గాల ద్వారా ప్రయాణికులను తీసుకువెళుతుంది. ముఖ్యంగా ఇది రాయగడ మరియు టిట్లాఘఢ్ మధ్య ఉండే అద్భుతమైన కొండ శ్రేణుల గుండా ప్రయాణాన్ని సాగిస్తుంది. ఈ కొండలను అనుసరించి రైలు పశ్చిమ ఒరిస్సా కొండల మీదుగా ప్రయాణించి మహానది మీదుగా వెళుతుంది. టిట్లాఘఢ్-రాయగడ శ్రేణుల మధ్య అటవీ ప్రాంతం ఈ సీజన్‌లో పచ్చదనాన్ని కమ్మేసుకుని, చూపు తిప్పుకోనీయంగా ఆకర్షిస్తాయి. ఎత్తుపల్లాల మధ్య సాగే ఈ ప్రయాణం జీవితంలో మర్చిపోలేని అనుభవాలను అందిస్తుందనడంలో ఆశ్చర్యం లేదు.

విశాఖపట్నం టు కోరాపుట్
విశాఖపట్నం నుండి కోరాపుట్ వరకు రైలు ప్రయాణం తూర్పు కనుమల ద్వారా ముందుకు సాగుతుంది. ఈ మార్గం ఉన్న అరకు లోయ గుండా వెళ్లడం ద్వారా అక్కడి ప్రకృతి అందాలను మాటల్లో వర్ణించడం కష్టమనే చెప్పాలి. మీరు మార్గంలో జోలాపుట్ మరియు కోలాబ్ రిజర్వాయర్‌ల అద్భుత దృశ్యాలను కనులారా వీక్షించే గొప్ప అవకాశాన్ని అందిపుచ్చుకుంటారు.
విశాఖపట్నం నుంచి కటక్
దారి పొడవునా ఉన్న పచ్చని పొలాలు మీకు సాదర ఆహ్వానం పలికే అనుభూతుని పొందాలంటే మాత్రం విశాఖపట్నం నుంచి కటక్ రైలు ప్రయాణం చేయాల్సిందే. ఈ రైలు ప్రయాణం మరింత ఆహ్లాదం కలిగించడానికి ప్రధాన కారణం చిలికా సరస్సు. ఆసియాలోనే అతిపెద్ద లోతైన ఉప్పునీటి సరస్సుగా పేరుపొందిన ఈ ప్రాంతంలో సందడి చేసే అరుదైన జంతుజాలాలు అదనపు ఆకర్షణగా నిలుస్తాయి.



Click it and Unblock the Notifications












