చారిత్రక కళావైభవాన్ని గుర్తుచేసే ఆలయం.. భావనారాయణస్వామి దేవాలయం
అలనాటి పురాతన ఆలయాలు చరిత్రకు ఆనవాళ్లుగా నిలుస్తాయి. అపురూపమైన శిల్ప సంపదతో అలనాటి కళావైభవాన్ని కళ్లకు కడుతుంటాయి. అలాంటి ఆలయాలు ఆంధ్రరాష్ట్రంలో చాలానే ఉన్నాయి. అధ్యాత్మిక చింతనతోపాటు చారిత్రక విషయాలు సంగ్రహించేందుకు ఇవి సహకరిస్తాయి. ఆ కోవకే వస్తుంది తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు సమీపంలోని సర్పవరంలో ఉన్న భావనారాయణస్వామి దేవాలయం. సుధీర్ఘ చరిత్ర కలిగిన ఆలయ విశేషాలు తెలుసుకుందాం.
తూర్పుగోవావరి జిల్లాలోని చారిత్రక పుణ్యక్షేత్రాల్లో సర్పవరం ప్రాంతం విష్ణు క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఈ క్షేత్ర మహత్యం గురించి బహ్మదైవత్తపురాణం, కాశీఖండం, భీమఖండం, మహా కావ్యాల్లో శ్రీనాధుడు, తిమ్మకవి వంటి కవులెందరో ప్రస్తావించారట. ఐదువేల సంవత్సరాల సుధీర్ఘ చరిత్ర కలిగిన ఈ ఆలయం గోదావరి నదికి తూర్పున, కాకినాడ సమీపంలో కొలువై ఉంది. పురాణ ప్రసిద్ధిగాంచిన ఈ ఆలయ ప్రాముఖ్యాన్ని పురావస్తుశాఖ గుర్తించింది.

ఈ పురాతన ఆలయాన్ని అనేక మంది రాజవంశీయులు మరమ్మతులు చేసి, పునర్నిర్మించినట్లు అధికారులు చెబుతున్నారు. తూర్పు చాళుక్య రాజులు, తమిళ రాజు కులోత్తుంగ మరియు కాటయవేమ రెడ్డి (రెడ్డి రాజులు) శాసనాలు లభించాయి. ఆలయ అభివృద్ధికి దేవాదాయశాఖ చర్యలు తీసుకుంటోంది. ఇక్కడికి వచ్చే సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా పర్యవేక్షిస్తున్నారు.
గాలిగోపురం.. సింహద్వారం
సువిశాలమైన ఆలయ ప్రాకారంతోపాటు ప్రశాంత వాతావరణాన్ని సందర్శకులకు చేరువ చేస్తుంది ఈ ప్రదేశం. ఆలయానికి ఉత్తరాన గాలి గోపురం, తూర్పున సింహద్వారం గంభీరంగా దర్శనమిస్తాయి. ఎత్తయిన ఆ గాలి గోపురం ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. పూర్తిగా రాతితో నిర్మితమైన ఆలయ నిర్మాణశైలి అలనాటి ఇంజనీరింగ్ ప్రతిభా ప్రావిణ్యానికి మచ్చుతునకగా నిలుస్తుంది. గోపురం, సంహద్వారంతోపాటు స్థంభాలపై చెక్కిన శిల్పాలు చూపు తిప్పుకోనియవు. సజీవ రూపాలకు ఉదాహరణలుగా దర్శనమిస్తాయి. గోపురమంతా గోపిక, అప్సరసలు మరియు వివిధ అవతారాలతో వరుస క్రమంలో చెక్కబడి ఉంటాయి.
లోపలకు ప్రవేశించింది మొదలు ప్రతి అడుగులోనూ ఓ మరుపురాని అనుభూతి కలుగుతుంది. త్రిలింగక్షేణి వైకుంటంగా ఈ క్షేత్రం ప్రసిద్ధిగాంచిన ఈ ఆలయం నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంది. ఇక్కడి ఆలయంలో ఏం కోరుకున్నా నెరవేరుతుందని భక్తుల విశ్వాసం. తూర్పు గోదావరి జిల్లాతోపాటు రాష్ట్ర నలుమూల నుంచీ సందర్శకులు ఇక్కడికి వస్తూ ఉంటారు.

ఎలా చేరుకోవాలి
ఆలయం ఎదురుగా ముక్తికుండం, నారద కుండం అనే రెండు చెరువులు ఉన్నాయి. అక్కడి స్వచ్ఛమైన నీటి అందాలు చూపరుల మనసును దోచేస్తాయి. పచ్చదనంతో నిండిన ఆలయ ప్రాంగాణం ఆధ్యాత్మిక చింతనను చేరువ చేస్తుంది. అంతేకాదు, ఆలయం ఆధ్వర్యంలో గోశాలను నిర్వహిస్తున్నారు. అలాగే, దూర ప్రాంతాలనుంచి వచ్చే సందర్శకుల విడిది కోసం దగ్గరలోని కాకినాడ అనువైనది చెప్పొచ్చు. వైశాఖసుద్ధ ఏకాదశి రోజున స్వామివారి కళ్యానం వైభవంగా జరుగుతుంది.
భావనారాయణస్వామిని దర్శించుకుంటే 108 నారాయణ క్షేత్రాలను దర్శించుకున్న పుణ్యం కంటే ఎక్కువ ఫలితం లభిస్తుందని అక్కడివారు చెబుతున్నారు. కాకినాడకు కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండడంతో ఇక్కడికి చేరుకునేందుకు అన్ని రైలు, రోడ్డు మార్గాలు ఉన్నాయి. ముందుగా కాకినాడ చేరుకోవాలి. అక్కడి నుంచి బస్సు, ఆటో సర్వీసులు అందుబాటులో ఉంటాయి.



Click it and Unblock the Notifications












