కళియుగ వైకుంఠ దైవమైన శ్రీ వెంకటేశ్వరస్వామి దర్శనం కోసం వెళ్లే భక్తులకు అలర్ట్.. నేడు డిసెంబర్ నెల శ్రీవారి దర్శనం ఆన్‌లైన్ కోటా టిక్కెట్లను విడుదల చేయనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ప్రతి నెలా తిరుమల ఆలయంలో జరిగే ఉత్సవాలు, పూజలు, పండుగలకు సంబంధించిన జాబితాను టీటీడీ ముందుగానే ప్రకటిస్తోంది. అయితే, వీటితోపాటు ప్రతి నెలా శ్రీవారి భక్తులకు ఎటువంటి ఆటంకాలు కలుగకుండా ఉండేందుకు ముందుగానే శ్రీవారి దర్శన టిక్కెట్లతో పాటు ఇతర టిక్కెట్లను ముందుగానే ఆన్‌లైన్‌లో ఉంచుతారు.
వాటివివరాలను ఒక నెలా ముందుగానే ప్రకటిస్తారు. డిసెంబర్ నెలలో దర్శనాలకు సంబంధించిన టిక్కెట్లను నేడు (సోమవారం) ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతున్నట్లు టీటీడీ పేర్కొంది. డిసెంబరు నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాతో పాటు శ్రీవాణి టిక్కెట్లు, వృద్దులు, వికలాంగుల కోటా, గదుల కోటా టిక్కెట్లను కూడా నేడు ఆన్‌లైన్‌లో ఉంచనున్నారు.
ఇతర దర్శన టిక్కెట్లు..
శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన డిసెంబరు నెల ఆన్ లైన్ కోటాను నేటి ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయగా, వీటితోపాటు వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల స్వామివారి దర్శన భాగ్యం పొందేందుకు వీలుగా నవంబరు నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను కూడా సెప్టెంబరు 23వ తేది మధ్యాహ్నం మూడు గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఇక, డిసెంబరు నెలకు సంబంధించిన స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ల కోటాను కూడా సెప్టెంబరు 24న ఉదయం పది గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు తెలిపింది.

నవనీత సేవ కోటా..
వీటితోపాటు తిరుమల, తిరుపతిలలో డిసెంబరు నెల గదుల కోటాను సెప్టెంబరు 24వ తేదిన మధ్యాహ్నం మూడు గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. తిరుపతి శ్రీవారి సేవ కోటా టిక్కెట్లను సెప్టెంబరు 27వ తేది ఉదయం 11 గంటలకు, నవనీత సేవ మధ్యాహ్నం 12 గంటలకు, పరకామణి సేవ మధ్యాహ్నం 1 గంటకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఇక, తిరుమల శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలనుకునేవారు, ఇతర పూర్తిసమాచారం కోసం టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌ను https://ttdevasthanams.ap.gov.in సంప్రదించగలరు.

నేరుగా శ్రీవారి దర్శనం ..
తిరుమలలో భక్తుల రద్దీ కాస్త తగ్గినట్లు అధికారులు తెలిపారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో వేచివుండే అవసరం లేకుండా నేరుగా శ్రీవారి దర్శనం జరుగుతోందని టీటీడీ పేర్కొంది. వీకెండ్‌లో కూడా భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. నిన్నఒక్కరోజే శ్రీవారిని దర్శించుకునేందుకు సుమారు 82,436 మంది భక్తులు వచ్చారని, ఇందులో 25,437 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మరీ మొక్కులు చెల్లించుకున్నారని అధికారులు పేర్కొన్నారు. భక్తుల సమర్పించే కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ.4.57 కోట్లు వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
శ్రీవారి ఆలయంలో ప్రారంభమైన శాంతి యాగం
తిరుమలలో నెయ్యి కల్తీ వ్యవహారంపై తలెత్తిన వివాదం క్రమంలో ఆలయంలో శాంతి యాగం నిర్వహిస్తున్నారు. ఆవు నెయ్యిలో దోషం ఉండడం వలన ప్రాయశ్చిత్తంగా శాంతి హోమం కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ఆలయ ఈవో వివరించారు. ఉదయం ఆరు గంటల నుండి పది గంటల వరకు శాంతి యాగం, పంచగవ్యాలతో సంప్రోక్షణ జరుగుతుందన్నారు.



Click it and Unblock the Notifications













