ఉత్తరాంధ్రలోని అతిపెద్ద గిరిజన జాతరకు వెళ్లారా?
భారతదేశం సంస్కృతి సంప్రదాయాలకు, ఆచారాలకు నిలయం. ఎన్నో మతాల కలయిక. ఇక్కడ వివిధ ప్రాంతాల్లో వివిధ ఆచారాలు, వివిధ సంప్రదాయాలు ఉన్నాయి. ఒక్కో ప్రాంతాల్లో ఒక్కో దేవతను ఇక్కడి ప్రజలు నమ్ముతుంటారు. విశాఖపట్నంలోని పాడేరులో వెలసిన మోదుకొండమ్మతల్లి అక్కడి గిరిజనుల నమ్మకం. వారు కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా ఆ దేవి అక్కడ పూజలు అందుకుంటుంది. ఇక్కడి గిరిజనుల ఆరాధ్యదైవమైన మోదకొండమ్మ అమ్మవారి జాతర ప్రతి సంవత్సరం మే నెలలో 3 రోజుల పాటు జరుగుతుంది. ఈ జాతరలో గిరిజన సాంప్రదాయ నృత్యం ధిమ్సా ఒక ప్రత్యేక ఆకర్షణ.
ఈ జాతరకు విశాఖ, గోదావరి జిల్లాల నుండి పెద్దసంఖ్యలో యాత్రికులు తరలివస్తారు. ఈ జాతరకు సుమారు 8లక్షలమంది భక్తులు వస్తారు. ఈ తల్లి ఉత్తరాంధ్ర గిరిజనుల ఆరాధ్యదైవం. ప్రధానంగా వినిపిస్తున్న కథనం ప్రకారం అమ్మవారి దేవాలయం ప్రస్తుతం సరిహద్దు గ్రామాలైన గాలిపాడు, కొత్తపాడు గ్రామాల దగ్గర దట్టమైన అడవిలో ఉండేదని చెబుతారు. ప్రతిసంవత్సరం ఆదివాసీల డప్పులతో నృత్యాలు చేసుకుంటూ వెళ్లి అమ్మవారికి మొక్కుబడులు చెల్లించేవారట.

విశేష చరిత్ర...
అల్లూరి జిల్లా పాడేరులో వెలసిన మోదకొండమ్మవారికి విశేష చరిత్ర ఉంది. మోదం అంటే సంతోషం.. గిరుల్లో వెలసిన దేవతకు కొండమ్మ మోదకొండమ్మ అనిపేరు వచ్చింది. ఒకసారి ఒక గిరిజనుడు చెంబును గుడిలో మరిచిపోయాడట. చెంబు కోసం తిరిగి గుడికి వెళ్లగా అమ్మవారు తన చెల్లెళ్లు మరియు తమ్ముడు పోతురాజుతో కలిసి భక్తులు సమర్పించిన ప్రసాదం ఆరగిస్తుందట.
అది గిరిజనుడు చూడడంతో అమ్మ ఆగ్రహించి ఇక మీదట తన దగ్గరకు ఎవరూ రావద్దని ఈ చెంబు ఎక్కడపడితే అక్కడే తనకు గుడికట్టించమని ఆ చెంబును గట్టిగా తన్నడంతో ఆ చెంబు ప్రస్తుతం అమ్మవారి పాదాలుగా పేరుపొందిన విశాఖపట్నం పాడేరు దారిలో పడిందట. అప్పటి నుండి అక్కడే అమ్మవారికి పూజలు, జాతరలు నిర్వహించడం చేస్తున్నారు.

మూడురోజుల పాటు జాతర..
నేటి నుంచి మోదకొండమ్మ జాతర మహోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. జాతర కోసం అధికారులు పటిష్ట బంధోబస్తు ఏర్పాటు చేశారు. ఈ జాతర మూడు రోజులు పాటు జరగనుంది. ఏజన్సీలో 14 వందల మంది పోలీస్ బలగాలు మోహరించాయి. మూడు రోజులు జిల్లా కేంద్రం పాడేరు పట్టణంలోకి వాహనాల అనుమతిని నిరాకరించారు. భారీ వాహనాలు ఘాట్ కిందవరకు పరిమితం చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. తొలిరోజు ఆదివారం అమ్మవారి ఆలయం మెట్టినిల్లు నుంచి బయలుదేరుతారు.
పాడేరు ఆలయం నుంచి శతకం పట్టు పుట్టింటికి డప్పుల వాయిద్యాలతో అమ్మవారి విగ్రహం తీసుకెళ్తారు. పాదాలను ఊరేగింపుగా తీసుకువెళ్లి శతకం పట్టు వద్ద ప్రతిష్టిస్తారు. మూడు రోజులు పాటు శతకం పట్టు వద్ద అమ్మవారికి పూజలు నిర్వహించడం ఆనవాయితీ. ఆ తరువాత విగ్రహాలను తీసుకొచ్చి గుడికి చేరుస్తారు. అక్కడితో జాతర ముగుస్తుంది. ఈ జాతరకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఒడిశా, ఛత్తీస్‌ఘడ్, రాష్ర్టాల నుంచి భక్తులు, గిరిజనులు వచ్చి మొక్కులు తీర్చుకుంటారు.
ఎలా వెళ్లాలి.
విశాఖపట్నం నుండి పాడేరుకు సుమారు 114 కిలోమీటర్ల దూరం ఉంది. ఆర్‌టిసి బస్సులో వెళ్లవచ్చు. విశాఖపట్నం వరకు విమానంలో లేదా రైల్లో చేరుకుంటూ అక్కడి నుండి లేదా చోడవరం నుండి ఆలయానికి చేరుకునేందుకు బస్సులూ, ప్రయివేటు వాహనాలూ అందుబాటులో ఉంటాయి.



Click it and Unblock the Notifications












