తిరుమల వెళ్లే స్వామివారి భక్తులకు అధికారులు షాకింగ్ న్యూస్ అందించారు. శ్రీవారి లడ్డూ పంపిణీలో టీటీడీ పలు కీలక మార్పులు చేసింది. ఇక నుంచి భక్తులు ఆధార్ కార్డు చూపిస్తేనే లడ్డూలు జారీ చేయాలని టీటీడీ నిర్ణయించింది. ఈ నూతన విధానం గురువారం నుంచి అమల్లోకి రాబోతున్నట్లు అధికారులు తెలిపారు. తిరుమల వెళ్లే స్వామివారి భక్తులకు ఒక భక్తుడికి కేవలం ఒక లడ్డూ మాత్రమే ఇచ్చే కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నారు. శ్రీవారిని దర్శించుకున్న భక్తులకు దర్శన అనంతరం టికెట్‌పై కేవలం ఒక్క లడ్డూను మాత్రమే అందజేస్తారు.
అంతకుముందు దర్శన టోకెన్‌పై ఒక భక్తునికి రెండు లడ్డూలు మాత్రమే ఇచ్చేవారు. ఇకనుంచి కొత్త విధానం అమల్లోకి రానుంది. దర్శనం టికెట్‌పై భక్తునికి కేవలం ఒక లడ్డు మాత్రమే అందజేస్తారు. ఇంకో లడ్డు కావాలంటే ఆధార్ కార్డు తప్పనిసరిగా చూపించాల్సిందే. అయితే, టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయంపై భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. స్వామి వారి లడ్డూ ప్రసాదంపై ఆంక్షలు విధించడం సరికాదని కొంతమంది భక్తులు అంటున్నారు.
లక్కీ డిప్ ద్వారా అంగప్రదక్షిణ టోకెన్లు..
ఇక, స్వామివారి భక్తులకు అధికారులు మరో న్యూస్ కూడా అందించారు. ఇకనుంచి అంగప్రదక్షిణ టోకెన్లను లక్కీడిప్ ద్వారా జారీచేయనున్నారు. ప్రతి శనివారం తిరుపతి అర్బన్, తిరుమల స్థానికులకు కేటాయిస్తోన్న 250 శ్రీవారి ఆలయ అంగప్రదక్షిణ టోకెన్లను ఇక నుంచి లక్కీ డిప్ ద్వారా కేటాయించనున్నట్లు టీటీడీ పేర్కొంది.

ఈ టికెట్లు కావాల్సిన భక్తులు గురువారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రిజిస్ట్రేషన్ కోసం ఆదార్‌కార్డు తప్పనిసరి. వీరికి సాయంత్రం 5 గంటల వరకు లక్కీ డిప్ ద్వారా టికెట్లు కేటాయిస్తామని ఆలయ అధికారులు తెలిపారు. టికెట్లు పొందిన భక్తుల మొబైల్‌కు మెసేజ్ సమాచారం అందిస్తామని, ఈ సమాచారం ఆన్‌లైన్‌లోనూ అందుబాటులో ఉంచుతామని అధికారులు పేర్కొన్నారు.
వారికి డిపాజిట్ చెల్లించబడదు..
లక్కీ డిప్‌లో టికెట్లు పొందిన శ్రీవారి భక్తులు ఆన్‌లైన్‌లో ఐదువందల రూపాయలు డిపాజిట్ చేయాలని సూచించారు. ఈ భక్తులు ఆలయంలోని మహతి కళాక్షేత్రంలో ఆధార్ కార్డు చూపించి శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకూ అంగప్రదక్షిణ టికెట్లు పొందవచ్చని అధికారులు తెలిపారు. అంగప్రదక్షిణ టికెట్లు పొందిన భక్తులకు శనివారం తెల్లవారుజామున అంగప్రదక్షిణకు అనుమతిస్తామని అధికారులు పేర్కొన్నారు. అనంతరం భక్తులు చెల్లించిన రూ.500 డిపాజిట్‌ను వారి ఖాతాల్లో జమ చేస్తామని టీటీడీ పేర్కొంది. తిరుపతి అర్బన్, తిరుమల స్థానికులు కాని భక్తులకు.. లక్కీ డిప్‌లో అంగప్రదక్షిణ టోకెన్లు పొందిన వారికి డిపాజిట్ డబ్బులు తిరిగి చెల్లించబోమని అధికారులు చెప్పారు.
స్వామివారి హుండీకీ భారీ ఆదాయం..
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉన్నట్లు అధికారులు తెలిపారు. స్వామివారి ఉచిత సర్వ దర్శనానికి 19 కంపార్ట్‌మెంట్లలో భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నట్లు అధికారులు వివరించారు. బుధవారం అర్ధరాత్రి వరకూ 65,131 మంది స్వామివారి దర్శనం భాగ్యం పొందగా, వీరిలో 30,998 మంది స్వామివారికి మొక్కుల రూపంలో తలనీలాలు సమర్పించుకున్నారు. బుధవారం ఒక్కరోజే స్వామి వారి హుండీ ఆదాయం రూ.4.66 కోట్లు లభించినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు.



Click it and Unblock the Notifications













