కడలి కెరటాలకు అడ్డునిలిచే మడ అడవుల విశేషాలు
ఉవ్వెత్తున ఎగసిపడే కడలి కెరటాలకు అడ్డునిలిచే మడ అడవుల అందాలను మాటల్లో వర్ణించడం కష్టమే. అరుదైన జీవరాశుల ఆవాసంగా వెలుగొందుతోన్న ఈ ప్రాంతం పర్యాటక ప్రేమికులను ఎంతగానో ఆకర్షిస్తుంది. అక్కడ వేసే ప్రతి అడుగులోనూ విజ్ఞాన వికాసమే కనిపిస్తుంది. కాకినాడ తీరప్రాంతం మాటున దాగిన కోరంగి వన్యప్రాణి అభయారణ్య సందర్శన అనుభవాలు మీ కోసం!
పెద్దాపురంలోని మా మిత్రబృందంతో విహారయాత్రకు బయలుదేరాం. అక్కడి నుంచి కాకినాడ - యానాం హైవే రహదారిలో దాదాపు 36 కిలోమీటర్ల దూరంలో ఉన్న 'కోరంగి అభయారణ్యం' క్షేత్ర పర్యటనకు సొంత వాహనంలో వెళ్లాం. గంట ప్రయాణం తర్వాత రహదారి పక్కనే ఉన్న కోరంగి అభయారణ్య ద్వారం' రానే వచ్చింది. అక్కడి నుంచి దాదాపు కిలోమీటరు దూరం వరకు భూమికి పచ్చని రంగు అద్దినట్లు ఇరువైపులా వరిపొలాలు, కొబ్బరి చెట్లు, రొయ్యల చెరువులు దర్శనమిచ్చాయి. అక్కడి రొయ్యలు, చేపల కోసం కాచుకు కూర్చున్న కొంగల గుంపులు ఆహారం కోసం సమావేశమైనట్టుగా కన్పించాయి.

ఆ ప్రాంగణం కళకళలాడుతూ..
కోరంగి వన్యప్రాణి అభయారణ్యం - మడ అడవుల సింహద్వారం చెట్టు కాండంతో అద్భుతంగా రూపొందించారు. ఆర్చీ పక్కన చెక్కలతో నిర్మించిన సమాచార బోర్డులు ఉన్నాయి. ముందు భాగంలో "I LOVE KORANGE" అని ఇంగ్లీష్ బోర్డు కనిపించింది. దాని దగ్గర ఫొటోలు తీసుకునేందుకు మావాళ్లు ఎంతో ఉత్సాహం చూపారు. పక్కనే ఉన్న టిక్కెట్ కౌంటర్లో టిక్కెట్ తీసుకుని లోపలికి వెళ్లాం. పిల్లలకు 10, పెద్దలకు 20, స్టిల్ కెమెరాకు 50 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ సందర్శకులను అనుమతిస్తారు. ప్రతి మంగళవారం సెలవు. మేం వెళ్లింది ఆదివారం కావడంతో సందర్శకుల సంఖ్య కాస్త ఎక్కువగానే ఉంది.
దగ్గరలోని విద్యార్థులు, కుటుంబసభ్యులు, స్నేహితులతో వచ్చిన వారితో ఆ ప్రాంగణం కళకళలాడుతూ కనిపించింది. ప్రధాన గేటు దాటి లోపలికి వెళ్లాక, మడ అడవుల్లో ఉండే వృక్ష, జంతువుల, పక్షులకు సంబంధించిన సమాచారంతో 'కోరంగి నేచర్ షాపు'ను ఏర్పాటు చేశారు. అయితే, మేం వెళ్లేటప్పటికి అది మూసేసి ఉంది. కొంచెం దూరం ముందుకు వెళ్తే చిన్నపిల్లలకు ఇష్టపడే ఆటవస్తువులు ఏర్పాటు చేశారు. క్యాంటిన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. 'చేపలు పట్టు పిల్లి' బొమ్మ పెద్దది ఏర్పాటు చేశారు.

హుషారైన బోటు షికారు
ఉత్సాహంగా మా అడుగులు మడ అడవుల్లోకి పడ్డాయి. ముందుగా తాడుతో నిర్మించిన బ్రిడ్జి దాటి వెళ్లగానే 'వాచ్ టవర్' కనిపించింది. దాని పైకెక్కి చూస్తే, దట్టంగా విస్తరించిన మడ అడవులను చూడొచ్చు. మన రాష్ట్రంలో మడ అడవుల విస్తీర్ణం దాదాపుగా 582 కిలోమీటర్ల మేర ఉండగా, అందులో 32 చదరపు కిలోమీటర్ల అడవులు తూర్పు గోదావరి జిల్లా కాకినాడ కోరంగి అభయరాణ్యంలో విస్తరించి ఉన్నాయి. వాచ్ టవర్ దగ్గర నుంచి గోదావరి నదీపాయ వరకు సిమెంట్ రోడ్డు ఉంది. అటవీ శాఖ వారు పర్యాటకుల కోసం బోటు షికారు ఏర్పాటు చేశారు.
అక్కడే టిక్కెట్ కొని, గోదావరి నదీ పాయ సముద్రంతో కలిసే ప్రాంతం వరకు 20 నిమిషాల పాటు బోటులో ప్రయాణించాం. నదికి ఇరువైపులా మడ అడవులు దట్టంగా విస్తరించి ఉన్నాయి. చెట్లపైన వందల సంఖ్యలో కొంగల గుంపులు కనిపించాయి. వాటితోపాటు ఈ అడవులు ఎన్నో రకాల పక్షులకు ఆవాసాలుగా ఉన్నాయి. సంతానోత్పత్తికి, ఆహారానికి అనుకూలంగా ఉంటుంది ఈ ప్రాంతం.

జీవజాలానికి ఆవాసం
అక్కడ పక్షుల్లో ఎక్కువగా కనిపించేవి నీటికాకి, కొంగ, నారాయణ పక్షులు, ఉల్లంపిట్టలు, బాతులు, సముద్రపు చిలకలు. ఇలా ఉభయచరాలు, పక్షులు, క్షీరజాతులు మొత్తం 119 రకాల జీవజాలం ఈ మడ అడవుల్లో నివసిస్తున్నాయని అక్కడివారు చెప్పారు. పొన్న, నల్లమడ, కళింగ, గుగ్గిలం మొదలైనటువంటి మడ జాతి మొక్కలతో దట్టమైన వృక్షసంపదతో పాటు, చేపలు పట్టు పిల్లి, నీటికుక్క, నక్క వంటి జంతు సంపద ఇక్కడ కనిపిస్తాయి. సముద్రపు తాబేలు, ఉప్పు నీటి మొసలి వంటి ఉభయచర జీవుల బొమ్మలు అక్కడక్కడ ఏర్పాటు చేశారు. అద్భుత జీవవైవిధ్యానికి చిరునామా ఈ మడ అడవులని చెప్పొచ్చు. చిత్తడి నేలలో పెరిగే ఈ చెట్ల వేర్ల వ్యవస్థ భిన్నంగా ఉంటుంది. మామూలు నేలలో పెరిగే చెట్ల వేర్లు భూమి లోపలికి పెరుగుతాయి.
కానీ ఇక్కడ నేలలు నిరంతరం నీటిలో మునిగి ఉంటాయి. కాబట్టి, భూమిలోకి ఉండే వేర్ల వల్ల ఈ చెట్లకు కావాలిసినంత ఆక్సిజన్ తీసుకునే అవకాశం తక్కువ. అందువల్ల మడ అడవులలో పెరిగే మొక్కల వేర్లు భూమిపైకి కనబడతాయి. వీటి నుంచి కొత్త మొక్కలు రావడం వల్ల ఇక్కడ చెట్లు దట్టంగా గుబురుగా పెరుగుతాయి. ఇలాంటి చిత్తడి అడవులు కేవలం నదీసాగర సంగమ ప్రదేశాలలో ఏర్పడ్డ బురద నేలల్లోనే కనిపిస్తాయి. గంగానది తీర ప్రాంతం పశ్చిమ బెంగాల్లోని సుందరవనాలు మన దేశంలో అతిపెద్ద మడ అడవులైతే.. రెండోది గోదావరి తీరంలోని ఈ కోరంగి మడ అడవులు.

పక్షుల కిలకిలరావాలు..
ఈ అడవుల్లో నేల మీద బురద, మొక్కల వేర్లతో ఉండడం వల్ల నేలపై నడవడం కష్టం. కాబట్టి దాదాపు 3.5 కిలోమీటర్లు చెక్క వంతెన ఏర్పాటు చేశారు. మడ అడవుల అందాన్ని ఆస్వాదించడానికి ఏర్పాటు చేసిన ఈ చెక్క వంతెన మనరాష్ట్రంలోనే అతిపెద్దదిగా గుర్తింపు పొందింది. వంతెన మీద నడుచుకుంటూ వెళుతుంటే కలిగే అనుభూతి మాటల్లో వర్ణించడం కష్టమే. అక్కడక్కడా జంతువులు, వృక్షాలు, పాములు, పిల్లి వంటి మడ అడవుల్లో జీవించే జీవుల గురించి రాసి పెట్టిన బోర్డులు కనిపించాయి. జంతువులు, పక్షులు, మొసలి, చేపలు పట్టుపిల్లి బొమ్మలు ఏర్పాటుచేశారు. దారిపొడవునా చల్లని గాలులు వీస్తుంటే పక్షుల కిలకిలరావాలు సంగీతంలా వినిపించాయి.
అద్భుత జీవవైవిధ్యాన్ని ప్రత్యక్షంగా చూపడానికి, విజ్ఞానాన్ని వినోదాన్ని ఒకేచోట పొందడానికి మడ అడవులు సందర్శన ఎంతగానో ఉపయోగపడుతుంది. 'అడవులను మనం కాపాడితే అవి మనల్ని రక్షిస్తాయి' అనే దానికి ప్రత్యక్ష సాక్ష్యం ఈ కోరంగి మడ అడవులు. నిజానికి, ఏటా సంభవించే తుపానుల నుంచి కాకినాడ తూర్పుగోదావరి ప్రజలను కాపాడడంలో కీలకపాత్ర ఈ మడ అడవులదే. ఇలాంటి అడవులు లేని ప్రదేశాల్లో తుపాన్ వచ్చిన సందర్భంలో జరిగిన ప్రాణ, ఆస్తి నష్టాలు చూస్తే, కోరంగి మడ ఆడవులు ఉండడం కాకినాడ ప్రజలకు పచ్చని రక్షణ గోడ అని అంగీకరించక తప్పదు. రెండుగంటల తర్వాత అందరం ఓ చోటకు చేరుకున్నాం. సాయంత్రం ఆరు గంటలకు తిరిగి పెద్దాపురం బయలుదేరాం. ఇలాంటి అద్భుతమైన పర్యటనలు పెద్దలతోపాటు విద్యార్థులకు చేరువ చస్తే, వారికి పర్యావరణం పట్ల చక్కని అవగాహన కలుగుతుంది అనడంతో సందేహమే లేదు. మరెందుకు ఆలస్యం మీరూ మీ ప్రయాణాన్ని మొదలు పెట్టండి!



Click it and Unblock the Notifications












