కేంద్ర రైల్వే శాఖ ఏలూరు వాసులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఇకనుంచి సికింద్రాబాద్- విశాఖపట్నం మధ్య నడుస్తోన్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు ఏలూరులో ఆగనుంది. ఇక్కడ హాల్టింగ్ ఇవ్వాలనే డిమాండ్ ప్రజలతోపాటు ప్రజాప్రతినిధుల నుండి కూడా చాలారోజులుగా వినిపిస్తోంది. ఏలూరు రైల్వే స్టేషన్‌లో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు హాల్టింగ్ ఇవ్వనున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి వెల్లడించడంతో ఏలూరు ప్రజల కోరిక నేరవేరినట్లు అయింది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో రానుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
తక్కువ డిస్టెన్స్ కారణం చూపుతూ..
నిజానికి ఏలూరు స్టేషన్‌లో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ హాల్టింగ్ డిమాండ్ చాలారోజులుగా ఉంది. అయితే, తక్కువ డిస్టెన్స్ ఉండడం వల్ల స్టాప్ సాధ్యం కాదని రైల్వే అధికారులు ఈ డిమాండ్‌ను దాటవేస్తూ వచ్చారు. సికింద్రాబాద్ నుంచి వచ్చే వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు ప్రస్తుతం ఏపీలో విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్‌లలో హాల్టింగ్ ఉంది. అయితే, విజయవాడ, రాజమండ్రి ఈ రెండు స్టేషన్ల మధ్య ఏలూరు స్టేషన్ ఉమ్మడి జిల్లాకు ప్రధాన స్టేషన్‌గా ఉంటుంది. అంతేకాదు, విజయవాడ నుంచి ఏలూరు 62 కిలోమీటర్లు ఉండగా, ఏలూరు నుంచి రాజమండ్రి 98 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ కారణంగా ఏలూరులో హాల్టింగ్ విజయవాడ, రాజమండ్రి మధ్య ఏలూరే పెద్ద స్టేషన్. అందుకే ఏలూరు రైల్వే స్టేషన్‌లో హాల్టింగ్ ఇవ్వాలని జిల్లా ప్రజలు తమ డిమాండ్ వినిపిస్తూ వస్తున్నారు.

తాజా నిర్ణయం అమల్లోకి వస్తే..
సికింద్రాబాద్ నుంచి బయలుదేరే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ఐదు స్టేషన్‌లలో ఆగి విశాఖపట్నం చేరుకుంటుంది. సికింద్రాబాద్‌లో మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి ఆ తర్వాత వరంగల్, ఖమ్మం స్టేషన్లలో హాల్టింగ్ ఉంటుంది. అక్కడి నుంచి విజయవాడ ఆ తర్వాత రాజమండ్రి, సామర్లకోటలో హాల్టింగ్‌కు అవకాశం ఇచ్చారు. తాజాగా రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయం అమలులోకి వస్తే.. ఏలూరుతో కలిపి మొత్తం సికింద్రాబాద్- విశాఖ వందేభారత్ హాల్టింగ్ స్టేషన్‌లు ఆరుకు చేరుతాయి. కేంద్ర రైల్వేశాఖ ఏలూరు స్టాప్ ప్రకటనను అధికారికంగా ఎప్పుడు ప్రకటిస్తుందా అని జిల్లా వాసులు ఆశగా ఎదురు చూస్తున్నారు.
వ్యాపారులు.. పర్యాటకులకు..
మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలతో ఏలూరు జిల్లా కొత్తగా ఏర్పడింది. ఇందులో ఏలూరు, దెందులూరు, చింతలపూడి, పోలవరం, నూజివీడు, కైకలూరు, ఉంగుటూరు నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే, దెందులూరు, చింతలపూడి, పోలవరం ప్రాంతాల్లో ఫామాయిల్, చేపల చెరువులు ఎక్కువగా ఉంటాయి. ఈ పంటలకు సంబంధించిన వ్యాపార లావాదేవీల నిమిత్తం నిత్యం వ్యాపారులు, రైతులు ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఎక్కువగా విజయవాడ, విశాఖపట్నం జర్నీ చేస్తారు.
ఇలాంటి వారికి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ఏలూరులో ఆగడం శుభవార్త అనే చెప్పాలి. వీరితోపాటు ఆలయాల సందర్శన, టూర్‌ల కోసం జర్నీ చేసేవారికి వందేభారత్ ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది. అలాగే, నూజివీడు ప్రాంతంలో మామిడి ఎక్కువగా పండిచడం వల్ల ఇక్కడి ప్రాంతాలనుంచి విజయవాడ, రాజమండ్రి, వైజాగ్ ఎక్కువగా ప్రయాణాలు చేస్తుంటారు. అలాంటి వారికి కూడా ఏలూరు నుంచి వందేభారత్ అనుకూలంగా ఇప్పుడు మరింత సులభతరంగా మారనుంది.



Click it and Unblock the Notifications













