హిమాచల్ ప్రత్యేక వంటకాలను ఓ పట్టు పట్టాల్సిందే!
హిమాచల్ ప్రదేశ్‌లో అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. అందుకే వీటిని సందర్శించడానికి పర్యాటకులు ఎక్కువ మొగ్గు చూపుతారు. కొండ ప్రాంతం కావడంతో హిమాచల్ అందాలను తప్పక అనుభూతి చెందాలనేది చాలా మందికి కల. ఇక్కడ ఎత్తయిన పర్వతాలు మరియు అందమైన లోయలు సందర్శకుల మనసును కట్టిపడేస్తాయి. అయితే, ఇక్కడి లోయలు మాత్రమే కాకుండా హిమాచల్ ప్రదేశ్ ఆహారాలు కూడా పర్యాటకులను ఆకర్షిస్తాయి. ఇక్కడకు వచ్చే పర్యాటకులను ఆకర్షించే కొన్ని ఆహార పదార్థాల ప్రత్యేకతలు తెలుసుకుందాం.
హిమాచల్ ప్రదేశ్ ఆహారంలో ఆరోగ్యానికి మేలుచేసే చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అందుకే ఇక్కడి ఆహారం ప్రసిద్ధి చెందింది. మీరు ఎప్పుడైనా హిమాచల్‌కు వెళ్లినట్లయితే, ఖచ్చితంగా ఇక్కడ ప్రసిద్ధ వంటకాలను రుచిచూడాల్సిందే. ఈ వంటకాలు కడుపు నింపడమే కాకుండా సందర్శకుల మనస్సును కూడా ఆనందపరుస్తాయి. హిమాచల్ ప్రదేశ్ వంటకాలు ప్రధానంగా ఇక్కడి వాతావరణంతోపాటు అక్కడివారి ట్రెడిషన్‌పై ఆధారపడి ఉంటాయి.

బబ్రూ
'బబ్రూ' వంటకం సిమ్లాలో తయారుచేయబడిన ప్రసిద్ధ వంటకం. హిమాచల్ ప్రదేశ్ ప్రత్యేక వంటలలో ఇది ఒకటి. ఇది షార్ట్ బ్రెడ్‌లా కనిపిస్తుంది. మీరు దీన్ని అల్పాహారంలో తినవచ్చు. సిమ్లాలో దొరికే చింతపండు చట్నీతో ఈ వంటకం తింటే ఆ రుచిని మాటల్లో వర్ణించడం కష్టమే. ఏదైనా పండుగల సమయాల్లోనూ దీనిని ట్రై చేయవచ్చు.

ధామ్
'ధామ్' ఇది వంటకం కాదు. అనేక రుచికరమైన వంటకాలతో మిళితమైన ఓ సాంప్రదాయ థాలీ. ఈ ప్లేట్‌లో పప్పుతో పాటు అన్నం, పెరుగు, రాజ్మా, ఇంకా అనేక వస్తువులు లభిస్తాయి. హిమాచల్ ప్రదేశ్‌లో ఏదైనా పండుగ మరియు ప్రత్యేక సందర్భంలో ఈ స్పెషల్ ధాలీ లేకపోతే ఆ ఫంక్షన్ అసంపూర్ణంగా ఉన్నట్లే చెప్పుకొవచ్చు. చంబా, మనాలి మరియు కాంగ్రాలలో ధామ్ ఆనవాళ్లు ఎక్కువగా కనిపిస్తాయి

మద్రా
హిమాచల్ ప్రదేశ్‌లో మీకు సులభంగా దొరికే వంటకం మద్రా డిష్. రాష్ట్రంలోని చంబా జిల్లాలో ఈ వంటకం ప్రాచుర్యం పొందింది. దాని ప్రత్యేకత గురించి మాట్లాడినట్లయితే, నల్ల శనగలు లేదా చిక్‌పీస్‌ను నానబెట్టి తయారుచేస్తారు. దీన్ని తయారు చేసేటప్పుడు లవంగాలు, పసుపు, యాలకులు, ధనియాల పొడి మరియు దాల్చిన చెక్కను ఉపయోగిస్తారు. దాల్చిన చెక్క ఈ వంటకానికి ప్రాణం పోస్తుందని చెప్పొచ్చు. నానబెట్టిన పప్పుతో తయారు చేయబడిన ఈ వంటకం హిమాచల్ రాష్ట్ర ఆహార సంస్కృతిని ప్రతిబింబిస్తుంది.

ఛ గోష్ట్
'ఛ గోష్ట్' అనేది కొండ వంటకం అని పేరులోనే తెలుస్తుంది. హిమాచల్ ప్రదేశ్‌లోని ప్రసిద్ధ వంటకాల్లో ఛా గోష్ట్ ఒకటి. దీన్ని తయారు చేయడానికి గొర్రె మాంసాన్ని ఉపయోగిస్తారు. ఈ మాంసంతోపాటు శనగ పిండి, పెరుగు మరియు యాలకులతోపాటు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలు, వెల్లుల్లి-అల్లం పేస్ట్‌ను ఉపయోగిస్తారు.

సిద్ధూ
హిమాచల్ ప్రదేశ్‌లో సందర్శకులకు 'సిద్ధూ' అంటే చాలా ఇష్టం. ఈ వంటకం గోధుమ పిండితో తయారు చేస్తారు. దీని కోసం, గోధుమ పిండిలో యాక్టీవ్ డ్రై ఈస్ట్ ఉపయోగిస్తారు. తరువాత రెండింటినీ బాగా పిసికి కలుపుతారు. దీని తరువాత, పిండిని కనీసం 5 నుండి 6 గంటలు పక్కన పెట్టాల్సి ఉంటుంది. అనంతరం ఇది దేశీ నెయ్యి, పప్పు మరియు చట్నీతో వడ్డించబడుతుంది.



Click it and Unblock the Notifications












