ప్రాంతమేదైనా నదీ తీరపు అందాలను మాటల్లో వర్ణించడం కష్టమే. అయితే, అవే అందాలు గజిబిజి నగరపు నడిబొడ్డున ఉంటే ఎలా ఉంటుంది? ప‌్రశాంతతను పంచే పచ్చదనం.. ఆహ్లాదాన్ని చేరువ చేసే ప్రాంగణం ఒకే చోట నిక్షిప్తమై ఉంటే మీరేం చేస్తారు? ఎందుకంటే ఇప్పుడు బెజవాడ నగరంలోనే నందన వనం లాంటి పార్కు అందుబాటులోకి వచ్చేసింది. పరవళ్లుతొక్కే కృష్ణానదీ తీరాన ఏర్పాటు చేసిన కృష్ణమ్మ జలవిహారం పార్కు నగరవాసులకు ఆహ్లాదాన్ని పంచుతూ.. కుటుంబసమేతంగా రారమ్మని ఆహ్వానిస్తోంది. మరెందుకు ఆలస్యం ఆ కృష్ణమ్మ జలవిహార్ విశేషాలను చూసేద్దాం రండి!
నగరంలో లైఫ్ ఎలా ఉంటుంది? నిత్యం పని ఒత్తిడి మనసును ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఆ ఒత్తిడి నుంచి కాస్త ఉపశమనం కోసం వీకెండ్ వచ్చిందంటే చాలు.. ఎక్కడికైనా వెళ్లి, ప్రశాంతమైన వాతావరణంలో సేదదీరేందుకు మనసు ఉవ్విళ్లూరుతుంది. అలాంటివారి కోసమే ఇప్పుడు విజయవాడ కృష్ణా నదీ తీరం బుస్తాబయింది. నగరం నడిబొడ్డున నందన వనం లాంటి పార్కు అందుబాటులోకి వచ్చేసింది. కృష్ణానదీ తీరాన ఏర్పాటు చేసిన కృష్ణమ్మ జలవిహారం పార్కు ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. సందర్శకుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్, పిల్లలు కేరింతలు కొట్టేలా వారి కోసం ఆటపరికరాలను ఏర్పాటు చేశారు.

ఆహ్లాదం కలిగించే రకరకాల మొక్కలు..
బెజవాడ నగరంలో ఒకప్పుడు పార్కుకు వెళ్లాలంటే రాజీవ్ గాంధీ పార్కు, అంబేడ్కర్ పార్కులాంటివి గుర్తుకువచ్చేవి. ఇప్పుడు తాజా అందుబాటులోకి వచ్చిన జలవిహార్ పార్క్ కుటుంబసమేతంగా గడిపేందుకు నగరవాసులకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. ఇటీవల కాలంలోనే ఏపీ ముఖ్యమంత్రి ఈ పార్క్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. పరవళ్లుతొక్కే కృష్ణానది నుంచి వీచే చల్లటి గాలుల మనసుకు సరికొత్త ఉల్లాసాన్ని అందిస్తాయి. ఎంతో ఆహ్లాదం కలిగించే రకరకాల మొక్కలు ఇక్కడ చూడొచ్చు.
పార్కును సందర్శించిన వారికి ఆహ్లాదకరమైన వాతావరాణాన్ని అందించేలా ప్రతి అడుగూ తీర్చిదిద్దారంటే నమ్మండి. ఇక్కడి వాకింగ్, ఓవెన్ హోంలో వ్యాయామంతో మానసిక ఉల్లాసం పొందేలా ప్రత్యేక చర్యలు చేపట్టారు.
నగరానికే ఓ ఐకాన్..
జలవిహార్ పార్క్ నగరంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చే సందర్శకులతో ఉదయం, సాయంత్రం వేళల్లో సందడిగా దర్శనమిస్తోంది. ఇక్కడికి వచ్చేవారి వాహనాలు పార్కింగ్ చేసుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కృష్ణానది ఒడ్డున ఏర్పాటు చేసిన కృష్ణమ్మ జలవిహారం పార్కు బెజవాడ నగరానికే ఓ ఐకాన్‌గా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక్కడి ఆహ్లాదకరమైన వాతావరణం గురించి మాటల్లో వర్ణించడం కష్టమే అనుకోండి. అంతేకాదు, రాత్రి వేళల్లో కూడా పార్కులో కాసేపు సేద తీరేందుకు వీలుగా మిరుమెట్లుగొలిపే లైట్ సెట్టింగ్ ఏర్పాటు చేశారు.
నగరవాసులకు శారీరక శ్రమ లేక పోవడంతో ఎక్కువగా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. అలాంటివాటి నుంచి బయట పడేందుకు వ్యాయామంపై దృష్టి సారిస్తున్నారు. ఒకప్పుడు వ్యాయామం చేయాలంటే జిమ్‌కు వెళ్లడం, లేదంటే వాకింగ్ ట్రాక్ ఉన్న మైదానాలకు వెళ్లడం చేసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా హాయిగా జలవిహార్‌కు చేరుకుంటున్నారు. మరెందుకు ఆలస్యం మీరూ జలవిహార్‌కు వెళ్లి సందడి చేయండి!



Click it and Unblock the Notifications












