అయోధ్య రామాలయంలో శ్రీరాముని విగ్రహ పవిత్రోత్సవం పూర్తయింది. ఈ మహత్తర కార్యం ఎంతో ఘనంగా నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆధ్వర్యంలో రామాలయంలో ఈ గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భారతదేశం మరియు విదేశాల నుండి వందలాది మంది అతిథులు పాల్గొన్నారు. ఈ ఆలయం కింది అంతస్తులో అందమైన రాంలాలా విగ్రహ ప్రతిష్ఠాపన అనంతరం మొదటి అంతస్తులో రామ్ దర్బార్ నిర్మాణానికి సన్నాహాలు ముమ్మరం చేయనున్నారు.ఈ క్రమంలో దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి గురించి ఓ సారి తెలుసుకుందాం.
దేశంలో దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచల పట్టణంలో పావన గోదావరి నది తీరాన వెలసింది. ఈ ఆలయానికి ఎన్నో యేళ్ల పురాతన చరిత్ర ఉంది.

భక్తుని కోరిక మేరకు శ్రీరాముడు ఇచ్చిన వరం ప్రకారం ఇక్కడ సతీ సమేతుడై వెలసాడు. ఇక్కడి శ్రీరాముడిని భక్తులు ఎంతో ప్రేమతో వైకుంఠరాముడు అని పిలుచుకుంటారు. ఎందుకంటే ఇక్కడి రాముడు వైకుంఠమునకు వెళ్ళిన తరువాత మళ్లీ భూమి మీదకి వచ్చి, తన భక్తుడైన భద్రుడి కోరిక తీర్చి భద్ర పర్వతంపై నిలిచాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే నిత్యం ఇక్కడికి లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. అలాగే ఆలయ కమిటీ వారు కూడా సీతారాముల కళ్యాణాన్ని కన్నుల పండగగా నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం తెలంగాణ ప్రభుత్వం పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు స్వామి వారికి సమర్పిస్తూ ఉంటుంది.
భద్రాచలంలోని ఈ దేవాలయంలో సీతా, లక్ష్మణ, హనుమంత సమేతంగా శ్రీరామచంద్రుడు ఇక్కడ అత్మారాముని రూపంలో కొలువుతీరి ఉండడం మనం చూడొచ్చు. ఇక్కడ సీత, రాముని తొడపై కూర్చొని ఉన్నట్లు విగ్రహాలు చెక్కబడి ఉంటాయి. ఇదే ఇక్కడి ప్రత్యేకత. అంతేకాదు ప్రతి 60 సంవత్సరాలకు ఒకసారి, ఇక్కడ శ్రీరామ పట్టాభిషేకాన్ని ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. రామదాసు చేయించిన వివిధరకాల నగలు దేవస్థానపు ప్రదర్శనశాలలో భక్తుల సందర్శనార్థం ప్రదర్శనకు ఉంచుతారు.
ఎలా చేరుకోవాలి...
రైలు మార్గం ద్వారా ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవాలనుకునేవారికి భద్రాచల పట్టణానికి 40 కిలోమీటర్ల దూరంలో భద్రాచలం రోడ్ పేరుతో కొత్తగూడెం పట్టణంలో ఉన్న రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్. బస్సు మార్గం ద్వారా ప్రయాణం చేయాలనుకునేవారు భద్రాచల పట్టణంలో ఉన్న బస్ డిపోకు రెండు తెలుగు రాష్ట్రాలలోని అన్ని ప్రధాన ప్రాంతాల నుంచి బస్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. భద్రాద్రి రామయ్య దర్శనం పూర్తయిన వెంటనే ఆలయంలోని తూర్పు భాగాన భక్తుల సౌకర్యార్థం ప్రసాద కౌంటర్ కూడా అందుబాటులో ఉంటుంది.
ఈ కౌంటర్లో 400 గ్రాముల లడ్డు వంద రూపాయలుగా 100 గ్రాముల లడ్డు 25 రూపాయలుగా ఇస్తారు. వీటితోపాటు పులిహోర చక్కర పొంగలి బెల్లం పొంగలి లాంటి ప్రసాదాలను భక్తులకు అందజేస్తారు. ఇక్కడ భక్తుల కోసం వసతి సౌకర్యాలు కూడా అందుబాటులో ఉన్నాయి. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం నందు భక్తుల సౌకర్యార్థం పలు ఏసి, నాన్ ఏసీ రూములు అందుబాటులో ఉన్నాయి. వీటితోపాటు కాటేజీలు సత్రాలు సైతం భక్తులకు తక్కువ ధరకే లభిస్తాయి. ఈ రూములను ముందస్తుగా బుకింగ్ చేసుకునేందుకు భద్రాద్రి దేవస్థానానికి సంబంధించిన అధికారిక వెబ్సైట్ www.bhadrachalamtemple.telangana.gov.inను సందర్శించగలరు.



Click it and Unblock the Notifications












