విజయవాడలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఇంద్రకీలాద్రిపై కొలువైన కనక దుర్గమ్మ ఆలయంలో శాకాంబరీ దేవి ఉత్సవాలు ఈ రోజు (జూలై 19)న ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలలో ఆ కనకదుర్గ అమ్మవారు కూరగాయలు, పండ్లు అలంకరణలో శాకాంబరీ దేవిగా దర్శనం ఇస్తారు. శాకాబరీదేవి అవతారంలో ఉన్న ఆ దుర్గమ్మను దర్శించుకొనేందుకు భక్తులు ఇంద్రకీలాద్రిపై పోటెత్తారు. తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు తరలిరావడంతో క్యూలైన్‌లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో శాకంబరి ఉత్సవాలు ప్రారంభం కావడంతో 21టన్నుల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, నిమ్మ, యాపిల్ కాయలతో అమ్మవారిని శాకాంబరీ దేవిగా అలంకరణ చేశారు. ఉత్సవాల్లో భాగంగా ఇంద్రకీలాద్రి రాజగోపురంతో పాటు అమ్మవారి అలంకరణలు కూడా విద్యుత్ వెలుగుల్లో ప్రకాశవంతంగా మిరుమెట్లుగొలుపుతున్నాయి.
ఈ శాకంబరీ ఉత్సవాల కోసం భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతోపాటు ఉత్సవాల ఆలంకరణకు అవసరమైన ఆకుకూరలు, కాయగూరలను విరాళంగా అందజేయడం అనవాయితీగా వస్తోంది. దేవస్ధానం ప్రాంగణంతోపాటు అమ్మవారి ఉపాలయాలలోని దేవతా మూర్తులకు, ఉత్సవ మూర్తులకు ఆ కూరగాయలు, పండ్లతో ఆలయ అర్చకులు అందంగా అలంకరించారు.

కట్టుదిట్టమైన ఏర్పాట్లు..
ఈ రోజు నుంచి నుంచి మూడు రోజుల పాటు ఇంద్రకీలాద్రిపై కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు అలంకరణతో దుర్గమ్మ శాకాంబరిగా దర్శనం ఇవ్వనున్నారు. మూడు రోజులపాటు జరిగే ఈ ఉత్సవాల్లో హోమాలు, ప్రత్యేక అర్చనలు జరపనున్నట్లు ఆలయ అధికారులు చెబుతున్నారు. అలాగే, కూరగాయలతో వండిన కదంబ ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రోజు అఖండ దీపారాధన, అంకురార్పణ నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంటలకు కలశస్థాపన చేసి అగ్ని ప్రతి ష్టాపన, మండపారాధన, హారతి, మంత్రపుష్పం, ప్రసాద వితరణలు ఉంటాయి.
అలాగే 20వ తేదీ ఉద యం 8 గంటలకు సప్తశతి, మహా విద్యా పారాయణలు, హోమాలతోపాటు సాయంత్రం 5 గంటలకు మూలమంత్ర హవనాలు ఉంటాయి. 21వ తేదీ ఉదయం 8 గంటలకు సప్తశతి, మహా విద్యా పారాయణలు, శాంతి పౌష్టిక హోమాలు, మంటపపూజలు నిర్వహించనున్నారు. అవి ముగిసిన తర్వాత 9.30 గంటలకు పూర్ణాహుతి, కలశోధ్వాసన, మార్జనం, ప్రసాద వితరణలతో శాకంబరీ దేవి ఉత్సవాలు ముగుస్తాయి. ఇప్పటికే భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో క్యూ లైన్‌లలో వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు చర్యలు తీసకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో భక్తులకు అవసరమైన ప్రత్యేక ఏర్పాట్లు చేసేందుకు అధికారయంత్రాంగం సమాయక్తమవుతోంది.
చండీసప్తశతిలోనూ ప్రస్తావన..
ఏటా ఆషాడంలో అమ్మవారిని శాకంబరీ దేవిగా అలంకరించి పూజించడం వల్ల ప్రకృతి వైపరిత్యాలు తొలగిపోయి వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని భక్తులు నమ్మకం. అలాగే, శాకం అంటే కూరగాయల అని, అందుకే వివిధ రకాల కూరగాయలతో అలంకరించి అమ్మవారిని పూజిస్తారని పండితులు చెబుతున్నారు. అందుకే ఈ అలంకరణ సమయంలో అమ్మవారిని శాంకబరీదేవిగా పిలుస్తారని భక్తులకు వివరిస్తున్నారు.
శాకాంబరీ దేవి గురించి దేవీ భాగవతంతో పాటుగా మార్కడేయ పురాణంలోని చండీసప్తశతిలోనూ ప్రస్తావన ఉన్నట్లు వేద పండితులు గుర్తు చేస్తున్నారు. నీలవర్ణంలో కమలాసనంపై కూర్చుని శాకాంబరీ దేవి పిడికిలిలో వరి మొలకలను పట్టుకొని దర్శనమిస్తుంది. పుష్పాలు, ఫలాలు, చిగురుటాకులు, దుంపగడ్డలు ధరించి ఉండగాన్ని గమనించవచ్చు.



Click it and Unblock the Notifications













