రెండేళ్ల విరామం తర్వాత సోనేపూర్ మేళా ప్రారంభమైంది
మనది వ్యవసాయాధారిత దేశం అయినందున ప్రత్యేకంగా పశువులకు కేటాయించబడే పండగలకు మంచి గుర్తింపు ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది అలాంటి పండగ గురించే. హరిహర క్షేత్ర మేళాగా పిలవబడే ఈ ఫెయిర్ రెండేళ్ల విరామం తర్వాత ఈ నెలలో ప్రారంభమై డిసెంబర్ వరకూ ఘనంగా జరగనుంది. ఆ పండక విశేషాలు తెలుసుకుందాం.
బీహార్‌లోని పాట్నా సమీపంలో సోనేపూర్ పశువుల సంత లేదా సోనేపూర్ మేళా ఏటా నిర్వహించబడుతోంది. ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న ఈ ఫెస్టివల్ కరోనా ఆంక్షల కారణంగా గడిచిన రెండేళ్లు పెద్దగా గుర్తింపు పొందలేకపోయింది. ప్రస్తుతం ఆ ఆంక్షలు తొలగిపోవడంతో పూర్వ వైభవాన్ని సంతరించుకుంటోంది. ఈ జాతర నవంబర్ నుంచి గంగా మరియు గండక్ సంగమ ప్రదేశంలో ప్రారంభం కానుంది. ఇది ఆసియాలోనే అతిపెద్దది. కార్తీక పౌర్ణమి సమయంలో నిర్వహించబడుతుంది కాబట్టి ఇది హిందువులకు చాలా పవిత్రమైన సమయంగా పరిగణించబడుతుంది. ఈ పండగకు దేశం నలుమూలల నుంచీ సందర్శకులు వస్తుంటారు. వాణిజ్య ప్రదర్శన కావడంతో ఏనుగులు, ఒంటెలు నుండి పిల్లులు వరకూ అన్ని రకాల జంతువులను ఇక్కడ కొనుగోలు చేయవచ్చు.

చిరియా బజార్ లేదా బర్డ్ మార్కెట్
ఇతర భారతీయ పండగల మాదిరిగానే దీనికి కూడా ప్రాచీన చారిత్రక మూలాలు ఉన్నాయి. చంద్రగుప్త మౌర్య చక్రవర్తి తన సైన్యం కోసం గంగానది తీరం నుంచి ఏనుగులు, గుర్రాలను కొనుగోలు చేసేవాడట. అలా ప్రసిద్ధి చెందిన ఈ జాతర ప్రపంచంలోనే ఏనుగుల విక్రయానికి అతిపెద్ద మార్కెట్‌గా కూడా ఉంది. ప్రధాన అమ్మకపుదారులతోపాటు కొనుగోలుదారులు అటవీ శాఖ అనుమతులు పొందుతారు. నాణ్యమైన గుర్రాలు ఇక్కడ లభిస్తాయి. అలాగే, చిరియా బజార్ లేదా బర్డ్ మార్కెట్ అనేది పక్షులు మరియు ఇతర చిన్న జంతువులను చట్టబద్ధంగా కొనుగోలు చేసే స్థలం. భారతదేశంలో వివిధ వస్తువులకు ప్రతీకగా ఉన్న ఆవులతోపాటు ఇతర పశువులు మరియు పాలు ఇచ్చే జంతువులు అధిక సంఖ్యలో ఇక్కడ విక్రయిస్తారు.

రాత్రి సమయంలో వినోద కార్యక్రమాలు
ఈ మేళాలో విడిది చేసేందుకు యాత్రికుల కోసం ఏర్పాటు చేసిన శిబిరాల అందుబాటులో ఉంటాయి. వీటితోపాటు బీహార్ టూరిజం రిసార్ట్ కూడా ఉంది. పండుగ సందర్భంగా వచ్చే ప్రజలకు వసతి కల్పించేందుకు పాశ్చాత్య తరహా వాష్‌రూమ్‌లతో టూరిస్ట్ లాడ్జీలను కూడా ఏర్పాటు చేస్తారు. చిన్న హోటళ్ళు మరియు అతిథి గృహాలు కూడా ఉన్నాయి. ఈ సమయంలో బస చేయడానికి ఇక్కడికి కొద్ది దూరంలో ఉన్న హాజీపూర్ వంటి ప్రాంతాలకు వెళ్లవచ్చు. రాత్రి సమయంలో వినోద కార్యక్రమాలను ఏర్పాటు చేస్తారు. ప్రముఖ నృత్యకారులు, గాయకులు మరియు సర్కస్ కళాకారుల ప్రదర్శనలు సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి.

ఎలా చేరుకోవాలి
సోనేపూర్ గ్రామం రాజధాని నగరం పాట్నా నుండి కేవలం 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నందున ఇక్కడికి చేరుకోవడం చాలా సులభం. రోడ్డు మార్గంలో చేరుకునేందుకు సోనేపూర్ నుండి సమీప బస్ స్టాండ్ హాజీపూర్. ఇది ఇక్కడకు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది. టోంగాలు, ఆటోలు, టాక్సీలు మరియు బస్సులు వంటి స్థానిక రవాణాలు హాజీపూర్ నుండి సోనేపూర్‌కు నిత్యం అందుబాలో ఉంటాయి. రైలులో చేరుకునేందుకు, సోనేపూర్ జంక్షన్ దేశంలోని ప్రధాన నగరాలతో అనుసంధానించబడిన సమీప రైల్వే స్టేషన్.



Click it and Unblock the Notifications












