శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలంలోని శ్రీముఖలింగేశ్వరస్వామి చక్రతీర్థ స్నానాలు వైభవంగా జరిగాయి. దక్షిణ కాశీగా పేరొందిన ఈ శైవ క్షేత్రంలో మహాశివరాత్రి వేడుకల్లో భాగంగా చక్రతీర్థస్నానాలు నిర్వహించడం ఆనవాయితీ. పార్వతీపరమేశ్వరులను నంది వాహనంపై ఊరేగించి.. అనంతరం వంశధార నదీతీరంలో ఉత్సవమూర్తలకు నదీ స్నానాలు చేయించారు. ఈ సందర్భంగా శివనామ స్మరణతో వంశధార నదీ తీరం మార్మోగిపోయింది.
భక్తుల జయజయధ్వానాల నడుమ శ్రీముఖలింగేశ్వరుని చక్రతీర్థ స్నానం సోమవారం(మార్చి 11) ఘనంగా నిర్వహించారు. వంశధార నది తీర్థగట్టంలో అర్చకులు వేదమంత్రోచ్ఛరణల మధ్య లక్షలాది మంది భక్తుల నడుమ స్వామి చక్రతీర్థస్నానం ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం శ్రీముఖలింగంలో శివరాత్రి వేడుకలు నాలుగు రోజుల పాటు నిర్వహించి, చివరి రోజు చక్రతీర్థ స్నానం చేయడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది.

మంగళ వాయిద్యాల నడుమ
అందులో భాగంగా సోమవారం మధ్యాహ్నం స్వామివారి ఉత్సవమూర్తులను బయటకు తీసుకువచ్చి, నంది వాహనంపై కూర్చోబెట్టారు. అర్చకుల వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా వంశధార నది తీరానికి తీసుకు వెళ్లారు. అప్పటికే అక్కడికి వేలాదిగా చేరుకున్న భక్తుల మధ్య చక్రతీర్థ స్నానాలు చేయించారు. ఈ సందర్భంగా పవిత్రమైన వంశధార నదీ తీరం జనధారలా మారిపోయిందడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ప్రాంతమంతా ఆ శివ నామ స్మరణతో మారుమోగిపోయింది.
ఉత్తరాంధ్ర జిల్లాలతోపాటు పొరుగున ఉన్న ఒడిశా నుంచి కూడా భక్తులు పెద్దఎత్తున నదీ తీరానికి చేరుకున్నారు. ఇటు జలుమూరు మండలంతోపాటు అటు ఎల్‌ఎన్‌పేట మండలాల పరిధిలోని నదీ పరీవాహక గ్రామాల మీదుగా కాలినడకన ఎక్కువ మంది భక్తులు చక్రతీర్థ స్నానాలు ఆచరించేందుకు చేరుకున్నారు. ఏటా మధ్యాహ్నం 12 గంటలకు చక్రతీర్థ స్నానం నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. కుంభమేళాను తలపించేలా లక్షలాది భక్తులతో వంశధార నదీ తీరం కిక్కిరిపోయిందనే చెప్పాలి.

నదీ గర్భమే కన్నవారిళ్లుగా..
కోటి లింగాలకు ఒక్క లింగం తక్కువ కావడంతో దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీముఖలింగేశ్వరుని ఆలయంలో కొలువుదీరిన శివపార్వతులు నిత్యం ఇక్కడ పూజలు అందుకుంటూ ఉంటారు. పాఢ్యమి పర్వదినాన శివపార్వతులను నంది వాహనం మీద వంశధార నదీ గర్భం వద్దకు తీసుకువచ్చి చక్రతీర్థ స్నానం ఆచరిస్తారు. అది అత్తవారింటిగా భావించి.. నదీ గర్భం వద్ద కన్నవారింటిగా ఇక్కడకు తీసుకువస్తారు. కన్నవారు వారికి కావాల్సిన అన్ని లాంచనాలను నది వద్దనే అందించేలా ఏర్పాటు చేస్తారు.
అక్కడే నందిపై ఊరేగింపుగా తీసుకువచ్చిన ఉత్సవ విగ్రహాలకు స్నానమాచరించి, కన్నవారిచ్చిన సారెను స్వీకరించిన అనంతరం తిరిగి విగ్రహాలను ఆలయంలో ప్రతిష్టిస్తారు. ఈ పర్వదినంగా భావించే.. చక్ర తీర్థం రోజున ఆ పవిత్ర జలాలలో తాము స్నానమాచరిస్త అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని, పుణ్య ఫలం దక్కుతుందని భక్తుల ప్రగాడ విస్వాసం. ఈ కార్యక్రమంలో ఎలాంటి అవాంచనీయ ఘటనలూ జరగకుండా సుమారు 450 మంది పోలీసులు రక్షణగా ఉన్నారు. చక్రతీర్థ స్నానాలకు భక్తుల కోసం ఏర్పాటు చేసిన ఏపీఎస్ ఆర్టీసీ బస్సులకు దీటుగా జిల్లా నలుమూలల నుండి ఆటోలు, ప్రయివేటు వాహనాల్లో శ్రీముఖలింగానికి భక్తులు తరలివచ్చారు.



Click it and Unblock the Notifications












