ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలలో ఒకటిగా పేరొందిన శ్రీశైలం గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి భక్తలు ఈ క్షేత్రాన్ని సందర్శించి మొక్కులు చెల్లించుకుంటారు. ఎన్నో జన్మల పుణ్య ఫలితంగానే శ్రీశైలం దర్శన భాగ్యం కలుగుతుందని ఈ పుణ్యక్షేత్రం గురించి స్కంద పురాణంలోనీ శ్రీశైల కాండ చెబుతోంది. అయితే, ఇక్కడికి వెళ్లదలిచేవారికి ప్రయాణ సౌకర్యంలో విషయంలో అనేక సమస్యలు ఉన్నాయి. దీనిని గుర్తించిన తెలంగాణ ఆర్టీసీ హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది.
హైదరాబాద్ నుంచి శ్రీశైలం క్షేత్రానికి వెళ్లే ఆధ్యాత్మిక పర్యాటకులకు టీఎస్ ఆర్టీసీ సరికొత్త ప్రయాణాన్ని అందించనుంది. ప్రయాణికుల సౌకర్యార్థం కొత్తగా 85 బస్సులను ప్రవేశపెట్టనుంది. అందులో 75 ఎక్స్‌ప్రెస్ బస్సులు, 10 ఏసీ బస్సులు ఉండనున్నట్లు వెల్లడించింది. భక్తుల డిమాండ్ మేరకు టీఎస్ ఆర్టీసీ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ బస్సలు ప్రారంభం కానున్నాయి.
తెలంగాణలోని భాగ్యనగరం హైదరాబాద్ నుంచి శ్రీశైలం క్షేత్రానికి రాకపోకలు సాగించే ఆధ్యాత్మిక పర్యాటకులకు టీఎస్ ఆర్టీసీ తీపి కబురును అందించిందనే చెప్పాలి. నిజానికి, ఇప్పటివరకు ఈ మార్గంలో ఏసీ బస్సులు అందుబాటులో లేవు. కేవలం నాన్ ఏసీ బస్సులు మాత్రమే తిరుగుతున్నాయి. ఈ ఇబ్బందులను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్-శ్రీశైలం మధ్య 10 ఏసీ బస్సులు ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. అంతేకాదు, మొత్తంగా.. ప్రయాణికుల కోసం 85 కొత్త బస్సులు అందుబాటులో తీసుకురాబోతుంది. ఫిబ్రవరి 9 శనివారం ఈ కొత్త బస్సులను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌లో ప్రారంభించనున్నారు.

ఆ బస్ బాడీలోనే రాజధాని బస్సు
ఈ మార్గంలో ఏసీ బస్సులు లేకపోవడంతో కుటుంబసమేంతంగా బయలుదేరే భక్తలు చాలా ఇబ్బందులకు గురయ్యేవారు. చాలామంది ప్రయాణికులు సొంత కార్లు, అద్దె వాహనాల్లో ప్రయాణం సాగించేవారు. ఈ క్రమంలో అనేక ప్రమాదాలు జరిగిన సందర్భాలూ ఉన్నాయి. ఈ సమస్యలను దృష్టిలో ఉంచుకుని టీఎస్ ఆర్టీసీ కొత్త బస్సుల ఏర్పాటును ప్రవేశపెట్టినట్లు అధికారులు చెబుతున్నారు.
వేసవి ప్రారంభమైన ఈ సమయంలో ఏసీ బస్సులు అందుబాటులోకి రానుండటం ఎంతో సౌకర్యంగా ఉంటుందని భక్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, గతంలో ఉన్న 'రాజధాని' బస్సు పొడవు ఎక్కువ ఉండటం వల్ల ఘాట్ రోడ్ల మలుపుల్లో తిరగడం చాలా కష్టంగా ఉంటేది. ఈ మార్గంలో ప్రయాణమంటే చాలా ప్రమాదకరంగా భావించేవారు. ఈ కారణంగా సూపర్‌లగ్జరీ బస్సులతోనే ఇన్నాళ్లు నెట్టుకుంటూ వచ్చారు. తాజాగా.. సూపర్‌లగ్జరీ బస్ బాడీలోనే రాజధాని బస్సును డిజైన్ చేయించారు.
ప్రస్తుతం హైదరాబాద్ నుంచి శ్రీశైలం మధ్య రోజు 30 సూపర్‌లగ్జరీ బస్సులు నడుస్తుండగా.. వీటిలో మూడు సర్వీసులు తగ్గించారు. మొత్తంగా 10 ఏసీ బస్సులు ప్రవేశపెట్టేలా ప్రణాళిక వేశారు. టీఎస్ ఆర్టీసీ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరెందుకు ఆలస్యం ఈ మండు వేసవిలో చల్లటి ప్రయాణం అందుబాటులోకి వచ్చేసింది.. కుటుంబసమేతంగా శ్రీశైలం బయలుదేరేందుకు ప్లాన్ చేసుకోండి మరి.



Click it and Unblock the Notifications













