తిరుమల వెళ్లదలిచే భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. అక్టోబర్ నెలకు సంబంధించి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను ఈరోజు (జూలై 18) నుంచి విడుదల చేయనున్నారు. జూలై 18 నుంచి ఈ నెల 27వ తేదీ వరకు అక్టోబర్ నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించనున్నారు.
వసతి గదులు కోటా విడుదల..
ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించి టీటీడీ తెలిపిన వివరాల ప్రకారం.. 22వ తేదీ ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం, ఊంజల్ సేవా, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవా టికెట్లను అందుబాటులో ఉంచనున్నారు. 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టికెట్లు, వాటి దర్శన స్లాట్లు టీటీడీ విడుదల చేస్తుంది. 23వ తేదీ ఉదయం 10 గంటలకు అంగప్రదక్షణ దర్శన టికెట్లు విడుదల, 11 గంటలకు శ్రీవాణి దర్శన టికెట్లకు అవకాశం కల్పించారు.
అలాగే, వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారికి సైతం శ్రీవారి దర్శన కోటా టికెట్లు అందించనున్నారు. అందుకోసం 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్దులు, వికలాంగులు దర్శన టికెట్లను అందుబాటులో ఉంచనున్నారు. అలాగే, 24వ తేదీ ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను టీటీడీ అధికారులు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వసతి గదులు కోటా విడుదల చేయనున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.

ఆ తేదీల్లో దర్శనాలు రద్దు..
అలాగే, జూలై 27వ తేదీ ఉదయం 11 గంటలకు శ్రీవారి సేవా జనరల్ కోటాను, మధ్యాహ్నం 12 గంటలకు నవనీత సేవ కోటాను, మధ్యాహ్నం ఒంటి గంటకు పరకామణి సేవ కోటాను విడుదల చెయ్యనున్నట్లు అధికారులు ప్రకటించారు. టికెట్ల బుకింగ్ కోసం భక్తులు ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాల్సిందిగా టీటీడీ కోరుతోంది. అక్టోబర్ 4 నుంచి 12వ తేదీ వరకు తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ తేదీల్లో శ్రీవారి సుప్రభాత సేవ మినహా, మిగిలిన అన్ని ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటన విడుదల చేసింది.
అదే విధంగా అక్టోబర్ 11, 12న శ్రీవారి సుప్రభాత సేవతో పాటు అన్ని ఆర్జిత సేవలు రద్దు చేయానున్నట్లు తెలిపింది. అక్టోబర్ 3 నుంచి 13 వరకు అంగ ప్రదక్షిణతో పాటు శ్రీవారి వర్చువల్ సేవా దర్శనం టికెట్లు రద్దు కానున్నాయి. అలాగే, ఆగస్టు నెలకు సంబంధించి సేవ కోటాను జూలై 25న టీటీడీ పరిధిలోని ఆలయాల్లో ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. భక్తులు ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు, వసతి గదుల్ని https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవాలని అధికారులు తెలిపారు.



Click it and Unblock the Notifications













