భారత్ గౌరవ్ టూరిస్టు రైలు.. ఇప్పుడు ఈ పేరు వింటే చాలు ఆధ్యాత్మిక చింతన కలిగినవారు సంబరపడిపోతున్నారు. అందుకు కారణం, దక్షిణాదిలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించుకునేందుకు ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) మరో భారత్ గౌరవ్ టూరిస్టు రైలును పరిచయం చేస్తోంది. ఇప్పటికే పుణ్యక్షేత్రాలు, ఆధ్యాత్మిక ప్రాంతాల సందర్శన నిమిత్తం ప్రత్యేకంగా ఏర్పాటుచేసే భారత్ గౌరవ్ రైళ్లకు పర్యాటకుల నుంచి మంచి స్పందన రావడంతో మరో రైలును ప్రవేశపెట్టనుంది ఐఆర్‌సీటీసీ.
అక్కడ సంప్రదాయ దుస్తులు తప్పనిసరి..
ఈ రైలు సికింద్రాబాద్ నుంచి జ్యోతిర్లింగ సహిత దివ్యదక్షిణ యాత్ర కోసం పట్టాలెక్కనుంది. ఈ నెల 22 నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుండగా, రెండు తెలుగు రాష్ట్రాల గుండా ఈ రైలు పరుగులుతీయనుంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తులు విజయవాడ, గూడూరు, ఖమ్మం, కాజీపేట, నెల్లూరు, ఒంగోలు, రేణిగుంట, సికింద్రాబాద్, తెనాలి, వరంగల్ స్టేషన్‌లలో భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు ఎక్కొచ్చు.

ఈ పర్యటన ఎనిమిది రాత్రులు, తొమ్మిది పగళ్లుతో ముగుస్తుంది. టికెట్ ధర రూ.14 వేల నుంచి మొదలవుతుండగా.. టూటైర్ ఏసీ, త్రీటైర్ ఏసీ, స్లీపర్ క్లాసుల్లో ప్రయాణానికి టికెట్లు ముందుగా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. టికెట్ ధరలను పరిశీలిస్తే.. ఎకానమీలో ఒక్కో టికెట్ రూ.14,250 ఉంది. 5-11 ఏళ్ల మధ్య పిల్లలకు రూ.13,250గా నిర్ణయించారు. స్టాండర్డ్‌లో రూ.21,900, చిన్నారులకు రూ.20,700 చెల్లించాలి. కంఫర్ట్‌లో రూ.28,450, పిల్లలకు రూ.27,010గా ఉంది. పుణ్యక్షేత్రాల్లో మాత్రం స్త్రీ, పురుషులు తప్పనిసరిగా సంప్రదాయ దుస్తులు ధరించాలనే నిబంధనను పాటించాలి.
టూర్ ప్లాన్ ఇలా ఉంటుంది..
ఈ నెల 22న సికింద్రాబాద్‌లో మధ్యాహ్నం 12 గంటలకు రైలు బయల్దేరి, మరుసటి రోజు ఉదయం 7 గంటలకు తిరువణ్ణామలై చేరుకుంటుంది. ముందుగా ఏర్పాటుచేసిన హోటల్‌లో భక్తులు సేద తీరాక.. ప్రసిద్ధి అరుణాచలం ఆలయాన్ని సందర్శిస్తారు. తర్వాత రైల్వేస్టేషన్‌కు చేరుకొని అక్కడ నుంచి కుదల్‌నగర్‌కు బయలుదేరుతారు. మూడోరోజు ఉదయం 6:30 గంటలకు కుదల్‌నగర్ దిగి, అక్కడినుంచి బస్సులో రామేశ్వరం వెళతారు. అక్కడి చుట్టుపక్కల ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాలను చూడొచ్చు.
అయితే, ఈ ప్రయాణ ఖర్చులను మాత్రం యాత్రికులదే. అనంతరం హోటల్‌లో భోజనం చేసి, రాత్రి రామేశ్వరంలోనే విడిది చేయాల్సి ఉంటుంది. నాలుగో రోజు మధ్యాహ్నం భోజనం ముగించుకొని మదురైకు వెళ్లి, మీనాక్షి అమ్మవారిని దర్శించుకుంటారు. అక్కడి నుంచి కన్యాకుమారికి చేరుకుని, కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్, గాంధీ మండపం, అందమైన సూర్యాస్తమయాన్ని ఆస్వాదించి, రాత్రికి అక్కడే భోజనం చేసి బస చేయాలి.
ఉదయం కన్యాకుమారి నుంచి తిరువనంతపురం (కొచ్చువేలి) ప్రయాణం చేయాలి. అక్కడ పద్మనాభస్వామిని దర్శించుకొని కోవలం బీచ్‌లో తిరగాడుతూ గడపొచ్చు. తిరిగి కొచ్చువేలి నుంచి తిరుచిరాపల్లికి చేరుకోవాలి. ఏడో రోజు ఉదయం తిరుచిరాపల్లిలోని శ్రీ రంగనాథస్వామి ఆలయాన్ని సందర్శించిన తర్వాత తంజావూర్ చేరుకొని బృహదీశ్వర దేవాలయాన్ని చూడొచ్చు. అలా ఎనిమిది రోజుల ప్రయాణం తర్వాత తంజావూర్‌లో రైలెక్కి సికింద్రాబాద్‌లో దిగడంతో యాత్ర ముగుస్తుంది.



Click it and Unblock the Notifications













