Search
  • Follow NativePlanet
Share
» »ప‌ర్యాట‌కుల కోసం.. విశాఖ తీరానికి హెలికాఫ్ట‌ర్ మ్యూజియం రాబోతోంది!

ప‌ర్యాట‌కుల కోసం.. విశాఖ తీరానికి హెలికాఫ్ట‌ర్ మ్యూజియం రాబోతోంది!

ప‌ర్యాట‌క న‌గ‌రం విశాఖ‌లో మ‌రో కొత్త మ్యూజియం రాబోతోంది. ఇది ఆర్‌కే బీచ్‌రోడ్డులో ఏర్పాటు చేసేందుకు అధికారులు సిద్ధ‌మ‌వుతున్నారు. భార‌త తూర్పు నౌకాద‌ళానికి చెందిన యుహెచ్‌-3హెచ్‌ హెలికాప్టర్ మ్యూజియంగా మారి సంద‌ర్శ‌కుల‌ను ఆక‌ట్టుకోనుంది. ప్ర‌శాంత‌త‌కు మారుపేరుగా నిలిచే తీర‌ప్రాంతంలో కుటుంబ‌స‌మేతంగా ప‌ర్య‌టించేవారికి ఇదోక కొత్త అనుభూతిని అందిస్తుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. మ‌రెందుకు ఆల‌స్యం.. విశాఖ‌లో ఏర్పాటు కాబోతోన్న ఆ హెలికాఫ్ట‌ర్ మ్యూజియం విశేషాలేంటో చూసేద్దాం రండి!

వైజాగ్ సిటీలో ఇప్పటికే ఐదు మ్యూజియాలు ఉండ‌గా.. మ‌రో కొత్త మ్యూజియం రాబోతోంది. ప్ర‌స్తుతం ఉన్న మ్యూజియంల‌లో జీవీఎంసీకి చెందిన మత్స్యదర్శినిని మినహా మిగిలిన నాలుగు కూడా తూర్పు నౌకాదళానికి చెందినవి ఉన్నాయి. అందులోని విశాఖ మ్యూజియంలో నేవీకి సంబంధించిన నౌకలు, ఆయుధాలతో ఏర్పాటు చేయ‌గా.. మరొకటి కురుసుర సబ్‌మెరైన్‌ మ్యూజియం. ఇక మిగిలిన రెండింటిలో ఒకటి టీయూ-142 యుద్ధ విమానం, మరొకటి సీ హ్యారియర్‌ హెలికాప్టర్‌ మ్యూజియం ఉన్నాయ‌ని మ‌న‌కు తెలుసు.

అయితే, బీచ్‌రోడ్డులో నేవీ మ్యూజియం కాంప్లెక్స్‌ ఏర్పాటుచేయాలనిచాలాకాలంగా ప్ర‌య‌త్నిస్తోంది. ఇందుకోసం వీఎంఆర్‌డీఏ సహకారంతో ఐదేళ్ల క్రితమే చర్చలు జ‌రిపారు. కానీ, అన్నీ ఒకేచోట‌కు తీసుకువ‌చ్చి, ఆర్‌కే బీచ్‌లో పెడితే ట్రాఫిక్‌ సమస్య అధిక‌మ‌వుతుంద‌ని, పైగా పార్కింగ్‌ సదుపాయాలు కూడా లేవని స్థానిక రెసిడెంట్స్‌ వెల్ఫెర్‌ అసోసియేషన్‌ అభ్యంతరాలు వ్య‌క్తం చేశారు. దీంతో కాంప్లెక్స్‌ నిర్మాణం ప్రతిపాదన నిలిచిపోయింది.

helicopter museum

క‌లెక్ట‌ర్ ద్వారా ప్ర‌తిపాద‌న‌..

నిజానికి, సిటీలో వీఎంఆర్‌డీఏ ఇప్ప‌టికే నేవీలో డీ కమిషనింగ్‌ చేసిన వాటిని ఆక‌ర్ష‌ణీయంగా తీర్చిదిద్ది, వాటిని మ్యూజియంలుగా మ‌లిచింది. వీటికి మంచి ప్ర‌జాద‌ర‌ణ రావ‌డంతో మ‌ళ్లీ తూర్పు నౌకాదళం మరో ప్రతిపాదనను వీఎంఆర్‌డీఏకు అందించింది. నేవీలో పదిహేడేళ్లు సుదీర్ఘ సేవలు అందించి ఈ ఏడాది జూన్‌ 28వ తేదీన ఐఎన్‌ఎస్‌ డేగాలో డీ కమిషనింగ్‌ జరిగిన యుహెచ్‌-3హెచ్‌ హెలికాప్టర్‌ను అందించేంద‌కు సిద్ధ‌మైంది. దీనిని కూడా మ్యూజియంగా మార్చాల‌ని జిల్లా కలెక్టర్‌ ద్వారా వీఎంఆర్‌డీఏను ప్ర‌తిపాద‌న పెట్టింది. ఈ ప్ర‌తిపాద‌న‌పై వీఎంఆర్‌డీఏ కూడా సానుకూలంగా ఉండ‌డంతో మ్యూజియంకు అవ‌స‌ర‌మైన ఏర్పాట్లు ప్రారంభ‌మ‌య్యాయి.

యుహెచ్‌-3 హెచ్ నేప‌థ్య‌మిది..

ఇండియ‌న్ నేవీలోకి యుహెచ్‌-3 హెచ్‌ హెలికాప్టర్ 2007వ సంవ‌త్స‌రంలో వ‌చ్చింది. యుద్ధనౌక ఐఎన్‌ఎస్‌ జలాశ్వతో అనుసంధానంగా ఇది విధులు నిర్వ‌హించింది. తీర ప్రాంత గస్తీకి, విపత్తుల సమయంలో సహాయ కార్యక్రమాలు చేపట్టేందుకు, సముద్రంలో తప్పిపోయిన వారిని గాలించేందుకు, నేవీకి సంబంధించిన సరకులను తరలించేందుకు ఈ హెలీకాఫ్ట‌ర్‌ను వినియోగించారు.

helicopter museum Visakhapatnam

అంతేకాదు, విశాఖ తీరంలో ప్ర‌తి ఏటా డిసెంబరులో నిర్వహించే నేవీ డే కార్యక్రమాల్లో కమెండోలు తాళ్లతో సముద్రంలో దిగి బాధితులను రక్షించే విన్యాసాల‌లో ఈ యుహెచ్‌-3 హెచ్‌ హెలికాప్టర్‌నే వినియోగిస్తూ ఉన్నారు. అలా సుమారు 17 సంవ‌త్స‌రాలు సుదీర్ఘ‌ సర్వీసు పూర్తి చేసుకోడంతో దీని డీ కమిషనింగ్ చేశారు. దీని స్థానంలో జలాశ్వకు సీ కింగ్స్‌ హెలికాప్టర్‌ల‌ను అనుసంధానం చేశారు. అలాంటి నేప‌థ్యం ఉన్న ఈ హెలీకాఫ్ట‌ర్ ప‌ర్యాట‌కుల సంద‌ర్శ‌న కోసం మ్యూజియంగా ఆక‌ట్టుకోబోతోంది.

అంద‌మైన డిజైన్‌తో..

ప్రస్తుతం మ్యూజియంగా ఉన్న‌ టీయూ-142 యుద్ధ విమానంతోపాటు సీ హ్యారియర్‌ మ్యూజియాల ద‌గ్గ‌రే కొత్త మ్యూజియం ఏర్పాటుకు స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ మ్యూజియంలు ఏయూ కన్వెన్షన్‌ సెంటర్‌ ముందు ఉన్నాయి. ఇక్క‌డే యుహెచ్‌-3హెచ్‌ మ్యూజియం కూడా ఏర్పాటు చేసేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. అలాగే, గాలిలో వేలాడుతూ ఏర్పాటు చేసిన సీ హ్యారియర్ మాదిరిగా కాకుండా యుహెచ్‌-3ని కింద‌నే ఉంచేలా డిజైన్ చేశారు. మూడు వైపులా ముఖద్వారం వచ్చేలా అద్దాలతో అందంగా తీర్చిదిద్దారు. త్వ‌ర‌లోనే ఈ మ్యూజియం ప‌ర్యాట‌కుల‌ సంద‌ర్శ‌న‌కు సిద్ధ‌మ‌వుతుంది.

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+