జీవితంలో మరచిపోలేని అనుభవం.. ఘాట్ రోడ్‌లో అరకు ప్రయాణం!
అరకు పేరు వినగానే ఆకుపచ్చని అందాల సీమ కళ్లముందు కదలాడుతుంది. మనసుకు ఉత్తేజాన్నిచ్చే ఒక అద్భుత ప్రకృతి సామ్రాజ్యం చేతులు చాచి, రారమ్మని పిలుస్తున్నట్టు అనిపిస్తుంది. హరిత సోయగాలు కుప్పపోసినట్టుండే లోయల అందాలను తనవితీరా చూడటానికి ఇదే సరైన తరుణం. మైదాన ప్రాంతం నుంచి ఆ అందాల సీమకు వెళ్లటానికి రెండు దారులు ఉన్నాయి.
అందులో ఒకటి చీకటి వెలుగుల గుహల్లోంచి సాగే రైలు మార్గం. రెండోది పాములా పలు మలుపులు తిరుగుతూ వెళ్లే ఘాట్ రోడ్డు. పర్వత పాదాల వద్ద మొదలై, శిఖరం వరకూ సాగే ఘాట్ రోడ్డు ప్రయాణం ఆహ్లాదభరితమే కాదు, సాహసోపేతం కూడా. అలాంటి ఘాట్ రోడ్‌లో మా ప్రయాణపు ముచ్చట్లు మీకోసం..
అరకు అందాలను చూడాలంటే విజయనగరం జిల్లాలో ఎస్. కోట ముఖద్వారం దాటాల్సిందే. ఈ సీజన్‌లో పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. మా బృందం అరకు వెళ్లడానికి ప్రణాళికలు వేసి, ప్రయాణానికి సిద్ధమయ్యింది. తొలుత ఘాట్ రోడ్‌లో ప్రయాణమంటే భయపడినా బైకులపై వెళ్లాలని నిర్ణయించుకున్నాం. విజయనగరం నుంచి అరకు వెళ్లేందుకు సుమారు 100 కిలోమీటర్లు ప్రయాణించాలి. అలా బయలుదేరిన కొద్ది సమయంలోనే తాటిపూడి రిజర్వాయర్, బొడ్డవర ప్రాంతాలను దాటేశాం.
చిలకలగెడ్డ దగ్గరకు చేరగానే చల్లగాలి స్వాగతం పలికినట్లయ్యింది. పచ్చదనం పరుచుకున్న కొండ మార్గాలు టా.. టా.. చెబుతున్న అనుభూతి కలిగింది. ఎటు చూసినా చెట్లు, కొండలు వాటి మధ్యలో మా ప్రయాణం. ఇంకా చెప్పాలంటే, అలా వెళ్లిన కొద్దీ కొండలపైకి ఎక్కుతున్నామని తెలుస్తోంది. చలిని తప్పించుకోవడానికి చలికోట్లు తప్పనిసరండోయ్.

దారిపొడవునా హెచ్చరిక బోర్డులు
మా ప్రయాణం 45 కిలోమీటర్లు సాగేసరికి శివలింగపురం చేరుకున్నాం. అక్కడ నుంచే ఘాట్ రోడ్డు ప్రారంభమైంది. అక్కడ నుంచి కొండకు నిటారుగా బైకు వెళ్తాంది. కొండ అంచును తవ్వి, రోడ్డు వేసినట్లుంది. అందులోనూ రోడ్డు వంకర్లు తిరుగుతోంది. ఇంతలోనే 'ఎయిర్పిన్ బెండ్-1' అంటూ ఒక బోర్డు కనిపించింది. ఆ బోర్డు ఉన్న చోట దారి భారీ వంకర తిరిగింది. ఇలాంటి హెచ్చరిక బోర్డులు దారి పొడువునా చాలా ఉన్నాయి. ఇంతలో తైడా జంక్షన్ వచ్చింది. అక్కడ ఆగి పరిశీలిస్తే... కొండను చీల్చుకుని రైలు మార్గం కనిపించింది. కొండ మధ్యలో రైలు రావాలంటే అధునాతన పరికరాలు లేని అప్పటిలో కూలీలు ఎంతగా శ్రమించి ఉంటారో! అర్థం చేసుకోవచ్చు. ఇది గొప్ప అనుభూతిని కలిగించింది. దాదాపుగా కొండపైకి వెళ్లిపోయాం.

జాలువారే జలపాతాలు
పచ్చదనంలో నిండిన పర్వతాల మధ్యలో వెళ్తుంటే ఒకపక్క లోతైన లోయలు కనిపిస్తే, మరోపక్క కొండ నుంచి జాలువారుతున్న జలపాతాలు పలకరిస్తున్నాయి. పక్షుల కిలకిలల మధ్య కొండల నుంచి జారుతున్న జలపాతాల సోయగాలు మమ్మల్ని కట్టిపడేశాయి. ఈ కొండల్లోనే గోస్తనీ నది పుట్టింది. ఆ సుందర దృశ్యాలను చూస్తే అక్కడ నుంచి తిరిగి వెళ్లడానికి మనసు అంగీకరించలేదు. అక్కడ చల్లని స్వచ్ఛమైన గాలి శరీరాన్ని తాకుతూ ఉంటే లోయ అందాలు మమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేశాయి. ఇంతలోనే ఎత్తయిన డముకు గ్రామం చేరుకున్నాం.
అక్కడ నుంచి చూస్తే 40 కిలోమీటర్లు దూరంలో ఉన్న తాటిపూడి జలాశయం కనిపిస్తుంది. అంటే ఎంత ఎత్తుకు వెళ్లామో అని ఆనందపడ్డాం. అప్పటి వరకు ఎక్కిన మార్గాన్ని అక్కడ నుంచి కిందకు చూస్తే, సన్నని తాడులా కనిపించింది. పర్యాటకులకు అక్కడ ఓ వ్యూ పాయింట్ ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరూ అక్కడ ఆగి ఫొటోలు, సెల్ఫీలు తీసుకుంటున్నారు.

ప్రకృతి సిద్ధమైన కాఫీ రుచులు..
ఆంధ్రా, ఒరిస్సా సరిహద్దు ప్రాంతాలను కలుపుకొని ఉన్న అరకు ఘాట్ రోడ్డుకు ఇరువైపులా పెద్దపెద్ద కొండలు, దట్టమైన అటవీ ప్రాంతం ఇది. ఆ రోడ్డులో దారిపొడవునా చిన్నచిన్న గిరిజన గ్రామాలు వెలిశాయి. అంతలో బొర్రా గుహలకు వెళ్లే జంక్షన్ వచ్చింది. దానిని మొలియగూడ అని పిలుస్తారని, అక్కడ నుంచి పది కిలోమీటర్లు లోపలికి వెళితే బొర్రా గుహలు చూడొచ్చని అక్కడి వారు చెప్పారు. సమయం లేకపోవడంతో అటు వెళ్లకుండా ఘాట్ రోడ్డులోనే ప్రయాణించాం. అనంతగిరి కొండలు తగిలాయి. దారిపొడుగునా కాఫీతోటలు ఉన్నాయి. ఆ తోటల్లోనే కాఫీ గింజల్ని పొడి చేసి ప్యాకెట్లుగా అమ్ముతున్నారు. చలి ఎక్కువగా ఉండడంతో రోడ్డు పక్కన గిరిజన యువకులు అమ్ముతున్న కాఫీని అంతా తాగుతున్నారు. మేమూ బైకులు ఆపి, రుచి చూశాం. ప్రకృతి సిద్ధమైన కాఫీ తాగామన్న సంతృప్తి కలిగింది.

మాటలకందని అద్భుత దృశ్యాలు..
సముద్రమట్టానికి వందల మీటర్ల ఎత్తులో ఉన్న గాలికొండలను చేరుకున్నాం. జువ్వున గాలి, తలపైకి ఎత్తి చూస్తే, కనుచూపుమేర కొండ, కిందకు చూస్తే అంతే లోతులో గగుర్పాటుకు గురిచేసే లోయ, దూరాన చిన్నచిన్న గిరిజన గూడలు కనిపించాయి. అవి కొన్ని ఆంధ్రాలో ఉంటే, మరికొన్ని ఒడిశా రాష్ట్రానికి చెందినవని స్థానికులు చెప్పారు. అక్కడ 'యూ జంక్షన్' అనే ఓ వ్యూపాయింట్ ఏర్పాటు చేశారు. దాంతో అక్కడ నుంచి లోయ అందాలు తొంగి చూసేలా భలే సౌకర్యంగా ఉంది. ఆ పాయింట్ నుంచి ఎన్నో దృశ్యాలు వీక్షించవచ్చు. ఆ అద్భుత దృశ్యాలను మాటల్లో వర్ణించలేం. అరకు ఘాట్ రోడ్డు అందాలు చూడాలంటే ఈ సీజన్ సరైన సమయం అని మాకప్పుడు అర్థమైంది.
ఈ ప్రాంతంలోని గిరిజనులు దారిపొడువునా మొక్కజొన్న పొత్తులు, వేరుశనగలు, మిరియాలు, తేనె, చికెన్ కవాబులు వంటి ఎన్నో గిరిజన ఉత్పత్తులు పర్యాటకులకు అమ్ముతున్నారు. ఈ రోడ్డును పలు సినిమాల్లో చూసినట్లు గుర్తొచ్చింది.

నోరూరించే బొంగు చికెన్
అక్కడికి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న అరకులోయను చేరుకుంటాం. సమయం మధ్యాహ్నం 12గంటలు కావస్తోంది. అరకులో ప్రత్యేకంగా తయారు చేసే బొంగు చికెన్ నోరూరిస్తోంది. కానీ దాని ధర వింటే గూబలు గుయ్యమనాల్సిందే! వెదురు బొంగులో మాసాలతో చికెను నానబెట్టి, కట్టెలపై కాల్చి తీస్తారు. అల్లం ఎక్కువగా దట్టించడంతో తిన్నవారు మాత్రం వదిలిపెట్టరు. అరకు సమీపిస్తున్న కొద్దీ పసుపుమయమైన వలిసె పూదోటలు ఆహ్లాదకరంగా స్వాగతం పలికాయి. ఇలా అరకు చేరుకుని, అక్కడ ఉన్న గిరిజన మ్యూజియం, పద్మావతి పార్కు, 10కిలోమీటర్లు దూరంలో ఉన్న చాపరాయి జలపాతం చూసి, తిరిగి ప్రయాణం మొదలు పెట్టాం.
ఘాట్ రోడ్డుకు వచ్చే సరికి సాయంత్రం కావడంతో రోడ్డంతా దట్టమైన మేఘాలు నిండిపోయాయి. కొండ అంచుల్లోంచి, మేఘాలను చీల్చుకుంటూ లోయల సోయగాలకు వీడ్కోలు చెప్పి ఘాట్ రోడ్డు దిగాం. జీవితంలో మర్చిపోలేని అనుభాన్ని పంచిన అరకు ఘాట్ రోడ్ జర్నీ మరోసారి తప్పకుండా చేస్తాం.



Click it and Unblock the Notifications












