Search
  • Follow NativePlanet
Share
» »మ‌రో ప్ర‌పంచ‌పు విహారం.. హేవ్‌లాక్ ద్వీపపు ప్ర‌యాణం

మ‌రో ప్ర‌పంచ‌పు విహారం.. హేవ్‌లాక్ ద్వీపపు ప్ర‌యాణం

మ‌రో ప్ర‌పంచ‌పు విహారం.. హేవ్‌లాక్ ద్వీపపు ప్ర‌యాణం

ఉవ్వెత్తున ఎగిసిపడే సముద్రపు అలలపై ప్రయాణిస్తూ.. ప్రకృతి రమణీయ దృశ్యాలను చూడాలని ఎవరు కోరుకోరు? సముద్రం తీరంలో, దాని లోపలా సరదాగా గడపటం గొప్ప అనుభూతిగా ఎవరు మాత్రం ఫీలవ్వరు? ఇదిగోండి! మనకు దగ్గర్లోనే హేవ్‌లాక్ ద్వీపం ఉంది. ఆ ద్వీపానికి చేరుకునే ప్ర‌యాణ‌పు అనుభ‌వాల‌ను తెలుసుకుందాం.

మా మిత్ర బృందానికి చిన్నప్పటి నుంచి పర్యాటక రంగాల్లో స్థిరపడాలని ఉండేది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం చేస్తోన్న సాఫ్ట్‌వేర్ జాబ్‌ల‌ను వ‌దిలేశాం. అలా జాబ్ మానేసిన తర్వాత చేసిన మొదటి ప్రయాణమిది. బెంగాల్ నుంచి హేవ్‌లాక్ అనే ఓ చిన్న ద్వీపానికి మా ప్రయాణం మొదలయ్యింది. మా మిగిలిన‌ స్నేహితులు అక్కడికి సమీపంలోనే ఉంటారు. దాంతో ఈ ప్రయాణంలో వారూ భాగ‌మ‌య్యారు. ఎక్కడికి ట్రావెల్ చేసినా మేమంతా కలిసే చేస్తూంటాం. ముందుగా పోర్ట్ బ్లేయర్‌లో విమానమార్గం పూర్తయిన తర్వాత అక్కడి నుంచి హేవ్‌లాక్ చేరుకోవడానికి ఫెర్రీకి ప్రయాణం చేశాం. ఆ ప్రయాణం సుమారు రెండున్నర గంటలు. ఈ ఫెర్రీ కోసం ముందుగానే టిక్కెట్ తీసుకునే అవసరం లేదు. హోటల్ వారి సహయం తీసుకోవచ్చు.

ప్రకృతి ప్రసాదించిన మరో ప్రపంచం..

ప్రకృతి ప్రసాదించిన మరో ప్రపంచం..

అక్కడ అడుగు పెట్టగానే ఏదో ప్రకృతి ప్రసాదించిన మరో ప్రపంచంలోకి అడుగుపెట్టిన అనుభూతి కలిగింది. ముఖ్యంగా మా బృందానికి స్కూబా డైవింగ్ చేయాలని ఎప్పటినుంచో ఉంది. ఆ కోరిక హేవ్‌లాక్ లో తీరింది. అండమాన్ హావ్లాక్ స్కూబా డైవింగ్ కు బెస్ట్ ప్రాంతమని చెప్పొచ్చు. ఇక్కడికొచ్చి స్కూబా డైవింగ్ చేయాలనుకుంటే ముందుగానే బుకింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సౌకర్యానుసారంగా మధ్యాహ్నం రెండు గంటలప్పుడు డ్రైవింగ్‌కు బాగుంటుంది. ఉదయం పూట కాంతి కిరణాలు తక్కువగా ఉంటాయి. అందుకే మధ్యాహ్నాం పూట అయితే బాగుంటుంది. వాటికి అవసరమైనవి సిద్ధం చేసుకుని, స్కూబా డైవింగ్ స్పాట్ దగ్గరికి చేరుకున్నాం.

సముద్ర గర్భంలో దాగిన అద్భుతాలు..

సముద్ర గర్భంలో దాగిన అద్భుతాలు..

మేం ముందుగా ఆక్సిజన్ సిలిండర్, స్విమ్మింగ్ ఫిన్స్, మాస్క్ లన్నింటినీ ధరించాం. మా ఇన్‌స్ట్ర‌క్ట‌ర్స్ యూనివర్సల్ అండర్ వాటర్ సైన్స్ గురించి మాకు వివరించారు. చాలాసార్లు శ్వాస నియంత్రణ సాధన చేసిన తర్వాత, ఇన్‌స్ట్ర‌క్ట‌ర్స్ వేసిన అనేక ప్రశ్నలకు జవాబు దొరికిన తర్వాత మమ్మల్ని నీటిలో దింపారు. ఆ సమయంలో మా చుట్టుపక్కల ఏం జరుగుతుందో మాకు తెలీలేదు. లోపలకు వెళ్లాక సముద్ర గర్భంలో దాగిన అద్భుతాలు కళ్లారా చూశాం. రంగు రంగుల చేపల గుంపులు మమ్మల్ని చుట్టుముట్టి, అల్లరి చేశాయి. నాచుపట్టిన పచ్చని బండరాళ్లు ఉప్పునీటిలో కొండకోనలను తలపించాయి. కేరింతలు కొడుతూ సమయమే తెలియకుండా స్కూబా డైవింగ్‌ను ఆస్వాదించాం.

విజయనగర్ బీచ్!

విజయనగర్ బీచ్!

తర్వాత మా ప్రయాణం విజయనగర్ తీరం వెంబడి సాగింది. ఈ చిన్న సముద్రతీరంలో కొబ్బరిచెట్లు హాయిగా ఊగుతూ మాకోసమే ఎదురుచూస్తున్నట్లు కనిపించాయి. చల్లగా వీచే గాలితోపాటు, నీలి రంగులో కనిపించే సముద్రపు నీరు సమయాన్ని మరిచేపోయేలా చేశాయి. ఇక్కడి ప్రశాంతత బాహ్య ప్రపంచంలో మరెక్కడా దొరకదేమో అనిపించింది. కేవలం సముద్రపు అలల సవ్వడులు తప్ప, మరెలాంటి శబ్దాలూ వినిపించలేదు. ఈ సముద్రతీరం ప్రకృతి ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకుంటుంది అనడంలో సందేహమే లేదు. ముఖ్యంగా ఫొటోగ్రాఫర్లను ఈ ప్రాంతం ఎంతో ఆకర్షిస్తుంది. రాత్రి సమయంలో ఈ సముద్రతీరం అందాలు మాటల్లో వర్ణించడం కష్టమనే చెప్పాలి.

ఎలిఫెంట్ బీచ్

ఎలిఫెంట్ బీచ్

మేం హోటల్ నుంచి బయటకు వ‌చ్చాక‌ ఎలిఫెంట్ బీచ్‌కు బయలుదేరాం. అంతలోనే ఎలిఫెంట్ బీచ్ కు ఎలాంటి రోడ్డు మార్గం లేదని తెలిసింది. అక్కడికి వెళ్లడానికి ఫెర్రీ ప్రయాణం, లేదా ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుందన్నారు. చివరికి మేం ట్రెక్కింగ్ చేద్దామని ఫిక్సయిపోయాం. అలా కాలికి పనిచెప్పి, ఏ గైడ్ సహాయం లేకుండానే మేం ఎలిఫెంట్ బీచ్‌కు చేరుకున్నాం. అంతేకాదు, ఎలాంటి ఖర్చూ లేకుండానే ఈ ప్రయాణాన్ని పూర్తిచేశాం. ఈ బీచ్ అందాలను చూస్తే మంత్రముగ్ధులు అవ్వాల్సిందే. ఎన్ని గంటల స‌మ‌యం ఈ సముద్ర తీరంలో గడిపామో మాకే తెలీయలేదు. ఈ తీరం జీవవైవిధ్యానికి పేరుగాంచింది. ఎలిఫెంట్ బీచ్‌లో కొంతసేపు సమయం గడిపిన తర్వాత మేమిక ఇక్కడి నుంచి వెళ్లిపోదామని నిర్ణయించుకున్నాం.

ఆదివారం కావడంతో అక్కడి నుంచి వేరొక ప్రాంతానికి వెళ్లేందుకు ఎలాంటి వాహనాలూ దొరకవని స్థానికులు చెప్పారు. మా పరిస్థితిని చూసిన ఇద్దరు స్థానిక యువకులు మా దగ్గరకు వచ్చారు. మా వివరాలు అడిగారు. 'ప్రస్తుతానికి మా కార్‌ తీసుకువెళ్లండి, మీరు చూడాల్సినవి చూశాక తిరిగివ్వండి. డబ్బులేం వద్దులెండి! మీలాంటి వారి వల్లే ఇక్కడ పర్యాటకులు పెరుగుతారు. మీ బ్లాగుల్లో మా గురించి రాయడం మర్చిపోవద్దు' అని కార్‌ కీ మా చేతిలో పెట్టాడు. మాకేం అర్ధం కాలేదు. దానిలో పెట్రోల్ కూడా ఫుల్‌గా ఉంది. మొద‌ట మా బృంద‌మంతా ఆశ్చ‌ర్యానికి గుర‌య్యాం. కానీ, ఇక్క‌డి స్థానికులు ప‌ర్యాట‌కుల‌కు ఎంత విలువ ఇస్తారో.. వారి నుంచికూడా అంతే ఆశిస్తార‌ని అర్థ‌మైంది. వాళ్లు వ‌ద్ద‌న్నా మేం వారి సహాయానికి కృత‌జ్ఞ‌త‌గా కొంత బ‌ల‌వంతంగానే చేతి పెట్టాం. మరుసటి రోజు కారు తిరిగిచ్చేందుకు వెళితే, 'మీరు ఇక్కడ ఎన్నిరోజులుంటారో అన్ని రోజులూ వాడుకోండి. మాకేం డబ్బులు ఇవ్వనవసరం లేదు' అని చెప్పారు. ఈ కాలంలో ఇలాంటి మనుషులుండడం చాలా గ్రేట్ అని అనుకున్నాం.

రాధానగర్ బీచ్!

రాధానగర్ బీచ్!

ఎలిఫెంట్ బీచ్ నుంచి రాధానగర్ బీచ్‌కు చేరుకోవడానికి 20 నిమిషాలు పడుతుంది. రాధానగర్ బీచ్‌ను ఆసియాలోని పది అందమైన బీచ్లో ఒక దానిగా పరిగణించారు. ఇక్కడి నీలం రంగులోని నీళ్లు, తెల్లని ఇసుక ఈ ప్రాంతాన్ని అసాధారణ ప్రాంతంగా చూపిస్తాయి. సెలవుల్లో ఇలాంటి ప్రాంతాల్లో గడిపితే చాలా బాగుంటుంది. ప్రశాంతత కోరుకునేవారు ఇలాంటి ప్రాంతాలకే రావాలి. ఎత్తయిన కొబ్బరిచెట్లతో చుట్టూ పచ్చదనంతో ప్రకృతి గీసిన సుందర చిత్రంలా అనిపించింది. అప్పటికే సాయంకాలం అవ్వడంతో సూర్యాస్తమయ అద్భుత దృశ్యాలను కళ్లారా వీక్షించాం. హావ్లాక్‌కు వచ్చిన వారు రాధానగర్ బీచ్ చూడకపోతే ఆ ప్రయాణం అసంపూర్తి అనే చెప్పుకోవాలి. ఈ చిన్న ప్రాంతమే హావ్లాక్ హైలాండ్‌లోని మాకిష్టమైన ప్రాంతం. కొన్నేళ్ల తర్వాత మళ్లీ ఇక్కడికి వద్దామని నిర్ణయించుకుని, ముందుకు సాగాం.

రాధానగర్ బీచ్ నుంచి 25 నిమిషాల దూరంలోనే ఇంకో సుందరమైన తీరప్రాంతం మాకోసం ఎదురుచూస్తోంది. దానిపేరు కలపత్తర్ బీచ్. ఈ అద్భుతమైన ప్రాంతానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ మధ్య మధ్యలో పెద్ద నల్లని రాళ్లు కనిపిస్తాయి. ఇది చాలా చిన్నతీరం. మా కెమెరాలకు పని చెప్పి, అప్పటికే ఆలస్యం కావడంతో తిరుగు ప్రయాణమయ్యాం. మీకెప్పుడైనా అద్భుతమైన సముద్రతీరాలను వీక్షించాలనిపిస్తే హేవ్‌లాక్ తప్పకుండా వెళ్లండి. ఎందుకంటే, ఇక్కడ మీకు కనిపించే ప్రతి దృశ్యం ఓ అద్భుత ప్రకృతి రమణీయతను సంతరించుకుంటుంది మరి! మరెందుకు ఆలస్యం, మీ ప్ర‌యాణాన్ని మొదలుపెట్టండి!!

More News

Read more about: bengal havelock port blair
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+