తేయాకు తోటలను సందర్శించేందుకు దేశంలోని ఉత్తమ ప్రదేశాలు
భారతీయులు రుచికరమైన కప్పు టీ(చాయ్)ని ఇష్టపడతారు. అంతేకాదు, ప్రపంచంలోనే అత్యధికంగా తేయాకు ఉత్పత్తి అవుతోన్న దేశాలలో మనదేశం కూడా ఒకటి. అయితే ఇందులో 70 శాతానికి పైగా భారతీయులే వినియోగిస్తున్నారు.
దేశంలో బ్రిటీష్ పాలన ఉన్న రోజుల్లో పెద్ద ఎత్తున భూమిని సామూహిక టీ ఉత్పత్తికి కేటాయించడం ద్వారా టీ ఉత్పత్తి ఇక్కడ ప్రారంభమైంది. మీరు టీ ప్రేమికులైతే భారతదేశంలోని ఉత్తమ తేయాకు తోటల గురించి తప్పకుండా తెలుసుకోవడంతోపాటు ఆ ప్రదేశాలను సందర్శించడం మిస్ అవ్వకండి. మనం ఇప్పుడు చెప్పుకోబోతోన్న టీ ఎస్టేట్స్‌లో విడిది చేసి, అక్కడి టీ ఫ్యాక్టరీలను కూడా సందర్శించవచ్చు.

డార్జిలింగ్, పశ్చిమ బెంగాల్
డార్జిలింగ్ మన దేశంలోని అత్యుత్తమ హిల్ స్టేషన్‌లలో ఒకటి. దీని చుట్టూ తేయాకు తోటలు సమృద్ధిగా ఉన్నాయి. మన దేశంలోని మొత్తం టి ఉత్పత్తిలో సుమారు 25 శాతం డార్జిలింగ్ నుంచే వస్తుంది. ఇక్కడి టీ ఎస్టేట్‌లతో ముఖ్యమైనది హ్యపీ వ్యాలీ టీ ఎస్టేట్. ఈ ఎస్టేట్‌కు సుధీర్ఘ చరిత్ర ఉంది. 1850లో ఓ ఆంగ్లేయుడు దీనిని స్థాపించాడు. అనంతర కాలంలో ఇది భారతీయుని ఆధీనంలోకి వచ్చింది. సందర్శకులు ఇక్కడి టీ ఎస్టేట్‌లో ఫ్యాక్టరీ సందర్శనకు ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.30 వరకూ అనుమతి ఉంటుంది. నవంబర్ నుంచి మార్చి వరకూ ఈ ప్రాంతంలోని టీ ఎస్టేట్‌లు పర్యటించేందుకు అనువుగా ఉంటాయి.

అస్సాం, ఈశాన్య భారతం
మనదేశంలోని మారుమూల ఈశాన్య ప్రాంతంలో ఉన్న అస్సాం దేశంలోనే అతిపెద్ద టీ ఉత్పత్తి చేసే కేంద్రంగా పేరుగాంచింది. బ్రహ్మపుత్ర లోయలో ఎక్కువగా పండే మాల్టీ అస్సామీ టీ ముదురు రంగులో రుచికరంగా ఉంటుంది. ఈ లోయ మధ్య భాగంలో ఉన్న జోర్హాట్‌ను టీ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్‌గా పిలుస్తారు. జోర్హాట్ సమీపంలోని గటూంగా టీ ఎస్టేట్‌ని బన్యన్ గ్రోవ్ విడిది చేసేందుకు అనువుగా ఉంటుంది. ఇది వందేళ్ల క్రితం నిర్మించబడింది. జోర్హాట్‌లో ప్రతి ఏటా నవంబర్‌లో జరిగే టీ ఫెస్టివల్‌కు ఇక్కడకు చేరుకునేందుకు సందర్శకులు ఎక్కువ ఆసక్తి చూపిస్తారు.

మున్నార్, కేరళ
కేరళలోని ప్రసిద్ధ హిల్‌స్టేషన్ మున్నార్‌కు వెళ్లేటప్పుడు మైళ్లకొలదీ పచ్చని తేయాకు తోటలు సాదర ఆహ్వానం పలుకుతాయి. ఇక్కడి తేయాకు ఉత్పత్తి చరిత్రను తెలుసుకునేందుకు నల్లతన్ని ఎస్టేట్‌లో ఉన్న దేశంలోనే మొట్టమొదటి టీ మ్యూజియంను సందర్శించవచ్చు. ఇది సోమవారం మినహా ప్రతి రోజు ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు వరకూ తెరచి ఉంటుంది. దీని ప్రవేశ ధర రూ.125 ఉంటుంది. ఏడాదిలో ఆగస్టు నుంచి మే వరకూ ఇక్కడి టీ ఎస్టేట్‌లు సందర్శనకు అనువుగా ఉంటాయి.

కొలుక్కుమలై, తమిళనాడు
కేరళ సరిహద్దులో సముద్ర మట్టానికి సుమారు 8000 అడుగుల ఎత్తులో కొలుక్కుమలై టీ ఎస్టేట్ ఉంది. బహుశా ప్రపంచంలోనే ఎత్తయిన తేయాకు తోట ఇదే అని చెప్పొచ్చు. ఎత్తయిన ప్రదేశంలో ఉన్నందున అక్కడ పండించే తేయాకు ప్రత్యేకమైన వాసన మరియు రుచిని కలిగి ఉంటుంది. ఇది కేరళలోని మున్నార్‌కు కేవలం 20 మైళ్ల దూరంలో ఉంటుంది. ఈ టీ ఎస్టేట్‌ను 1900లో స్థాపించారు. నేటికీ ఇక్కడి ఫ్యాక్టరీలో టీ ప్రాసెసింగ్ పూర్వపు సంప్రదాయ పద్ధతిలోనే ఉంటుంది.

నీలగిరి పర్వతాలు, తమిళనాడు
తమిళనాడులోని నీలగిరి జిల్లా అద్బుతమైన సుగంధ టీకి ప్రసిద్ధి చెందింది. వందేళ్లకు పైగా ఇక్కడ తేయాకు సాగు చేయబడుతోంది. ఈ ప్రాంతంలో అత్యంత ముఖ్యమైన పరిశ్రమగా నేటికీ కొనసాగుతోంది. ఆహ్లాదకరమైన టీ ఎస్టేట్‌లను మనసారా ఆస్వాదించాలనుకునేవారు కూనూర్ చేరుకోవాల్సి ఉంటుంది. నీలగిరి ప్రాంతంలో ఏడాది పొడవునా టీ ఉత్పత్తి అవుతుంది. అయినప్పటికీ నవంబరు నుంచి ఫిబ్రవరి మధ్య సందర్శనకు అనువుగా ఉంటుంది.



Click it and Unblock the Notifications













