Search
  • Follow NativePlanet
Share
» »బెజ‌వాడ టు మంగిన‌పూడి బీచ్.. బైక్ రైడ్ ముచ్చ‌ట్లు..

బెజ‌వాడ టు మంగిన‌పూడి బీచ్.. బైక్ రైడ్ ముచ్చ‌ట్లు..

బెజ‌వాడ టు మంగిన‌పూడి బీచ్.. బైక్ రైడ్ ముచ్చ‌ట్లు..

బంద‌రు పేరు విన‌గానే ఎవ్వ‌రికైనా ట‌క్కున‌ గుర్తుకొచ్చేవి బందరులడ్డు మిఠాయిలు. కృష్ణా జిల్లా ముఖ్య పట్ట‌ణ‌మైన‌ బందరు.. తీరప్రాతం కావడంతో ఇక్క‌డ్ బీచ్‌ల‌కు కొదవలేదు. అందులో చెప్పుకొదగినది మంగినపూడి బీచ్. ఈ బీచ్‌కి వారాంతరాల్లో అనేకమంది దూర ప్రాంతాల నుంచి వస్తుంటారు. విజయవాడకు 65 నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ తీరం. మా మిత్ర‌బృందంతో క‌లిసి సరదాగా ఆడుతూపాడుతూ సాగిన మా బంద‌రు ప్ర‌యాణ‌పు అనుభ‌వాలు మీకోసం..

విజయవాడ నుంచి మచిలీపట్నానికి 70 కిలోమీటర్లు. పొద్దున పొద్దున్నే బయలుదేరితే సరైన సమయానికి అక్కడికి చేరుకుంటాం. తెల్లవారు జామునే మా బృంద సభ్యులంద‌రూ క‌లిసి బైక్‌ల‌పై ర‌య్యిమంటూ విజ‌య‌వాడ నుంచి బ‌య‌లుదేరాం. అప్పుడప్పుడే సూర్యుడు మంచుతెరలను చీల్చుకుంటూ డ్యూటీ ఎక్కుతున్నాడు. మెల్లగా ఇంటి దగ్గరనుంచి విజయవాడ బందరు రోడ్డు మీదకొచ్చాం.

జేబులో ఫోను తీసి, గూగుల్ తల్లిని రూట్ మాప్ అడిగాం. గట్టిగా 'గో స్ట్రైట్' అని బదులిచ్చింది. ఇక చూడకుండా తిన్నగా వెళ్ళిపోయాం. సిటీ పొలిమేర దాటుతుండగా తెల్లటి పొగమంచు మా చుట్టూ కమ్మేసింది. ఆ మంచు తెరల్లోంచి రోడ్డుకిరువైపులా ఉన్న పచ్చదనాన్ని ఆస్వాదిస్తూ బెజవాడ దాటేశాం. ఉయ్యూరు టౌన్ లో టిఫిన్ బండి దగ్గర మా బైక్‌ల‌కు బ్రేకులు పడ్డాయి. మంచి వేడి వేడి ఇడ్లీలూ, ఎగ్ దోశలు లాగించేసి, మళ్ళీ జర్నీ కొనసాగించాం. అప్పటికీ మంచు ఎక్కువగానే ఉంది. అయితే, పల్లె వాతావరణం చలిని దూరం చేసింది.

ఎన్ని .. ర‌కాల‌ ఎండు చేపలో!

ఎన్ని .. ర‌కాల‌ ఎండు చేపలో!

ఈసారి బండి ఏకంగా మచిలీపట్నంలోనే అగింది. నేరుగా బందరు ఫిష్ యార్డ్‌కు వెళ్ళాం. అక్కడ అడుగుపెట్టామో లేదో ఎండు చేపల వాసన మా ముక్కును ఘాటుగా తాకింది. మాకు తెలియకుండానే మా అడుగులు అటువైపుగా పడ్డాయి.. కాస్త ముందుకు వెళ్ళి చూశాం. అప్పుడే జాలర్లు కొంతమంది తెచ్చిన చేపలకి ఉప్పురాసి ఎండబెడుతున్నారు. అలా చేపలని మూడురోజులు ఎండబెడతారనే కొత్త విషయాన్ని ఆరోజే తెలుసుకున్నామన్నమాట.

కుప్పలుగా పోసిన ఉప్పుచేపలు నోరూరించాయనే చెప్పాలి. అక్కడి మత్స్యకారులు గుంపులుగా వారి పనిలో నిమగ్నం అవ్వడం చూస్తే వారి మధ్య స్నేహపూర్వక వాతావరణం మమ్మల్ని బాగా ఆకర్షించింది. అలా మాట్లాడుకుంటూ ఇంకాస్త ముందుకెళ్ళాక ఓ గోదాం కనపడింది. అందులో అడుగుపెట్టంగానే అక్కడ ఉన్న చేపల రకాలను చూసి మేం నోరెళ్లబెట్టి ఆవాక్కయ్యాం. ఇక బ‌య‌ట‌కు వ‌చ్చాక ఆక‌లి మొద‌లైంది. ఏదైనా తిని, బీచ్‌కు వెళదామనుకుని దగ్గర్లోని రెస్టారెంటుకి వెళ్ళాం. రెండు ప్లేట్లు రొయ్యల బిర్యానీ ఆర్డరిచ్చి, తనివితీరా తిని, బరువైన పొట్టలతో బయటపడ్డాం.

గూగుల్ తల్లిని రూట్ అడిగాం

గూగుల్ తల్లిని రూట్ అడిగాం

అక్కడి నుంచి బీచ్‌కు వెళ్లేందుకు దారి తెలియక మళ్ళీ గూగుల్ తల్లిని రూట్ అడిగాం. వెంటనే కొన్ని వంకర్లతో కూడిన దారి చూపించి వెళ్ళిపొమ్మంది. గూగులొచ్చాక మనుషులతో సంబంధాలే తెగిపోతున్నాయి కదా అనుకున్నాం. ఇది వరకు దారిన కనపడినవారందరినీ 'మాష్టారూ దారెటూ!' అని అడుగుతూ వెళ్ళేవాళ్లం. ఇప్పుడిక ఆ అవసరమే లేకుండా పోయిందనుకున్నాం.

మా బాల్యస్మృతులూ కొన్ని గుర్తుచేసుకుంటూ 3:30 గంటలకు మంగినపూడి బీచ్‌కు చేరుకున్నాం. ఎంట్రెన్స్ లో ఉన్న రెండు చేపల ద్వారాన్ని దాటుకుంటూ బీచ్‌లోకి అడుగుపెట్టాం. బీచ్‌కు వెళ్లేందుకు, పార్కింగ్‌కు ఎలాంటి టికెట్టూ లేదు.. హమ్మయ్యా పోనీలే అనుకుంటూ బండి పార్క్ చేశాం. మా భవిష్యత్తు గురించి మాట్లాడుకుంటూ గతాన్ని గుర్తు చేసుకుంటూ వాస్తవం గురించి ఆలోచిస్తూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ తీరంవెంబడి అడుగులు వేస్తూ.. కాసేపు కాలక్షేపం చేశాం. ఆ సముద్రపు అలలు మా పాదాలను తాకుతూ ఉంటే ఏదో చెప్పలేని అనుభూతి. అలా సముద్రంలో కాసేపు జలకాలాటలాడి కొన్ని ఫొటోలు, సెల్ఫీలు దిగాం.

భలే భలే రైడ్ !

భలే భలే రైడ్ !

బయలుదేరదాం అని వెనక్కి తిరిగి నాలుగడుగులేశాక నాలుగు చెక్రాల బైకులు కనిపించాయి. ఎప్పుడూ చూడని ఆ బైకులు మా కళ్ళకు కొత్తగా కనపడ్డాయి. చిన్నప్పుడు కంప్యూటర్‌లో ఇలాంటి బండ్ల మీద రేసింగ్ గేమ్స్ ఆడేవాళ్ళం. అది గుర్తొచ్చింది. అక్కడే ఉన్న యజమాని మమ్మల్ని పిలిచి "బైక్ ఎక్కండి బాబూ! బ్యూటిఫుల్‌గా ఉంటుంది!!" అంటూ మాటలు కలిపాడు.

ఒక్కొక్కరికీ వంద రూపాయలు తీసుకుని, చెరొక బైకు ఎక్కించాడు. ఇక 'రయ్ రయ్' అనుకుంటూ అరకిలోమీటరుకి ఎక్కువా, ముప్పావు కిలోమీటరుకి తక్కువ దూరం వరకూ వెళ్ళి దానిమీద మరో రెండు రౌండ్‌లు వేసి, వెనక్కి వచ్చేశాం. ఇక ఆ బైకు వివరాలు కనుక్కుందామని అడిగితే దాని రేటు రెండున్నర లక్షలు అనగానే మా కళ్ళు బైర్లు కమ్మాయి. మరి సందర్శకులని ఆకర్షిస్తున్నాయా...? అనడిగితే వాళ్ళు తెల్ల మొహం వేశారు.

నవ్వీ నవ్వనట్టు నవ్వుతూ..

నవ్వీ నవ్వనట్టు నవ్వుతూ..

"ఇక్కడికొచ్చేది చాలా తక్కువ మంది, ఈ బైక్ ఎక్కడానికి వందరూపాయిలు ఖర్చు చేయటానికే భయపడుతున్నారు. ఇక గిరాకీ ఏం ఉంటుంది?" అంటూ వాపోయారు. "లీటరుకి 4.5 కిలోమీటర్లు మైలేజీ ఇస్తుంది అంతే. ఏదైనా రిపేర్ వచ్చిందంటే ఇక మాకు తిప్పలు వచ్చి పడ్డట్టే. ఏ పార్టు మార్చాలన్నా వేలల్లోనే ఖర్చుంటుందని" నవ్వీ నవ్వనట్టు నవ్వుతూ చెప్పుకొచ్చారు. ఇంతకు ముందు అక్కడే వీళ్ళు కెమెరా పట్టుకుని తిరిగేవారట! ఇప్పుడు ఆ కెమెరామెన్ జాబు పార్ట్ టైమ్ అయింది.

ఈ బైక్ రైడింగ్ జాబ్ ఫుల్‌టైం అయింది. ఈ బైక్ రైడ్ ఎట్రాక్షన్ ఇంకెక్కడైనా ఉందా అనడిగితే "మన రాష్ట్రంలో వైజాగ్‌లో ఉంది అన్నారు. కానీ వైజాగ్ బీబ్‌కు మంగినపూడి బీచ్‌కు చాలా తేడా ఉంది. అక్కడికి వచ్చినంత మంది పర్యాటకులు ఇక్కడికి రారు. అందువల్ల ఈ బైక్ రైడ్ ఎక్కువ మందికి తెలియదు అని చెప్పారు. అలా ఆ బైకుల గురించి మాట్లాడుకుంటూ 5:30 గంటలకు బీచ్ నుంచి విజయవాడకి తిరుగు ప్రయాణమయ్యాం.

విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్ళే రూటు చాలా ప్ర‌శాంతంగా ఉంటుంది. ఈ రైడ్‌ను ఎవ్వ‌రైనా ఎంజాయ్ చేయ‌వ‌చ్చు. ఇక విజయవాడ చేరే సరికి 8:30 అయింది. మరిన్ని పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఇంటికి చేరుకున్నాం. మా జీవితంలో మచిలీపట్నం ట్రిప్పు ఎప్పటికీ గుర్తుండిపోయేదిగా నిలిచిపోతుంది. మ‌రెందుకు ఆల‌స్యం మీ ప్ర‌యాణాన్ని మొద‌లుపెట్టండి.

Read more about: vijayawada machilipatnam
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X