ఈ మధ్యకాలంలో యువత ఎక్కువగా బైక్ రైడింగ్‌పై ఆసక్తి చూపిస్తున్నారు. ఇటీవల చాలామంది యువత బైకులతో ఏకంగా దేశాలనే చుట్టేస్తున్నారు. ఇంటి దగ్గర ఉండి ఎంత బైకులు నడిపినా కానీ, లాంగ్ డ్రైవ్‌లు ఇచ్చే అనుభూతిని అవి ఇవ్వవు అంటోంది నేటి యువతరం. అందుకే, చాలామంది యువత ఇప్పడు దాన్ని ఒక ప్రొఫెషన్‌గా చేసుకుని దేశంలోని అన్ని ప్రాంతాలను చుట్టేస్తున్నారు. ఇంకా కొందరైతే, అంతర్జాతీయ ట్రిప్పులు కూడా వేసేస్తున్నారు. అయితే, మనదేశంలో కూడా బైక్ రైడింగ్ చేసే ప్రాంతాలు చాలానే ఉన్నాయి. బైక్ రైడింగ్‌కు వెళ్లాలంటే తప్పకుండా సూదూర ప్రాంతాలకు వెళ్లాల్సిందే.
అయితే, అలా బైక్ మీద షికారు చేయాలనుకునేవారు తప్పకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే, కొన్ని డేంజరస్ మార్గాలు కూడా ఉంటాయి. ఆ మార్గాల్లో వెళ్లేముందు అక్కడి వాతావరణం గురించి పూర్తి సమాచారం తెలుసుకుని వెళ్లాలి. కొన్ని ఘాట్ రోడ్లు ఉంటాయి. కాబట్టి వాటి గురించి తగు జాగ్రత్తలు తీసుకుని బైక్ రైడింగ్‌కు బయలుదేరాలి. దేశంలోని బైక్ రైడింగ్ చేసే ప్రాంతాలేంటో చూసేద్దాం పదండి..

మనాలి నుండి లేహ్ వరకు
హిమాచల్‌ప్రదేశ్‌లోని అత్యంత అందమైన ప్రదేశం మనాలి. అక్కడి నుంచి లేహ్‌కు వెళ్లాలంటే చాలామంది బైక్ రైడింగ్‌ను ఎంచుకుంటుంటారు. మనాలి నుండి లేహ్ వరకు రోడ్డు ప్రయాణం చేయడమంటే సాహసంతో కూడుకున్న పనే అని చెప్పాలి. ఈ బైక్ ట్రిప్ సమయంలో, హిమాలయాల నిజమైన అందాలను దగ్గరగా చూసే అవకాశం ఉంటుంది. ఇక్కడి మంచు పర్వతాల గుండా బైక్ రైడింగ్ చేయడమంటే ఎంతో సాహాసోపేతమైన చర్య అని చెప్పుకోవాలి. బైక్‌పై కిలోమీటర్ల కొద్దీ ఈ ప్రయాణం చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ఒకవేళ రాత్రి బస చేయాలనకుంటే మాత్రం సర్చు, జిస్పా లేదా కీలాంగ్‌లో విశ్రాంతి తీసుకునే వెసులుబాటు ఉంటుంది.
ఢిల్లీ నుండి ఆగ్రా
ఢిల్లీ నుంచి ఆగ్రా వరకు బైక్‌పై ప్రయాణం బైక్ రైడర్స్‌కు ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుంది. యమునా ఎక్స్‌ప్రెస్‌వే మార్గం గుండా బైక్ రైడింగ్ చేయవచ్చు. ఇక్కడ ఎలాంటి ట్రాఫిక్ లేకుండా పూర్తిస్థాయిలో ప్రయాణించవచ్చు. యమునా ఎక్స్‌ప్రెస్ వే నోయిడా నుండి ప్రారంభమవుతుంది. ఇక్కడి నుండి తాజ్ మహల్ చేరుకోవాలంటే సుమారు 238 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. మధ్యలో ఉన్న మధురలో కాసేపు ఆగి విశ్రాంతి తీసుకోవచ్చు.

జైపూర్ నుండి జైసల్మేర్
రాజస్థాన్ అద్భుతమైన కట్టడాలకు, కోటలకు నిలయం. ఇక్కడి ప్రాంతం చాలా వరకు ఎడారిగా ఉండటంతో బైక్ రైడర్లు ఎంతగానో ఇష్టపడతారు. అలా జైపూర్-జోధ్‌పూర్-జైసల్మేర్ మధ్య సాగే బైక్ రైడర్ల ప్రయాణం ఎంతో గొప్పగా ఉంటుంది. సుమారు 550 కిలోమీటర్ల ఈ రహదారిలో బైక్‌పై వెళ్లడం మాటల్లో చెప్పలేని అనభూతిని ఇస్తుంది. రాజస్థాన్‌లోని ఈ ప్రాంతాలన్నంటిని బైక్‌పైనే కవర్ చేసేందుకు సుమారు పది నుంచి పదకొండు గంటల సమయం పడుతుంది.
బెంగళూరు నుండి ఊటీకి
బెంగళూరు నుండి ఊటీ ప్రయాణం ప్రకృతి అందాలతో నిండి ఉంటుంది. రామనగర, మైసూర్ వంటి నగరాల గుండా సుమారుగా 278 కిలోమీటర్ల మేర ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ బైక్ యాత్రను పూర్తి చేసేందుకు ఒక రైడర్‌కు కనీసం ఆరుగంటల నుండి ఏడు గంటల సమయం పడుతుంది. చరిత్ర, చారిత్రక విషయాల గురించి తెలుసుకోవాలంటే మాత్రం తప్పకుండా ఇక్కడి మైసూర్ ప్యాలెస్‌ని సందర్శించడం మర్చిపోవద్దు. ఊటీలోని నీలగిరి ఘాట్‌లు, ఊటీ టీ గార్డెన్, ఇక్కడి ప్రకృతి అందాలను తప్పకుండా ఆస్వాదించాల్సిందే..



Click it and Unblock the Notifications













