రెండు తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇక, కృష్ణా నది వర్షపు నీటి పరవళ్లతో గలగలపారుతోంది. ఇక, ఇదే పరివాహాక ప్రాంతంలో ఉన్న సోమశిల, శ్రీశైలం ప్రాజెక్టులు ఉప్పొంగుతున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాలకు శ్రీశైలంలో గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఈ సమయంలో శ్రీశైలం ప్రాజెక్టు, సోమశిల ప్రాజెక్టుల అందాలను చూసేందుకు పర్యాటకులు తరలివస్తున్నారు. ఈ ప్రాజెక్టులను వీక్షించాలనుకునేవారి కోసం తెలంగాణ టూరిజం ఓ సరికొత్త టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది.

ప్రకృతి అందాల ప్రాజెక్టులు..
శ్రీశైలం, సోమశిల ప్రాజెక్టుల చుట్టూ సహజ జలపాతాలతోపాటు అరుదైన వన్యప్రాణులు పర్యాటకులకు సాదర ఆహ్వానం పలుకుతాయి. ఇంకా ఇక్కడ ఎత్తయిన కొండలు.. ప్రకృతి సోయగాలను వీక్షిస్తూ.. లాహిరి.. లాహిరి అంటూ పడవలో సాగే ప్రయాణం మాటల్లో వర్ణించడం కష్టమే. ఇక్కడి జలపాతాల సవ్వళ్లు.. రయ్యి రయ్యిమంటూ ఎగురుతూ విన్యాసాలు చేసే పక్షులను చూడొచ్చు. అలా సోమశిల ప్రాజెక్టు నుంచి శ్రీశైలం వరకూ బోటు ప్రయాణం చేయొచ్చు. ఈ బోటు షికారు ప్రకృతి ప్రేమికులకు ఎంతగానో నచ్చుతుంది. ఈ ప్రయాణం పర్యాటకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. సోమశిల, శ్రీశైలం ప్రాజెక్టులు చక్కటి పర్యాటక సొబగులతో పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఇక, సోమశిల నుంచి శ్రీశైలం వరకు లాంచీలో ప్రయాణించాలంటే తప్పకుండా తెలంగాణ టూరిజం అందిస్తోన్న ఈ ప్యాకేజీలో వెళ్లాల్సిందే.
ప్రతి శనివారం..
తెలంగాణ టూరిజం అందిస్తోన్న ఈ టూర్ ప్యాకేజీ అతి తక్కువ బడ్జెట్‌లోని పర్యాటకులకు అందుబాటులో ఉంది. తెలంగాణ టూరిజం రెండు రోజుల టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. శ్రీశైలం- సోమశిల Road cum River Cruise Tour పేరుతో ఈ ప్యాకేజీ పర్యాటకులకు అందుబాటులో రానుంది. ఈ ప్యాకేజీ ప్రతి శనివారం తేదీల్లో ఉంటుంది. ఈ టూర్ ప్యాకేజీ హైదరాబాద్ నుంచి ప్రారంభమవుతుంది. మొత్తం రెండు రోజుల టూర్ ప్యాకేజీ. నాన్ ఏసీ కోచ్ బస్సులో ప్రయాణం చేయాల్సి ఉంటుంది.

రెండు రోజుల ప్రయాణం...
ఈ టూర్‌లో భాగంగా ప్రతి శనివారం ఉదయం 9 గంటలకు హైదరాబాద్ నుంచి ఈ ప్రయాణం ప్రారంభమవుతుంది. ఇందులో భాగంగానే మొదటి రోజు శ్రీశైలం చేరుకుంటారు. అక్కడే నైటంతా స్టే చేయాల్సి ఉంటుంది. ఇక, రెండో రోజు శ్రీశైలంలోని డ్యామ్ ను సందర్శిస్తారు. అక్కడ్నుంచి క్రూజ్ బోట్ లో సోమశిల చేరుకోవాల్సి ఉంటుంది. ఇక క్రూజ్ బోట్‌లో మధ్యాహ్నం భోజనం కూడా ఉంటుంది. పర్యాటకులు గమనించాల్సి న విషయం ఏమిటంటే.. నదిలో నీళ్లు నిలకడగా ఉంటేనే బోట్ ప్రయాణం ఉంటుంది. అంతేకాదండోయ్.. బోటు పూర్తిగా నిండేలా బుకింగ్స్ ఉంటేనే బోటు ప్రయాణం ఉంటుంది. అదే రోజు సాయంత్రం ఐదుగంటలకు సోమశిల నుంచి హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం ఉంటుంది. రాత్రి 9 గంటలకు హైదరాబాద్ చేరుకోవటంతో ఈ ట్రిప్ ముగుస్తుంది.
టూర్ ప్యాకేజీ ధరలివే..
తెలంగాణ టూరిజం అందిస్తోన్న శ్రీశైలం టు సోమశిల టూరిజం ప్యాకేజీ ధరలు ఒకసారి పరిశీలిస్తే.. పెద్దలు రూ. 4999గా చెల్లించాల్సి ఉంటుంది. అదే పిల్లలయితే రూ. 3600గా చెల్లించాలి. పర్యాటకులకు ఇతర పూర్తిసమాచారం కోసం, టిక్కెట్ బుకింగ్ కోసం తెలంగాణ టూరిజం అధికారిక వెబ్‌సైట్ https://tourism.telangana.gov.in/ ను సంప్రదించాల్సి ఉంటుంది.



Click it and Unblock the Notifications













