పచ్చని ప్రకృతి సోయగాల మధ్య సాగే జంగిల్ సఫారీని ఆస్వాదించాలనుకునేవారికి గుడ్‌న్యూస్.
శ్రీశైలం వెళ్లే మార్గంలోని నల్లమల అటవీ ప్రాంతం ఇప్పుడు సందర్శకులను ఆత్మీయంగా ఆహ్వానిస్తోంది. ఇక్కడి తుమ్మలబయిలులో జంగిల్ సఫారీని ఇటీవల ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇది పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. శ్రీశైలం వెళ్లేవారు ఎవ్వరైనా ఈ సఫారీని ఎంజాయ్ చేయకుండా వెళ్లలేరంటే నమ్మండి. దశాబ్ద కాలం క్రితం ఏర్పాటు చేసిన ఈ జంగిల్ సఫారీ ఇటీవల మంచి ప్రాముఖ్యతను సంతరించుకుంది. మరెందుకు ఆలస్యం.. నల్లమల అటవీ ప్రాంతపు జంగిల్ సఫారీ విశేషాలు చూసేద్దామా!
ప్రకాశం జిల్లా డోర్నాల నుంచి నంద్యాల జిల్లా పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతం సందర్శకులకు ఓ సరికొత్త అనుభూతిని అందిస్తోంది. సుమారు 13 కిలోమీటర్ల సాగే ఈ ప్రయాణంలో జీవితంలో మర్చిపోలేని క్షణాలను మనసులో పదిలపరుచుకోవచ్చు. నిజానికి ఈ జంగిల్ సఫారీ 2016లోనే అందుబాటులోకి తీసుకువచ్చారు. గుబురుగా ఉన్న పచ్చని చెట్ల మధ్య నుంచి నల్లమల అటవీ ప్రాంతాన్ని చుట్టు ముట్టే విధంగా వాహనంతో రైడ్ ఆస్వాదించవచ్చు. ఇటీవల కాలంలో ఈ సఫారీకి మంచి ఆదరణ లభిస్తోంది. కుటుంబ సమేతంగా వచ్చే పర్యాటకులు నల్లమల జంగిల్ సఫారీపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.

పులులూ ప్రత్యక్షమవుతాయి..
ఈ రైడ్ వన్య ప్రాణులు తిరిగే ఈ ప్రాంతంలో వ్యాన్ నుంచి అడవిని వీక్షిస్తూ ముందుకు సాగుతుంది. ఇక్కడి ప్రతి విషయాన్నీ మనతో ఉండే గైడ్ మనకు వివరిస్తారు. రైడ్ మధ్యలో ఒక్కోసారి పులులు గాండ్రింపులతో పాటు పులులు కూడా ప్రత్యక్షమవుతూ ఉంటాయండోయ్. అంతేకాదు, తమ స్థావరాలను ఏర్పాటు చేసుకునే క్రమంలో పులులు చెట్లపై వేసిన పంజా గుర్తులు, అడుగు జాడలు స్పష్టంగా కనిపిస్తాయి. మరీ ముఖ్యంగా నల్లమల అటవీ ప్రాంతం అనేక రకాల వృక్షజాతులు, జంతుజాలాలకు నిలయంగా చెప్పొచ్చు. విభిన్న జాతులకు చెందిన పక్షుల కుహు.. కుహూ రావాలు ఎంతో వినసొంపుగా ఉంటాయి.
ఈ అడవి ప్రాంతంలో సుమారు 1500 రకాలు వరకూ వృక్ష జాతులు ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగే, జంతువుల జాడ తెలుసుకోడానికి అటవీ శాఖ ఏర్పాటు చేసిన కెమెరాలు, జంతువుల కోసం తాగు నీటి ఏర్పాట్లు ఈ జంగిల్ సఫారీలో పర్యాటకులు దగ్గరగా చూసే అవకాశం ఉంటుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ ప్రతీ రోజు ఈ సఫారీ రైడ్ అందుబాటులో ఉంటుంది.

అవగాహనతోపాటు విఙ్ఞానం..
సందర్శకులు జంగిల్ సఫారిలో పర్యటన తర్వాత తుమ్మలబయిలు మ్యూజియం సరికొత్త అనుభూతులను చేరువ చేస్తుంది. ఇక్కడ భద్రపరిచిన వివిధ రకాల జంతువుల కొమ్ములు, కళేబరాలను మీ సెల్ ఫోన్‌లో భందించుకోవచ్చు.
వీటితోపాటు అటవీ జంతువుల అరుపులు, వాటి ప్రవర్తనను అవగాహన కల్పించేందుకు వీడియో, ఆడియో ప్రదర్శన కూడా ఏర్పాటు చేశారు. వీటి ద్వారా జంతువులపై పర్యాటకులకు అవగాహనతోపాటు విఙ్ఞానాన్ని అందిస్తుందని అటవీ అధికారులు చెబుతున్నారు. మరెందుకు ఆలస్యం.. కుటుంబసమేతంగా నల్లమల అటవీ అందాలను వీక్షించేందుకు మీ జర్నీ మొదలు పెట్టండి!



Click it and Unblock the Notifications
