వేసవి సెలవులు కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. గత కొద్దిరోజులుగా భక్తుల రాక ఎక్కువగా ఉండటంతో శ్రీవారి దర్శనానికి ఎక్కువ సమయం పడుతోంది. అన్ని కంపార్ట్‌మెంట్లు కూడా భక్తులతో కిక్కిరిసిపోయాయి. కంపార్ట్‌మెంట్లు అన్ని నిండిపోవడంతో వెలుపల వరకు భక్తులు వేచి ఉన్నారు. భక్తుల రద్దీతో శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 24 గంటల నుంచి 30 గంటల వరకు సమయం పడుతున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
తిరుమలలో నేటి నుంచి జూన్ 5వ తేదీ వరకు హనుమాన్ జయంతి వేడుకలు జరగనున్నట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఈ ఐదు రోజులు పాటు ఆకాశ గంగలో శ్రీ బాలాంజనేయ స్వామి, శ్రీ అంజనాదేవికి ప్రత్యేక అభిషేకం నిర్వహించనున్నారు. దీంతో పాటు ఆలయంలో జపాలి తీర్థంలో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేసింది.
హనుమత్ జయంతి సందర్భంగా ఆకాశ గంగలోని శ్రీ అంజనాదేవి- శ్రీ బాలాంజనేయ స్వామి ఆలయంలో ఈ ఐదు రోజుల పాటు ఉదయం 8.30 నుండి 10 గంటల వరకు శ్రీ అంజనాదేవికి ప్రత్యేక అభిషేకం చేయనున్నారు. నేడు మొదటి రోజు సందర్భంగా మల్లెపూలతో అభిషేకం చేస్తారు.

రేపు ( జూన్ 2న) తమలపాకులతో అభిషేకం ఉంటుంది. జూన్ 3న ఎర్ర గన్నేరు, కనకాంబరాలతో అభిషేక కార్యక్రమం ఉంటుంది. జూన్ 4న చామంతితో అభిషేకం ఉంటుంది. ఇక, చివరి రోజైన జూన్ 5వ తేదిన సింధూరంతో అభిషేకం చేస్తారు. వేద పండితులచే శ్రీ ఆంజనేయ సహస్ర నామార్చన, మంత్రోచ్ఛరణల మధ్య స్వామివారికి, అంజనాదేవికి అభిషేకం నిర్వహిస్తారు. ఇక, నేటి కార్యక్రమంలో భాగంగా ఉదయం 10 గంటలకు ఆకాశ గంగ వద్ద శ్రీ ఆంజనేయ జన్మ వృత్తాంతంపై ప్రవచన కార్యక్రమం ఉంటుంది.
సామూహిక పారాయణం..
వీటితోపాటు ప్రతిరోజూ మధ్యాహ్నం 2 నుండి 3 గంటల మధ్య దాస సాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా సామూహిక పారాయణం కూడా జరగనుంది. ఇందులో భాగంగా నేడు (జూన్ 1న) హరికథ, జూన్ 2 న అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులచే సంకీర్తనలు, జూన్ 3న పురంధర దాస సంకీర్తనలు, జూన్ 4న హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారిచే భజన, జూన్ 5న అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులచే హరికథ గానం వంటివి ఉంటాయి. ప్రతిరోజూ సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల మధ్య ఎస్వీ సంగీత, నృత్య కళాశాల విద్యార్థులచే నృత్య కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు.

వీకెండ్‌లో బ్రేక్ దర్శనాలు రద్దు...
వీకెండ్ కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. నిన్న (మే 31న) ఒక్కరోజే తిరుమల శ్రీవారిని 67,873 భక్తులు దర్శించుకున్నారు. అందులో 33,532మంది తలనీలాలు సమర్పించి, తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఒక్కరోజే స్వామివారికి ఆలయ హుండీకీ రూ. 3.93 కోట్లుకానుకలు వచ్చాయని ఆలయ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. భక్తుల రద్దీ కారణంగా వీకెండ్‌లో బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించేందుకు వీలుగా జూన్ 30వ తేదీ వరకు (శుక్ర, శని, ఆదివారం తేదీలు) వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. నిర్ణయించిన ఈ సమయంలో ఎలాంటి సిఫార్సుల లేఖలు కూడా స్వీకరించబడవని ఆలయ అధికారులు స్పష్టం చేశారు.



Click it and Unblock the Notifications













