ఆంధ్రప్రదేశ్‌లో సందర్శించేందుకు అనువైన ప్రదేశాలు చాలానే ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా రాయలసీమలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు కొదవేలేదు. దేశంలోనే ప్రసిద్ధిచెందిన ఆలయం రాయలసీమలోనే ఉంది. అదే తిరుమల తిరుపతి దేవస్థానం. ఇంకా ఇక్కడ పురాతనమైన ఆలయాలు చాలానే ఉన్నాయి. శ్రీశైలం మల్లన్నస్వామి, యాగంటి, మహానంది, అలంపూర్, మంత్రాలయం ఇంకా చాలా ఆలయాలే ఇక్కడ ఉన్నాయి. అత్యంత సుందరమైన నల్లమల అటవీ ప్రాంతంలో వెలసిందే శ్రీశైలం.
ఈ ప్రాంతంంలో జనాభా 10 వేల కంటే తక్కువగానే ఉంటుంది. శ్రీశైలంలోని పురాతన ఆలయాలను పర్యాటక ప్రదేశాలను వీక్షించేందుకు ప్రతి ఏటా దేశ విదేశాల నుంచి పర్యాటకులు తరలి వస్తుంటారు. ఇది కేవలం ఆధ్యాత్మిక క్షేత్రంగానే కాకుండా ప్రముఖ పర్యాటక కేంద్రంగానూ ప్రత్యేక గుర్తింపును పొందింది. ఇక్కడికి సమీపంలో విమానాశ్రయం ఉంది. అదే హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం.

శ్రీశైల మల్లన్న ఆలయానికి సమీపంలోనే అనేక దేవాలయాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా అమ్మవారి దేవాలయాలు ఉన్నాయి. వాటిలో ఒకటే ఇష్టకామేశ్వరి ఆలయం. ఈ ఆలయంలోని అమ్మవారికి బొట్టుపెట్టి ఏదైనా కోరుకుంటే ఆ కోరిక ఖచ్చితంగా నేరవేరుతుందని ఇక్కడికి వచ్చే భక్తుల నమ్మకం. భక్తుల కోరికలు తీర్చేకల్పవల్లిగా ఈ అమ్మవారికి పేరుంది. చలికాలంలో శ్రీశైలం పర్యటన ఎంతో ఆహ్లదకరంగా ఉంటుంది. కాబట్టి, శ్రీశైలం సందర్శన చేసే భక్తులు తప్పకుండా ఈ ఆలయాన్ని దర్శనం చేసుకుంటారు. మరెందుకాలస్యం మీరు కూడా ఈ ఆలయాన్ని సందర్శించుకుని మీ కోరికలు నేరవేర్చుకోండి.
శ్రీశైలం నుంచి డోర్నాల వెళ్లే మార్గానికి సమీపంలో ఇష్టకామేశ్వరీ దేవాలయం ఉంటుంది. ఈ ఆలయాన్ని చేరుకోవాలంటే దట్టమైన అడవీ మార్గం గుండా ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ ప్రయాణం ఎంతో థ్రిల్లింగ్‌గా కూడా ఉంటుంది. ఇక్కడి పక్షుల కిలకిలరావాలు, జలపాతాల సవ్వడులు ఇక్కడికొచ్చే పర్యాటకులకు సాదర ఆహ్వానం పలుకుతాయి. ఇక్కడి ఆలయంలో అమ్మవారు నాలుగు చేతులతో భక్తులకు దర్శనమిస్తారు. రెండు చేతులలో తామరపూలు, మిగిలిన రెండు చేతుల్లో జపమాల - శివలింగం ధరించి ఉంటారు. విష్ణుదర్మోత్తర పురాణంలో పార్వతీదేవి రుద్రాక్షమాల, శివలింగాన్ని ధరించి ఉంటుందని ఇక్కడి పండితులు చెబుతుంటారు.
కోరిన కోర్కేలు తీర్చే కల్పవల్లి...
ఈ ఇష్టకామేశ్వరి ఆలయంలో పార్వతీ దేవి స్వరూపంగా కొలుస్తారు. ఈ అమ్మవారి నుదుటిపై కుంకుమ బొట్టు పెట్టి మనసులో కష్టాన్ని, కోర్కెను చెప్పుకుంటే 41 రోజుల్లో ఆ కోరిక నెరవేరుతుందని ఇక్కడికి వచ్చేవారు నమ్ముతారు. ఈ ఆలయంలోని అమ్మవారికి బొట్టుపెట్టినప్పుడు విగ్రహం మాములుగానే ఉంటుంది. కానీ, నుదురు మాత్రం మెత్తగా అనిపిస్తుందని స్థానికులు చెబుతున్నారు. ఈ ఆలయం అడవిలో ఉంటుంది. అందుకే ఈ ఆలయాన్ని సందర్శించుకునేందుకు సాయంత్రం 5 వరకే అనుమతి ఉంటుంది. ఈ ఆలయానికి చెంచులే పూజారులుగా ఉండడం విశేషం.

ఈ ఆలయంలో అమ్మవారు ఒక చిన్నగుహలో ఉంటారు. అమ్మవారిని దర్శించుకోవాలంటే పాకుతూ వెళ్లాలి. ఈ ఆలయం గర్భగుడిలో కేవలం నలుగురు మాత్రమే వెళ్లేందుకు వీలుంటుంది. ఈ అమ్మవారికి దద్దోజనం, పొంగలిని నైవేద్యంగా పెడతారు. ఈ ఆలయం గోపురం మెట్లరూపంలో కోలగా కనిపిస్తుంటుంది. ఇష్టకామేశ్వరి ఆలయానికి ఎదురుగా మూడు విగ్రహాలు ఉంటాయి. అవి సిద్ధుని విగ్రహం, మహిషాసురమర్ధని విగ్రహం, కాపాలికుని విగ్రహం.
ఈ ఆలయాన్ని సందర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్నాటక, మహారాష్ట్ర, తమిళనాడు నుంచి కూడా భక్తులు అధికసంఖ్యలో ఇక్కడకి వస్తుంటారు. ప్రముఖ నగరాలైన హైదరాబాద్, విజయవాడల నుంచి అన్ని వేళలా బస్సులు అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా ఈ సీజన్‌లో శ్రీశైలం పర్యటన ఎంతో మనోహరంగా ఉంటుంది.



Click it and Unblock the Notifications













