తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్‌లో ఉన్న తలకోన జలపాతపు అందాలను వర్షాకాలం వచ్చిందంటే మాటల్లో వర్ణించడంలేం. ఈ సీజన్‌లో తప్పక చూడాల్సిన పర్యాటక ప్రదేశాల జాబితాలో దీనిని చేర్చాల్సిందే. పచ్చదనం కమ్మేసిన శేషాచలం అడవుల మధ్య జాలువారే జలపాతం చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి సందర్శకులు ఇక్కడ వాలిపోతారు. ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు ఇదోక అద్భుతమైన ప్రదేశం.
సాహసవంతమైన అనుభూతి..
తిరుపతి చుట్టుపక్కల ప్రదేశాలు ఆధ్యాత్మిక చింతనకేకాదు.. ఆహ్లాదపరిచే ప్రకృతి రమణీయతకు నిలయాలనే చెప్పాలి. సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే ఇక్కడి జలపాతాలు సజీవంగా మారిపోతాయి. ఎక్కడ చూసినా నీటి సవ్వడులు చెవులకు వినసొంపైన సంగీతాన్ని అందిస్తాయి. తలకోన జలపాతం ఈ కోవకు చెందిందే. ఈ జలపాతపు నీరు 270 అడుగుల ఎత్తు నుండి కిందకు దూకుతున్నప్పుడు ఇక్కడ చుట్టుముట్టే పొగమంచు తెరలాంటి నీటి తుంపరులు ఎంతో ఆకట్టుకుంటాయి. ఈ జలపాతం వద్ద స్నానాలు చేసేందుకు అనువుగా ఉంటుంది. కానీ, దీని లోతు విషయంలో మాత్రం అప్రమత్తంగా ఉండాలి.
ఇప్పటి వరకూ ఆ నీరు కిందపడే చోట ఎంత లోతు ఉంటుందో ఎవ్వరూ కనిపెట్టలేకపోయారట. అలాగే, జలపాతంవైపు ట్రెక్కింగ్ ఓ సాహసవంతమైన అనుభూతిని మీకు చేరువ చేస్తాయి. కఠినమైన మార్గం గుండా ముందుకు సాగుతూ సుందరమైన ప్రకృతి దృశ్యాల మీ మనసులో పదిలపరుచుకోవచ్చు.

అరుదైన జీవుల నిలయం..
సుందరమైన ప్రకృతి దృశ్యాలేకాదు.. అరుదైన జాతుల మొక్కలు, జంతువులతో సహా వివిధ రకాల వృక్షజాలం మరియు జంతుజాలానికి కూడా తలకోన నిలయం. సహజసిద్ధంగా ఇక్కడ లభించే అనేక మూలికలు సేకరించదగ్గవి. ఈ మార్గంలోని పక్షుల కిలకిలారావాలు మనసును మరో ప్రపంచంలోకి తీసుకువెళతాయి. చల్లని పిల్లగాలులు శరీరాన్ని తాకుతూ కన్నతల్లి ప్రర్శవలే హాయిని, ఉపశమనాన్ని అందిస్తాయి. అందుకే, మానసిక ప్రశాంతతను కోరుకునేవారు తనకోన అటవీ ప్రాంతంలో తప్పకుండా అడుగుపెట్టాల్సిందే. అలాగే, ఈ జలపాతాలు పవిత్రమైనవిగా కూడా గుర్తించబడుతున్నాయి.
ఇక్కడికి సమీపంలోనే సిద్ధేశ్వర స్వామికి చెందిన పురాతన ఆలయం ఉంది. ఈ కారణంగా ఇక్కడి ప్రాంతం ఆ స్వామివారికి అంకితం చేయబడినదిగా భావిస్తూ.. ఆధ్యాత్మిక చింతనకు నెలవుగా కూడా చెప్పబడుతోంది.
తలకోన జలపాతపు అందాలను ఆస్వాదించేందుకు ఉత్తమ సమయం జూన్ నుండి నవంబర్ వరకు ఉంటుంది.

ఎలా చేరుకోవాలి?
తిరుపతి నుండి 58 కిలోమీటర్లు అలాగే, చెన్నై నుండి 120 కిలోమీటర్ల దూరంలో తలకోన ఉంది. ఇక్కడికి సమీప విమానాశ్రయం తిరుపతి విమానాశ్రయం. అలాగే, సమీప రైల్వే స్టేషన్ తిరుపతి రైల్వే స్టేషన్. అక్కడి నుంచి తలకోన చేరుకునేందుకు ఆర్‌టీసీ బస్సులు పరిమితిలో ఉంటాయి. కనుక ప్రయివేటు వాహనాలు లేదా సొంత వాహనాల్లో వెళ్లేందుకు ప్లాన్ చేసుకోవడం మంచిది.
ఇక్కడ విడిది చేసేందుకు ఏపీ టూరిజంవారి వసతిగృహాలు అందుబాటులో ఉంటాయి. ట్రెక్కింగ్, హైకింగ్, అరుదైన పక్షులను చూడటంతోపాటు ఫోటోగ్రఫీకి ఇది ఎంతో అనువైన ప్రదేశం. అందుకే, తలకోన జలపాతాలు వర్షాకాలంలో ప్రకృతి ప్రేమికులు, సాహస ప్రియులు తప్పక సందర్శించవలసిన ప్రదేశంగా గుర్తింపు పొందింది.



Click it and Unblock the Notifications













