Search
  • Follow NativePlanet
Share
» »సంద‌ర్శ‌కుల‌ను క‌నువిందుచేసే కొల్లేరు బోటు షికారు!

సంద‌ర్శ‌కుల‌ను క‌నువిందుచేసే కొల్లేరు బోటు షికారు!

సంద‌ర్శ‌కుల‌ను క‌నువిందుచేసే కొల్లేరు బోటు షికారు!

పచ్చని పల్లె వాతారణానికి కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తోంది కొల్లేరు. కేరింతలు కొడుతూ అక్క‌డి సరస్సులో చేసే బోటు షికారు తియ్యని అనుభూతుల సమ్మేళనమనే చెప్పాలి. ఎటుచూసినా క‌వ్వించే పక్షుల కిలకిలరావాలు మనల్ని ప్రకృతి ఒడిలో విహరించేలా చేస్తాయి. రివ్వున ఎగురుతూ ఆకాశాన సంద‌డి చేసే విదేశీ పక్షులను పలకరించేందుకు మేం చేసిన కొల్లేరు ప్ర‌యాణ‌పు ముచ్చ‌ట్లు మీ కోసం.

మా ప్రయాణం ఉదయం ఏడు గంటలకు విజయవాడలో మొదలైంది. గంటన్నర పాటు బస్సులో ముందుకుసాగాం. తర్వాత ముదినేపల్లి బస్‌ స్టాండ్‌లో దిగాం. అక్కడి నుంచి మరో 15 కిలోమీటర్లు వెళితే మేం చేరుకోవాల్సిన ఆటపాక గ్రామం వస్తుంది. అయితే ఆ రూట్‌లో బస్సులు తక్కువగా ఉంటాయని, ఆటోకు వెళితే టైం కలిసొస్తుందని స్థానికులు సలహా ఇచ్చారు. దాంతో స్టాండ్‌లో ఉన్న ఆటో ఎక్కాం. పది నిమిషాల్లో బయలుదేరుదాం అని చెప్పిన ఆ డ్రైవర్‌ అరగంటైనా బండి తీయలేదు. పైగా ఒక్కొక్కరిగా ఎక్కిస్తునే ఉన్నాడు. అలా ఆటోలో ఉన్నవారి సంఖ్య పది దాటింది.

అయినా ఆ డ్రైవర్‌ పాసింజర్ల కోసం పిలుస్తూనే ఉన్నాడు. అడిగితే 'ఎక్కువమంది ఎక్కకపోతే మాకు గిట్టుబాటు కాదు సార్‌..!' అన్నాడు. ఓ పక్క అంతమందితో ఆటోలో ప్రయాణం అంటే కాస్త భయమేసినా.. సమయం కలిసొస్తుందిలే అన్న ఆశ మమ్మల్ని ఆటోలో కూర్చునేలా చేసింది. అదే సమయంలో ఆటోలో కూర్చున్న ఓ విద్యార్థి సెల్‌ ఫోన్‌ 'సత్తే... సత్తే ఏ గొడవాలేదు! సత్తే ఏ బాధాలేదు.. పుట్టే ప్రతివాడూ సత్తాడోరు..!' అంటూ గట్టిగా మోగింది.

ఆ రింగ్‌టోన్‌ వినగానే మా గుండెలు అదిరిపోయాయి. ఎందుకొచ్చిన తలనొప్పిలే అనుకుని ఆటో దిగి, పక్కనే ఉన్న బస్‌స్టాండ్‌ పైపు మా అడుగులు పడ్డాయి. పదిహేను నిమిషాల తర్వాత మేం ఎక్కాల్సిన బస్సు రానే వచ్చింది. బస్సు ఎక్కిన తర్వాత మాకో గమ్మత్తైన దృశ్యం కనిపించింది. మేం ముందుగా ఎక్కిన ఆటో ఇంకా అక్కడే ఉంది. కాకపోతే అందులో ఎవ్వరూ లేరు.

సాఫీగా సాగిన ప్రకృతితో ప్రయాణం

సాఫీగా సాగిన ప్రకృతితో ప్రయాణం

ముదినేపల్లి నుంచి ఆటపాక మార్గంలో ప్రయాణం జీవితంలో మర్చిపోలేని ఎన్నో అనుభూతులను మిగుల్చుతుంది. పచ్చని ప్రకృతి నడుమ సేదదీరుతున్నట్లు కనిపించాయి దారిపొడవునా పల్లెలు. రోడ్డు పక్కగా ఉన్న పిల్లకాలువ పలకరింపుల గురించి మాటల్లో చెప్పలేం. నలభై ఐదు నిమిషాలకుపైగా బస్సులో ప్రయాణించిన తర్వాత ఆటపాక గ్రామం చేరుకున్నాం. ప్రశాంతమైన పల్లె వాతారణం అక్కడి సొంతం. టిఫిన్‌ చేసేందుకు రోడ్డుపక్కనే ఉన్న ఓ చిన్న హోటల్‌లోకి వెళ్లాం.

తన పేరు వెంకటేశ్వరరావని, మీరెక్కడి నుంచి వచ్చారంటూ మాటలు కలిపాడు టిఫిన్‌ సెంటర్‌ యజమాని. అతనికి డెబ్భైఏళ్లు ఉంటాయి. కొల్లేరు చూసేందుకు వచ్చాం అని చెప్పాం. చేతికి టిఫిన్‌ అందిస్తూ అక్కడి విశేషాలను చెప్పుకొచ్చాడు ఆ పెద్దాయన. గతంలోకంటే ప్రస్తుతం సందర్శకులు తగ్గారని చెప్పారాయన. అంతేకాదు, ఆక్రమణలు, కాలుష్యం కారణంగా చాలా వరకూ పక్షుల సంఖ్య కూడా తగ్గిపోయిందట! ఆటపాకకు దగ్గరలో ఉన్న కొల్లేటికోట గురించి చెప్పారు. అక్కడ శతాబ్దాల చరిత్ర ఉన్న పెద్దింటమ్మ ఆలయం సందర్శించడానికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా పర్యాటకులు వస్తూ ఉంటారట! కొల్లేరు సరస్సు నడిబొడ్డున ఉన్న ఈ ద్వీపసముదాయానికి చేరుకునేందుకు రోడ్డు, జల మార్గాలు ఉన్నాయి.

అయితే, మా జర్నీ ప్లాన్‌ పికాన్‌ ప్యారడేజ్‌ కనుక, మరోసారి ఈ ప్రాంతాన్ని తప్పకుండా విజిట్‌ చేయాలని అనుకున్నాం. రోడ్డుపైనుంచి ఊరి లోపలిగుండా కొల్లేరును చేరుకునే మార్గాన్ని పూసగుచ్చినట్లు చెప్పారు ఆ పెద్దాయన. అక్కడి నుంచి కాలినడకన బయలుదేరాం. ఊళ్లోంచి ఓ కిలోమీటరు నడిచాం. అలా ఊరు దాటామో లేదో ఎదురుగా అటవీశాఖవారి వెల్‌కమ్‌ బోర్డు కనిపించింది.

కొల్లేటిలో బోటు షికారు

కొల్లేటిలో బోటు షికారు

అప్పటికే అక్కడికి చేరుకున్న కొందరు పర్యాటకులు బోటింగ్‌ కోసం సిద్ధమయ్యారు. మేంకూడా వారితో కలిసి బోటులో షికారుకు వెళ్లాం. కొల్లేరులోని పక్షుల సంరక్షణ గురించి చెప్పు కొచ్చారు ముప్పై ఏళ్ల అనుభవం ఉన్న బోటు డ్రైవర్‌. అక్కడి స్టాండ్‌లపై సేదదీరుతున్న పక్షులు మమ్మల్ని ఎంతో ఆకట్టుకు న్నాయి. ఈ సీజ‌న్‌లోనే సరస్సులో లక్షల సంఖ్యలో పక్షులు ఆశ్రయం కోసం వస్తాయని చెప్పారు. ఈ కాలంలో దేశవిదేశాల నుంచి వచ్చే పక్షులు కొల్లేరు సరస్సులో సందర్శకులను మరింతగా కనువిందు చేస్తాయట! అనేక రకాల పక్షి జాతులు మాకు కనిపించాయి.

పక్షులు ఉండే స్టాండ్‌ దగ్గరగా మా బోటు వెళ్లినప్పుడు ఆ పక్షులు చేసే శబ్దాలు భలే గమ్మత్తుగా అనిపించాయి. బోటులో ఉన్నవారంతా వారిలోని ఫొటోగ్రఫీ కళను బయటకు తీశారు. ప్రతి దృశ్యాన్నీ కెమెరాల్లో బంధించేందుకు విశ్వప్రయత్నం చేశారు. అలా సుమారు గంట వరకూ కొల్లేటి సరస్సులో సాగిన బోటు షికారు ప్రకృతి ఒడిలో సేదదీరే అనుభూతులను చేరువచేసింది. ఈ సరస్సులో కామన్‌ రెడ్‌ షాంక్స్‌, రెడ్‌-పింఛం పోచర్డ్‌, నిగనిగలాడే కంకణాలు, చెరువు కాకులు, ఆసియా ఓపెన్‌ బిల్‌ గూడకొంగ, ప్లెమింగోస్‌ వంటి పక్షులు కొల్లేరులో కనిపిస్తాయి. ఆసియాతోపాటు యూరప్‌ దేశాలు, ఇతర సుదూర ప్రాంతాల నుంచి కూడా పక్షులు వలస వస్తాయి.

సంరక్షించేందుకు అనేక ప్రయత్నాలు

సంరక్షించేందుకు అనేక ప్రయత్నాలు

ఇక్కడ స్నాక్స్‌ తప్ప తినేందుకు ఎలాంటి ఇతర ఆహార పదార్థాలూ అందుబాటులో ఉండవు. అందువల్ల బయటి నుంచి తెచ్చుకునే ఆహారాన్ని లోపలకు అనుమతిస్తారు. అయితే, పరిశుభ్రత విషయం ఇక్కడి సిబ్బంది ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తారు. సరస్సుకు వచ్చే అరుదైన పక్షి జాతులకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన బోర్డులు కట్టపై వరుసగా సందర్శకులకు ఆహ్వానం పలుకుతాయి. వన్యప్రాణి అభయారణ్యంగా ఏర్పడినప్పటి నుంచి కొన్ని కోర్‌ ప్రాంతాల్లో ఇతర ఏ కార్యకలాపాలకు అనుమతి లేదు.

పక్షులకు స్థావరం అయిన ఈ సరస్సును సంరక్షించేందుకు అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో కొల్లేరు సరస్సు శీతాకాలంలో తప్పనిసరిగా చూడవలసిన సందర్శన స్థలంగా ఇక్కడివారు చెబుతున్నారు. విస్తారంగా ఎగిరే పక్షులను చూడటానికి వివిధ ప్రాంతాల ప్రజలు ఇక్కడకు చేరుకొని పండుగలా జరుపుకుంటారట!

అన్ని సౌక‌ర్యాలూ అందుబాటులో..

అన్ని సౌక‌ర్యాలూ అందుబాటులో..

పిల్లలు ఆడుకునేందుకు, కుటుంబ సభ్యులు సేదదీరేందుకు అన్ని సదుపాయాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. వీటితోపాటు సరస్సును ఎత్తునుంచి తిలకించేందుకు ప్రత్యేకంగా రెండు వాచ్‌టవర్లు ఏర్పాటు చేశారు. లోపలకు ప్రవేశించేందుకు పిల్లలకు ఐదు, పెద్దలకు పది రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. సరస్సు పరిసరాలతోపాటు పక్షులను దగ్గరగా చూసేందుకు బైనాక్యులర్లులు కూడా అందుబాటులో ఉంచారు. దానికి ఇరవై రూపాయలు చార్జీ చేస్తారు. సెక్యూరిటీ డిపాజిట్‌గా వందరూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.

ఇక్కడ ఆక్రమణలకు గురవుతోన్న ఆనవాళ్లు మాత్రం చాలా స్పష్టంగా గుర్తించవచ్చు. కొల్లేరును పరిరక్షించి, అద్భుతమైన పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. మరెందుకు ఆలస్యం, పర్యాటకులకు పండగ వాతావరణాన్ని చేరువచేసేందుకు సిద్ధమవుతోన్న కొల్లేరు సందర్శనకు మీరూ పయనమవ్వండి!

More News

Read more about: kolleru lake vijayawada
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+