ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన లంబసింగి అందాలు...
దట్టమైన పొగమంచు, తొలకరి చినుకుల్లా పడే మంచు తుంపరులు.. పచ్చని తివాచీ పరిచినట్లు ఉండే సుందరమైన లోయలు, అంతా ప్రకృతి సోయగాల మయం. వెరసి అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణం. ఇవన్నీ చూడాలంటే కాశ్మీర్‌కు లేక, విదేశాలకో వెళ్లనుకుంటున్నారా? అవసరం లేదు. మన ఆంధ్రప్రదేశ్‌లోనే అలాంటి ప్రదేశం ఒకటుంది. దానినే ముద్దుగా ఆంధ్రా ఊటీ అని పిలుస్తుంటారు. కాశ్మీర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌గా పిలవబడే లంబసింగి అందాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు లభించింది. ఆ విషయాలెంటో తెలుసుకుందాం పదండి..
స్వదేశీ దర్శన్ 2.0లో లంబసింగి పేరు..
ఏజెన్సీ ప్రాంతం అనగానే అందరికీ అరకు గుర్తుకు వస్తుంది. అయితే ఇక్కడ పర్యాటకులు సందర్శించేందుకు అనువైన ప్రదేశాలు చాలానే ఉన్నాయి. లంబసింగి, చింతపల్లి, కొత్తపల్లి ప్రాంతాల్లో కూడా ఎన్నో సుందరమైన ప్రదేశాలు ఉన్నాయి. లంబసింగి ఘాట్‌రోడ్‌లో కాఫీ తోటలు ఎంతగానో ప్రసిద్ధి చెందాయి. లంబసింగి చేరుకునే ముందు ఒక ఆలయం కనిపిస్తుంది. దానినే బోడకొండమ్మ దేవాలయం అంటారు. దీనికి అరకిలోమీటరు దిగువున ఒక జలపాతం ఉంటుంది.

ఈ జలపాతంలోకి సుమారు 50 అడుగుల ఎత్తు నుంచి నీరు పడుతుంటుది. ఇక్కడికి కొద్ది దూరంలోనే లంబసింగి గ్రామం ఉంది. అయితే, ప్రతిఏటా ఇక్కడికి అధిక సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. అందుకే ఆంధ్ర కశ్మీర్‌గా పిలువబడే లంబసింగికి ప్రపంచ స్థాయి గుర్తింపు లభించింది. లంబసింగిని పర్యాటకంగా మరింత అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం స్వదేశీ దర్శన్ 2.0లో ఎంపిక చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లా లంబసింగికి ప్రత్యేక పర్యాటక ప్రాంతంగా గుర్తింపు కూడా లభించింది.
50 పర్యాటక ప్రాంతాలు..
ఎపిలోని విశాఖపట్నం సందర్శించే ప్రతి ఒక్క పర్యాటకుడు లంబసింగితో పాటు అరకు అందాలను కూడా తప్పనిసరిగా వీక్షించాల్సిందే. అధిక సంఖ్యలో వచ్చే పర్యాటకులను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం స్వదేశీ దర్శన్ 2.0 కార్యక్రమం ద్వారా 50 పర్యాటక ప్రాంతాలను ఎంపిక చేసింది. ఈ పర్యాటక కేంద్రాలన్నింటిని అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఈ ఎంపికలో భాగంగా ఆంధ్రప్రదేశ్ నుంచి లంబసింగి, గండికోటకు స్థానం లభించడం విశేషం.

50 కోట్ల రూపాయలు..
లంబసింగి పరిసర ప్రాంతాల పర్యాటక అభివృద్ధి కోసం అధికారులు 50 కోట్ల రూపాయలతో డీపీఆర్‌లు సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వ దృష్టికి పంపారు. స్వదేశీ దర్శన్‌లో లంబసింగికి అనుబంధంగా ఉన్న పర్యాటక ప్రాంతాలేంటో చూద్దాం. లంబసింగి ఘాట్ వ్యూ పాయింట్ , చెరువులవేనం, తాజంగి బొట్, కొత్తపల్లి జలపాతాలు, యర్రవరం జలపాత అందాలు, తదితర ప్రాంతాలు ఇందులో ఉన్నాయి. వీటిన్నింటిని అభివద్ధి చేసే దిశలో భాగంగానే ప్రభుత్వం దృష్టి సారించింది. లంబసింగి పర్యటనకు వచ్చే పర్యాటకుల కోసం రెండు మూడు రోజులు ఇక్కడే ఉండి సందర్శించేందుకు వీలుగా ప్రణాళికలు చేస్తున్నారు అధికారులు.
ప్రత్యేక బస్సులు..
విశాఖపట్నం నుంచి లంబసింగి ప్రాంతానికి వెళ్లేందుకు ప్రత్యేక బస్సులు కూడా నడుపోతుంది ప్రభుత్వం. లంబసింగితో పాటు, కొత్తపల్లి వాటర్ ఫాల్స్, పాడేరు పరిసర ప్రాంతాలను ఒకే రోజులో చూసేలా ప్రత్యేక ప్యాకేజీలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఎలా చేరుకోవాలి ?
లంబసింగికి సమీపంలో విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్ 106 కిలోమీటర్ల దూరంలో ఉంది. విశాఖపట్నం రైల్వే స్టేషన్ 114 కిలోమీటర్ల దూరంలో ఉంది. నర్సీపట్నం రైల్వేస్టేషన్ కూడా ఉంది. ప్రభుత్వ బస్సులలో వచ్చేవారు నర్సీపట్నం, వైజాగ్, చింతపల్లి నుంచి 19 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. తదితర ప్రాంతాల నుంచి బస్సులలో రావొచ్చు.



Click it and Unblock the Notifications












