Search
  • Follow NativePlanet
Share
» » సిక్కోలు తీరంలో ప‌ర్య‌టిద్దాం రండి..

సిక్కోలు తీరంలో ప‌ర్య‌టిద్దాం రండి..

సిక్కోలు తీరంలో ప‌ర్య‌టిద్దాం రండి..

సహజసిద్ధమైన ప్రకృతి అందాలు.. పరవళ్లు తొక్కుతూ మైళ్ల దూరం వడివడిగా సాగుతూ సాగరాన కలిసే వంశధార నదీ సంగమ స్థలం. వేకువ జామునే అలలకు ఎదురెళ్లి, వేట సాగించే మత్య్సకారులు.. తిరిగి వారి రాక కోసం ఎదురుచూస్తూ ఇసుక తిన్నెలపై కనిపించే మహిళలు, చిన్నారులు.. చుట్టూ ఎన్నో ఏళ్ల నాటి చారిత్రక కట్టడాలు. మార్గంమధ్యలో కనిపించే ప్రాచీన కళాసంపద శ్రీకూర్మం, శాలివాహన శకం నాటి బౌద్ధ ఆరామాలు. ఓవైపు పంట పొలాలు మరోవైపు పరవళ్లు తొక్కుతూ ముందుకు సాగే వంశధార నదీ సోయగం.. ఎన్నో ప్రత్యేకతలకు నిలయం శ్రీకాకుళం జిల్లాలోని కళింగపట్నం సముద్రతీరం.. అంతటి చక్కటి విశేషాల సమాహారాన్ని వీక్షిద్దామా..

ఆదివారం సెలవు కావడంతో కళింగపట్నం తీరంతో పాటు బౌద్ధ ఆరామాలకు నిలయంగా ఉన్న శాలిహుండం చూడాలని నిర్ణయించుకున్నాం. వెంటనే నా మిత్రుల‌కు టూర్ ప్లాన్ చెప్పాను. మొత్తం పన్నెండు మందిమి. రాను పోను సుమారు 56 కిలోమీటర్లు. రెండు కార్లలో బయల్దేరాం. ఉదయాన్నే అయితే-సాగర తీరం బాగుంటుందని ఉదయం ఆరు గంటలకే ప్రయాణం మొదలెట్టాం.

sikkolubeach

నక్షత్రపు తాబేళ్ల పలకరింపు

చుట్టూ జీడిమామిడి తోటల మధ్యలో పచ్చదనంతో కళకళలాడే పంటపొలాల నడుమ సువిశాలంగా నాలుగేళ్ల క్రితమే వెడల్పు | చేసిన రహదారి. ఆగకుండా 13 కిలోమీటర్లు ముందుకు సాగాం. శ్రీకూర్మం రానే వచ్చింది. అది చిన్న కుగ్రామమే అయినా పర్యాటకులకు ఆకట్టుకునే ఎన్నో అందాలు అక్కడున్నాయి. ప్రాచీన కాలం నాటి శ్రీకూర్మనాథ ఆలయానికి చేరుకున్నాం. ఈ ఆలయం 16 శతాబ్దిలో నిర్మించారు. అరుదైన శిల్ప సంపద ఇక్కడ గోడలపై కనిపిస్తుంది. పూర్తిగా రాతికట్టడమే అయినా నేటికీ చెక్కుచెదరని కళారూపాలున్నాయి.

ఆలయ ప్రాంగణంలో నక్షత్రపు తాబేళ్లు కనిపించాయి. ఆలయం దగ్గర్లోని దుకాణాల్లో గోంగూర, ఇతర రకాల ఆకుకూరలు విక్రయిస్తున్నారు. ఇక్కడ ఆకుకూరలు అమ్మడమేంటని మాలో మేమే అనుకున్నాం. లోపలికి వెళ్లాక విషయం అర్థమైంది. అక్కడున్న నక్షత్రపు తాబేళ్ళకు ఆకుకూరలే ఆహారం. యాత్రీకులు ఆకుకూరలు కొనుక్కొచ్చి, వాటికి ఆహారంగా వేస్తున్నారు. మేమూ వెనక్కి వెళ్లి ఆకుకూరలు తీసుకొచ్చి వాటికి అందించాం. మేమంతా తాబేళ్లను చూసి మురిసిపోయాం. వాటిని చేతులతో తాకితే ముడుచుకుంటున్నాయి. చిన్నా పెద్ద కలుపుకుని, అక్కడ ఆరు వందలకు పైగా నక్షత్రపు తాబేళ్లు సంచరిస్తున్నాయి. వాటితో కొంతసేపు ఆడుకున్నాం.

శాలిహుండం అందాలు!

శ్రీకూర్మం మరో ఎనిమిది కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత గార మండల కేంద్రానికి చేరుకున్నాం. ఈ కేంద్రం నుంచి బూరవల్లి రోడ్డు వైపు తిరిగి కిలోమీటరు ప్రయాణిస్తే అక్కడే పెద్దకొండ కనిపించింది. గార మండల కేంద్రానికి ఆనుకుని సుమారు రెండున్నర కిలోమీటర్ల పొడవున్న కొండ ప్రాంతమది. ఈ కొండ చుట్టూ కట్టుదిట్టమైన భద్రత ఉంది. కార్లు ఆపి, కొండపైకి వెళ్లే మార్గంలో కాలినడక మొదలు పెట్టాం. చుట్టూ అందమైన పూలమొక్కలు, పార్క్ తరహాలో ఏర్పాటుచేసిన పచ్చిక బైళ్లు. కొండ ఏటవాలు ప్రాంతంలో కనిపిస్తున్న పురాతనకాలం నాటి భవనం. అలా కాలినడకన అక్కడికి చేరుకున్నాం.

అది పురావస్తుశాఖ మ్యూజియం. లోపలికి వెళ్లాం. అక్కడ గాజు పెట్టెల్లో భద్రపరచిన ప్రాచీన కాలం నాటి మట్టి కుండలు, నాణేలు, ప్రాచీన కాలంలో వినియోగించిన పరికరాలు, ఇటుకలు, ఇలా రాతిపై చెక్కిన శాసనాలు కనిపించాయి. రాతిపై ముద్రించిన శాసనాలు గ్రీకు, పారసీ బాషల్లోనే ఉన్నాయి. అక్కడ కనిపిస్తున్న వస్తువులన్నీ కొండపై జరిపిన తవ్వకాల్లో బయటపడ్డాయని అక్కడి ఉద్యోగి చెప్పారు. చుట్టూ మట్టితో కప్పబడి.. తవ్వకాల్లో బయల్పడిన బౌద్ధ స్థూపాలు కనిపించాయి.

sikkolubeach1

పెద్దపెద్ద ఇటుకలు ఒకదానిపై ఇంకొకటి పేర్చినట్టు అపురూప కళాసంపద కనిపించింది. బౌద్ధుల ప్రార్ధనా మందిరం, నివాస ప్రాంతాలు, సొరంగ మార్గాలు, పురాతన కట్టడాలు చూడచక్కగా ఉన్నాయి. స్థూపం పైన ధర్మచక్రం ఆకారంలో పైకప్పు అమర్చినట్టుగా కనిపిస్తోంది. అవన్నీ చూసేసరికి మధ్యాహ్నం ఒంటిగంట దాటింది. అక్కడి నుంచి కిలోమీటరు దూరం ప్రయాణించి గార మండల కేంద్రానికి చేరుకున్నాం. అక్కడ రోడ్డుపక్కనే చిన్న హోటల్లో భోజనాలు కానిచ్చాం. అక్కడికి కళింగపట్నం తీరం 13 కిలోమీటర్ల దూరం. గార దాటిన తర్వాత రోడ్డుకు ఆనుకునే వంశధార నది కొంతదూరం కలసి ప్రయాణం చేసినట్టు ఉంటుంది.

తీరపు సౌందర్యం

కళింగపట్నం తీరం ప్రయాణంలో విసిరి పారేసినట్టు కనిపించే కుగ్రామాలు అక్కడక్కడా చూడముచ్చటగా కనిపిస్తాయి. తీరానికి ముందే కళింగపట్నం గ్రామం. జిల్లాలోనే అతిప్రాచీనమైన ఊరు ఇది. ఇక్కడ ఆరువేల మంది నివాసముంటున్నారు. ఊరంతా మత్యకారులే. అక్కడక్కడ చిరువ్యాపారులు కనిపిస్తారు. స్థానిక ప్రజలకు సముద్రంలో చేపల వేటే జీవనాధారం. ఈ ప్రాంతంలో డచ్, బ్రిటీష్ వాళ్లు వలస వచ్చి, వ్యాపారం చేసేవారట! వారు ఇక్కడ నివసించిన ఆనవాళ్లు ఇప్పటికీ అక్కడక్కడా కనిపిస్తున్నాయి. డచ్ వారు నిర్మించిన చర్చి వంశధార నది ఒడ్డునే కనిపించింది. కళింగపట్నంలో 1806లో నిర్మించిన లైట్ హౌస్, వాతావరణ పరిశోధనా కేంద్రం, సముద్ర గర్భంలో మునిగిన యాంకరు బోటు ఆనవాళ్లు కనిస్తుంటాయి.

సిబ్బంది అనుమతితో లోపలి మెట్ల గుండా పైకి చేరుకున్నాం. సముద్రం లోపలి దూరప్రాంతంతో పాటు చుట్టూ ఉన్న గ్రామాలు అక్కడి నుంచి కనిపించాయి. వేటకు వెళ్లిన మత్స్యకారులు ఒడ్డుకు చేరే సమయంలో మేం అక్కడికి చేరుకున్నాం. పడిలేస్తున్న అలలపై మత్స్యకార పడవలు పైకి కిందకి ఎగురుతూ కనిపించాయి. వేటకి వెళ్లిన వారికోసం ఎదురు చూస్తున్న మహిళలు, చేపలు కొనేందుకు వచ్చిన వ్యాపారులు, కుటుంబసభ్యుల రాక కోసం ఎదురు చూస్తున్న చిన్నారులు కేరింతలు కొడుతుంటే వారిని చూసి ముచ్చటపడ్డాం. సముద్రంలో పట్టి తెచ్చిన చేపలను దగ్గరగా చూడడం మాకు ఇదే మొదటిసారి.

కారలు, కానాగర్తలు, నత్తలు, కోనాం చేపలు, గొరసలు, నెత్తళ్లు, రొయ్యలు, పీతలు, కోమటి సంచులు, సొర చేపలు... ఇలా మాకు తెలియని రకాలెన్నో! వాటి గురించి మత్స్యకారులను అడిగి తెలుసుకున్నాం. తీరంలో ఎపి టూరిజం ఆధ్వర్యాన కాటేజీలు, హోటల్ నిర్మించారు. ఇంకా పూర్తిస్థాయిలో సౌకర్యాలు క‌ల్పించాల్సిన అవ‌స‌రం ఉంది. తీరంలో అమర్చిన బుద్ధుని విగ్రహం, ఏనుగులు, ఒంటెలు, జిరాఫీ, డైనోసార్లు ఏర్పాటు చేశారు. కానీ, ఇటీవ‌ల తుఫాను కార‌ణంగా దెబ్బ‌తిన్నాయి.

ఇక్కడే వంశధార నది బంగాళాఖాతంలో కలుస్తున్న సంగమ స్థలం ఉంది. ఈ ప్రదేశంలో కొందరు మత్యకారులు చిన్న తెప్పలపై ప్రయాణిస్తూ చేపల వేట సాగిస్తున్నారు. ఈ ప్రదేశంలో పెద్దగా అలల తాకిడి కనిపించక పోవడం వల్ల పెద్దసరస్సులాగే కనిపిస్తోంది. అయితే ఇక్కడ నీటిలోకి దిగితే ప్రాణాలు కోల్పోతారంటూ చుట్టూ హెచ్చరిక బోర్డులు అమర్చారు.

ఇలా సాగిన మా జర్నీ మంచి అనుభూతినివ్వడంతో పాటు, కొత్తకొత్త విషయాలు తెలుసుకునేలా చేసింది. శ్రీ‌కాకుళం జిల్లా కేంద్రం నుంచి నిత్యం ఆర్‌టిసి బ‌స్సులు అందుబాటులో ఉంటాయి. అవ‌కాశం ఉన్నంత‌వ‌ర‌కు సొంత‌వాహానాల్లోనే ప్ర‌యాణించిన‌ట్ల‌యితే ఒకేరోజులో వీట‌న్నింటిని చూసే అవ‌కాశం ఉంటుంది. అయితే, మ‌రెందుకాల‌స్యం మీరు కూడా మీ ప్ర‌యాణాన్ని ఇక మొద‌లుపెట్టండి.

More News

    Read more about: kalingapatnam srikakulam
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+